హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పడిన ప్రయాణికుల అధిక రద్దీ దృష్ట్యా మరిన్ని అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆదివారం నాటికి 9,251 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ వాటికితోడు సోమవారం మరో 526 అదనపు బస్సులు నడిపింది. అయినప్పటికీ రద్దీ తగ్గకపోవడంతో మంగళవారం మరో 249 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా మంగళవారం నాటికి 41,344 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్టవ్య్రాప్తంగా 320 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఎ అధికారులు సీజ్ చేయడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆర్టీసీ అప్రమత్తమై మరిన్ని అదనపు బస్సులు నడపడానికి సిద్ధమైంది. గడిచిన 3, 4 రోజుల్లో దాదాపు 13 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశామని ఆర్టీసీ విసి అండ్ ఎండి జె. పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపేందుకు కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సోమవారం 24017 సీట్లు, మంగళవారం మరో 41,344 సీట్లు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు నగరంలోని ప్రధాన కేంద్రాలైన బిహెచ్‌ఇఎల్, లింగంపల్లి, మదీనాగూడ, కెపిహెచ్‌బి, జీడిమెట్ల, ఇసిఐఎల్, టెలిఫోన్ భవన్, ఎల్‌బి నగర్ తదితర చోట్ల నుంచి ఆయా ప్రాంతాలకు బయలుదేరుతాయని చెప్పారు.
అత్యాచారం కేసులో
ముగ్గురిపై నిర్భయ చట్టం
హైదరాబాద్, జనవరి 13: బాలికపై అత్యాచారం జరిపిన కేసుకు సంబంధించి ముగ్గురిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. గత నెల 21న జరిగిన ఘటనపై బాధితురాల్లి తల్లి సోమవారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ గోపాల కృష్ణమూర్తి చెప్పిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బొంగులూరు చెందిన బాలిక (16) మలక్‌పేటలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సాయి (17), మణికిరణ్ (17) అనే ఇద్దరు యువకులు గత నెల 21న బాలికకు మనె్నగూడకు రావాలని లేకుంటే, ఆసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తూ బాలికకు ఫోన్‌లో సందేశం పంపారు. భయపడ్డ బాలిక వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లింది. ముందస్తు పథకం ప్రకారం బాలికపై మత్తు మందు చల్లి మనె్నగూడ పరిసర ప్రాంతంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వీరికి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి సహకరించాడు. అత్యాచారం విషయాన్ని బాలిక ఆదివారం ఆమె తల్లికి తెలిపింది. దీంతో బాలిక తల్లి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
దుండగుల చేతిలో
గాయపడ్డ పాస్టర్ మృతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: గుర్తు తెలియని దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురై నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాస్టర్ సంజీవులు (45) సోమవారం మృతిచెందారు. గత నెల 10న రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సియోను ప్రార్థనా మందిరంలో గుర్తు తెలియని ముగ్గురు దుండగుల చేతుల్లో పాస్టర్ సంజీవులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజీవులు సోమవారం మృతిచెందారు. సంజీవులు మృతికి ది నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ నేతలు డానియల్ అడామ్స్, ఎబి. ఇమ్మన్యూయల్, ఇస్తార్ రాణి, పాల్ పుల్ల, జి. గుండమ్ నందు పాల్, డేవిడ్ శాంతరాజు తదితరులు సంతాపం తెలిపారు.
రెండు కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్, జనవరి 13: నగర శివారు ప్రాంతం బిఎన్‌రెడ్డి నగర్‌లో రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కె. రాధాకల్యాణ్ (22) అనే వ్యక్తి కొత్తపేటలో నివాసమంటూ ఎల్‌బినగర్‌లో పాన్‌డబ్బా నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం సాయంత్రం రాధాకల్యాణ్ ఎల్‌బి నగర్ నుంచి బిఎన్‌రెడ్డి నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతడి బైక్‌ను తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయి బయటపడింది. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు రాధాకల్యాణ్‌పై గతంలో నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్‌లో కూడా గంజాయి రవాణా కేసు నమోదైంది.