Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సోనియా స్వయంకృతాపరాధం

$
0
0

భారతదేశ చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌పార్టీ బలహీనమై ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోనున్నదని తలలు పండిన రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తు న్నారు. ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు కన్పడుతున్నాయి. కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది సోనియాగాంధీ నాయకత్వం. ఆమె ఈ దేశానికి కోడలుగా వచ్చారు. కాని తెలుగు ప్రజలమధ్య గోడలు కట్టారు. రాజకీయ లబ్దికోసం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించారు. మతతత్వ బిల్లు పేరుతో బిజెపిని ఇరుకులో పెట్టారు. తెలంగాణలోని దొరల పార్టీతో ఎన్నికల పొత్తుకు సిద్ధపడ్డారు. ఆర్థిక అవినీతిని ఉద్యమంలా వ్యాపింపజేశారు. ఇవన్నీ క్రమక్రమంగా ఆమె మెడకే ఉచ్చులవలె మారాయి. జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై సిఐడి విచారణకు ఆదేశించిన ఆమె తన అల్లుని విషయంలో మెతక వైఖరి ఎందుకు అనుసరించారు? వ్రతంచెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లు దొరల పార్టీలో పది లోక్‌సభ స్థానాల లబ్ధికోసం పొత్తుపెట్టుకొని రాష్ట్రాలు రెండు ముక్కలు చేయడానికి ఆమె సిద్ధపడ్డా ఇప్పుడు దొరలు పొత్తుకు ఇష్టపడటం లేదు. ఉద్యమం నడిపేది మేము ఎంపీలు, ఎంఎల్‌ఏలు అయ్యేది మీరా? అంటూ వారు ఎదురుప్రశ్నవేసి యూటర్న్ తీసుకోవటంతో ఆమె దిమ్మతిరిగిపోయారు. ఇక విదేశీ బ్యాంకులలోని ధనం, దేశంలో ఆర్థిక సంక్షోభం జాతీయ వృద్ధిరేటు పతనం, కిలో ఉల్లి వంద రూపాయలకు చేరటం అవినీతిపై అన్నాహజారే అరవింద్ కేజ్రీవాల్ సాగించిన సమరం ఇవన్నీ సోనియాగాంధీ నాయకత్వాన్ని బలహీనపరచాయి.
భారతదేశానికి ఆంగ్లేయులు ఫ్రెంచివారు అరబ్బులు లోగడ దోచుకోవటం కోసమే వచ్చారు. అయితే సేవాభావంతో మదర్‌థెరీసా సిస్టర్ నివేదిత పోల్టేన్ మెకంజీ, కాటన్ దొర, సి.పి.బ్రౌన్ వంటివారు కూడా ఎందరో వచ్చారు. సోనియాగాంధీ భారతదేశానికి వచ్చినా ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ దేశపు పౌరసత్వం తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. రావటమే రాజకుటుంబంలో మహారాణిలా అడుగుపెట్టారు. వందిమాగధుల పరివారంలో తన రాజ్యాధికారాన్ని పదిలపరుచుకున్నారు. అనారోగ్యం వస్తే అమెరికాకు వెళ్లి పద్ధెమిది కోట్లు ఖర్చుపెట్టి చెక్‌అప్ చేయించుకున్నారని ప్రతిపక్షాలవారు నిలదీశారు. (ఈ అంకె ఇంకా ఎక్కువ కావచ్చు. లేదా తక్కువ కావచ్చు) కాని ఈ ధనమంతా ఎవరిది? ఒక వర్ధమాన దేశానిది.
స్వాతంత్య్రం వచ్చిన అరవై ఏళ్లతర్వాత కూడా ఈ దేశంలో సగం మంది దారిద్య్ర రేఖకు దిగువనే ఉండటం దురదృష్టకరం. అందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఉచితాలు కాదు సముచితాలు ఇవ్వాలి. చేపను దానం చేయటం కాదు చేపను పట్టుకోవటం నేర్పాలి అని ఓ ఆంగ్ల సామెత ఉంది. ప్రజలకు స్వావలంబన లేకుండా చేశారు. సబ్సిడీలతో జాతి ఎంతకాలం బ్రతుకుతుంది? గాంధేయమార్గంనుండి ఇందిరాగాంధేయ మార్గానికి ఆ తర్వాత సోనియాగాంధేయ మార్గానికి జాతి ఆరు దశాబ్దాల ప్రస్థానం సాగింది. ఇందులో సోనియాగాంధీ పాత్ర గణనీయమైనదే. ఐతే మణిశంకర అయ్యర్, అంబికాసోనీ, కపిల్‌సైబల్, అహ్మద్‌పటేల్, కిల్లి కృపారాణి, సుశీల్‌కుమార్ షిండే, ఎస్.ఎం.కృష్ణ, జైరాంరమేష్, చాకో, నారాయణస్వామి, పురంధరేశ్వరి, జయంతి నటరాజన్, గిరిజావ్యాస్, శివరాజ్‌పాటిల్, వి.హెచ్ వంటి వందిమాగధుల పాత్రను తక్కువగా అంచనా వేయనక్కరలేదు. సికిందరాబాదులో ఏకంగా ఆమె గుడినే కట్టించి చెక్క భజన మొదలుపెట్టారు. కాంగ్రెసు పరాజయానికి వీరందరి పాదాభివందనాలు కారణమే. మధ్యప్రదేశ్‌లో దారుణంగా ఓడిపోయిన దిగ్విజయ్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చుపెట్టాడు. ఆమెచేత నామినేట్ చేయబడిన ప్రధానమంత్రి ‘అయామ్ హెల్ప్‌లెస్’ అని బహిరంగంగానే ప్రకటించారు. నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓడిపోయినట్లు ఆమె ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయ ఫలితంగా ‘వాటర్లూ’ చవిచూస్తున్నారు. ఇది స్వయంకృతాపరాధం. అందుకే కాంగ్రెసు నాయకులు మునిగిపోయే పడవ నుండి సురక్షితమైన స్థావరాలకోసం అనే్వషణ మొదలుపెట్టారు. గూడు కూలిపోయింది. చెయ్యి జారిపోయింది.
ఆమె ఇక గెలువదు. నరేంద్రమోడీని గెలువనివ్వదు. గోద్రా భూతం చూపించి ఆయనను అప్రతిష్టపాలు చేస్తున్నారు. మరి 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత మాటేమిటి?? నిన్న ముజఫర్‌నగర్‌లో జరిగిన ముస్లిముల హత్యల సంగతి ఏమిటి?? చెన్నారెడ్డిని గద్దెదించటంకోసం పాతబస్తీలో రెండువందల మందిని చంపించిందెవరు?? వెయ్యి మంది అట్టడుగువర్గాల తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న వారితో ఈమె ఎలా రాజకీయ బేరసారాలు సాగిస్తున్నారు?? వీటికి సమాధానం ఎవరు చెపుతారు?? 2014వ సంవత్సరంలో మన్మోహన్‌సింగ్ సోనియాగాంధీల రాజకీయ శకం సమాప్తమవుతున్నది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి నేటి పరిస్థితులలో వామపక్షాలకు లేదు మరి నరేంద్రమోడీకి ఎ.పి, తమిళనాడు, కేరళ, బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలల్లో ఒక్క సీటు కూడా రాబోవటంలేదు. అలాంటప్పుడు ఆయన ఎలా ప్రధాని కాగలరు?? ఇది భారతదేశానికి గడ్డుకాలం. రాజకీయ సుస్థిరత లేకపోతే ఇండియా మరొక నేపాల్‌గా ఇరాక్‌గా మారిపోతుంది. ఇది నిస్సందేహం చైనా అమెరికాలకు లాభదాయకం!
28.12.2013నాడు శ్రీమతి సోనియాగాంధీ ఒక ప్రకటన చేస్తూ ‘మేము కొన్ని పొరపాట్లుచేసి ఉండవచ్చు. వాటిని క్షమించండి’అని అన్నట్లు పత్రికలలో వార్త వచ్చింది. భారతీయులు ఉదార హృదయులు. ఆమె ఆరోగ్యం బాగుపడి సుఖంగా ఉండాలని కోరుకుందాం. ఆమె కోరుకున్నట్లు దేశ ప్రజలు క్షమించారనే అనుకుందాం. కాని మళ్లీ ఈ తప్పులు పునరావృత్తంకావు- అనే గ్యారంటీ ఏమిటి?? గజినీ మహమ్మదును గుజరాత్ ప్రజలు పదహారుసార్లు క్షమించి వదిలారు. కాని ఏమి జరిగింది? మళ్లీ పదిహేడవసారి కూడా దండయాత్ర చేశాడు కదా??

భారతదేశ చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌పార్టీ బలహీనమై ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోనున్నదని తలలు పండిన రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తు న్నారు
english title: 
sonia
author: 
- ముదిగొండ శివప్రసాద్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>