
అత్యంత పురాతనమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మనిరతికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఖ్యాతి లభిస్తోంది. ముఖ్యంగా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, మమతలు, నైతిక విలువలే పునాదిగా నిర్మింపబడిన మన కుటుంబ వ్యవస్థను పాశ్చాత్యులు ఎంతో గౌరవిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు వేగంగా చొచ్చుకు వస్తున్న పాశ్చాత్య నాగరికత యొక్క దుష్ఫ్రభావం మన భారతీయ సమాజంపై పడుతూ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఎదురైంది. అనేక పెను పోకడలు సంభవిస్తుండగా అందులో ముఖ్యమైనది సహజీవనం. పెళ్లికాకుండానే కలిసి వుండడం, పిల్లల్ని కనడం, దాంపత్య జీవితానికి పెళ్లి అవసరం లేదంటూ ప్రచారం ముఖ్యంగా సెలబ్రిటీలు సాగించడం దురదృష్టకరం. సహజీవనానికి చట్టబద్ధత కల్పించమంటూ ఇటీవల ఒక వర్గం బలమైన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యావత్ ప్రపంచం మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు అనంతమైన విలువ ఇస్తుంటే మనం మాత్రం మన పద్ధతులకు నీళ్లొదిలి పరాయి సంస్కృతిని పట్టుకు వేళ్లాడడం అవివేకం.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
ఆధార్‌ను రద్దు చేయండి
ఏదైనా ఒక ప్రభుత్వ పథకం ప్రారంభిస్తే అర్హులైన లబ్దిదారులు అందరికీ ప్రయోజనం కల్పించేదిగా ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతే పాలక ప్రభుత్వాలు వీటి ప్రారంభానికి శ్రీకారం చుడతాయి. దేశంలో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఆధార్ విశిష్ట గుర్తింపు కార్డు విధానాన్ని పరిశీలిస్తే ఎవరి ప్రయోజనం కోసం ఈ కార్డుల జారీ ప్రారంభించారో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి నెలకొంటున్నది. కనీసం చిరునామా ధృవీకరణలో కూడా ఈ కార్డు ఉపకరించడం లేదు. దీనిపై కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో స్వయంగా అభ్యంతరాలను వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ప్రయోజనాలన్నింటినీ ఆధార్ లింక్ చేసింది. నేరుగా నగదు లబ్ధి పథకానికి తప్పనిసరిగా ఆధార్ లింకు నిబంధన విధించింది. వంట గ్యాస్ సబ్సిడీ పథకానికి లింక్ చేయటంతో ప్రజలు అటు గ్యాస్ కంపెనీ, మరియు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. ఈ కార్డులు తీసుకున్న లబ్దిదారులకు వీటిని పొందకుండా ఉంటేనే మేలనిపించేటట్లుగా ప్రభుత్వ సేవలున్నాయి. కేంద్ర సర్కారు హడావుడిగా ప్రారంభించిన ప్రభుత్వ పథకాలకు ఆధార్ లింకు విధానం అపహాస్యంపాలైంది. ఈ ఆధార్ రద్దుచేస్తేనే మంచిది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు