హైదరాబాద్, జనవరి 13: కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం అంశంపై ఆ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌లో విలీనం ఖాయం అంటూ కాంగ్రెస్ జాతీయ నాయకులు ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా, మరోవైపు టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్ల ఏ లక్ష్యంతో తెలంగాణను సాధించుకున్నామో దాన్ని నెరవేర్చే అవకాశం ఎంతవరకు ఉంటుందని తెలంగాణ వాదులు టిఆర్‌ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలుత పార్టీని విలీనం చేయడం ఖాయం అనే అభిప్రాయం టిఆర్‌ఎస్‌లో సైతం బలంగా వినిపించింది. కానీ ఆ తరువాత కెసిఆర్ పార్టీ నాయకులు, తెలంగాణవాదుల నుంచి అభిప్రాయాలు సేకరించినప్పుడు మాత్రం స్వతంత్రంగా ఉండడం వల్లే మనం అనుకున్నది సాధించవచ్చునని సూచించారు. దాంతో కెసిఆర్ సైతం విలీనం గురించి మొదటి చెప్పినంత ఈజీగా చెప్పడం లేదు. ముందు పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందనివ్వండి ఆ తరువాత విలీనం అంశంపై మాట్లాడవచ్చు అంటున్నారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత విలీనం చేస్తాం అని కూడా చెప్పడం లేదు, బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ అంశం గురించి మాట్లాడదాం అని మాత్రమే చెబుతున్నారు. సీమాంధ్రుల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి వచ్చినా తెలంగాణపై ఇచ్చిన మాటకు కాంగ్రెస్ నాయకత్వం కట్టుబడి ఉండి, తెలంగాణ ఏర్పాటు చేస్తోంది, దీనికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది, కాంగ్రెస్‌కు, అదే సమయంలో తెలంగాణకు ప్రయోజనం కలిగే విధంగానే నిర్ణయం ఉంటుందని కెసిఆర్ తెరాస నాయకులకు వివరించారు.
తెరాస కాంగ్రెస్‌లో విలీనం అయితే తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో ఆ ఉద్యమాన్ని ఎవరైతే వ్యతిరేకించారో, ఆ నాయకుల పెత్తనాన్ని తిరిగి అంగీకరించాల్సి వస్తుందని తెలంగాణవాదులు అంటున్నారు. కాంగ్రెస్‌లో తెరాస విలీనం అయినా, విడిగా పోటీ చేసినా తెలంగాణలో నాయకత్వం వహించేంత శక్తి కెసిఆర్‌కే ఉంటుంది కానీ మరో నాయకుడికి ఉండదని, కలిసినా పెద్దగా నష్టం ఏమీ ఉండదని తెరాస నాయకులు కొందరు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన టిజెఎసితో పాటు వివిధ ఉద్యమ సంస్థలు మాత్రం తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమించిన తెరాస స్వతంత్రంగా ఉంటేనే ఉద్యమ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. కెసిఆర్ మాత్రం పార్టీ నాయకులతో జరిగే చర్చల్లో స్వతంత్రంగా ఉంటామనే చెబుతున్నారు. మరోవైపు టిడిపితో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు సైతం తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. సోమవారం దిగ్విజయ్‌సింగ్ విలీనం గురించి మరోసారి ప్రస్తావించారు. బిల్లు ఆమోదం తరువాత విలీనం గురించి చర్చించవచ్చునని అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న రోజే దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత తెరాస ప్రాధాన్యత తగ్గిపోతుందని, ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే భావన బలంగా ఉండేది. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే కెసిఆర్ ఇంటి వద్ద ఇద్దరు మనుషుల కన్నా ఎక్కువ మంది ఉండరని గతంలోనే రాజ్యసభే సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన సభలు వెలవెలబోయాయి, తెరాస సభలకు స్పందన కొనసాగింది. అప్పటివరకు విభజన అంశంలో కెసిఆర్‌ను పక్కన పెట్టిన కాంగ్రెస్ నాయకత్వం తిరిగి తన వైఖరి మార్చుకుంది. మరోవైపు ఈ రెండు పార్టీలు విలీనం అయితే తాము రెండో స్థానంలో ఉండవచ్చునని టిడిపి నాయకులు భావిస్తున్నారు. విలీనం అవుతామని ముందు హామీ ఇచ్చినందున విలీనం కావాలని టిటిడిపి నాయకులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం అంశంపై ఆ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
english title:
t
Date:
Tuesday, January 14, 2014