హైదరాబాద్, జనవరి 13: సాధారణ ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలుచేయడంలో అధికార యంత్రాంగానికి ఉదాసీనత తగదని, తీర్పుల అమలును ఒక సంప్రదాయంగా భావించరాదని ఉన్నత న్యాయస్థానం హైకోర్టు పేర్కొంది. కేసుల పూర్వపరాల విస్మరించి, కేవలం ఆయా కేసుల వ్యక్తులకు లేదా పరిస్థితులకు మాత్రమే పరిమితం కావడం సరికాదని, రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులను విస్తృత దృష్టితో చూడాలని జస్టిస్ సివి నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వ్యాజ్యాలు పునరావృతం కాకూడదంటే న్యాయస్థానాల తీర్పులను మరింత సున్నితమైనవిగా, సునిశితమైనవిగా చూడాలని అన్నారు. న్యాయస్థానాల తీర్పులపై ఆదేశాలు ఇవ్వడంతోనే తమ పని అయిపోయిందని అనుకోరాదని, ఆ ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. నారాయణగూడ పోలీసులు తన కేసును రిజిస్టర్ చేయలేదని పేర్కొంటూ ఎవి సంతోష్‌కుమార్ దాఖలు చేసిన పిటీషన్‌పై న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. 2013 నవంబర్ 11న తాను డెల్టా కేబ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో భాగస్వామి అయిన తనకు పెట్టుబడిపై వాటా లేదా వడ్డీ చెల్లించడం లేదని సంతోష్‌కుమార్ పేర్కొంటూ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా తాను ఫిర్యాదును పోలీసులకు పంపించానని అన్నారు. కావాలనే ఫిర్యాదును తొక్కిపెట్టినట్టు గుర్తించిన హైకోర్టు విచారణాధికారి సొంత నిధుల నుండి నవంబర్ 11 నుండి డిసెంబర్ 12 వరకూ రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.
అధికారుల ఉదాసీనతపై హైకోర్టు
english title:
k
Date:
Tuesday, January 14, 2014