హైదరాబాద్, జనవరి 13: ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివారికి, తెల్లరేషన్ కార్డు లేనివారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) ద్వారా వైద్య చికిత్సలను అందిస్తోన్న ఆర్థిక సహాయాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య చికిత్సలు పొందాలంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా, ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ఎవరైనా హైదరాబాద్‌కు రావాల్సిందే. రోజుల తరబడి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే తప్ప సిఎంఆర్‌ఎఫ్ పొందడం దుర్లభంగా ఉండేది. కొన్ని కేసుల్లో అయితే చావుబతుకుల మధ్య ఉన్న రోగులను సైతం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అంబులెన్స్‌ల్లో, స్ట్రేచర్లపై తీసుకొచ్చి ఎషేన్షయల్ సర్ట్ఫికేట్ తీసుకుంటే తప్ప కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి అవకాశం ఉండేది కాదు. ఎక్కడో మారుమూల, సుదూర ప్రాంతాల నుంచి రోగులు హైదరాబాద్‌కు వచ్చి సిఎంఆర్‌ఎఫ్ నుంచి లేఖ తీసుకోవాల్సి ఉండేది. దీనికితోడు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం పొందాలంటే ఎమ్మెల్యేల నుంచి సిఫారసు లేఖను పొందాలన్న అనధికార నిబంధన ఉండేది. వాస్తవానికి ఎమ్మెల్యేల లేఖ లేకుండానే సిఎంఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. కానీ కొంతమంది అధికారులు ఈ నిధికి ఎమ్మెల్యేల లేఖతో ముడిపెట్టడంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి లేఖ తీసుకోవడం ఒక ఎత్తయితే, అంతకుముందు ఎమ్మెల్యేల నుంచి సిఫారసు లేఖ తీసుకోవడం మరో సమస్యగా ఉండేది. ఫలానా వాడు తమ పార్టీకి చెందినవాడు కాదనుకుంటే ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వడానికి నిరాకరించే ఉదంతాలు కూడా ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు లేకపోయినా, ఆరోగ్యశ్రీ పరధిలోకి రాని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయాన్ని అందించే ఉద్దేశంతో సిఎంఆర్‌ఎఫ్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసారు. ప్రజాప్రతినిధుల సిఫారసులతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకుంటే చాలు వైఎస్ హయాంలో ఉదారంగా సాయం అందేది. ఆ తర్వాత నిధుల కొరతతో ఈ పథకాన్ని మొక్కుబడిగా కొనసాగించారు. పైగా ఎవరైనా ముఖ్యమంత్రికి దగ్గరి వ్యక్తులు సిఫారసు చేస్తే తప్ప ఈ నిధి నుంచి సాయం అందేది కాదు. అయితే సిఎంఆర్‌ఎఫ్ వల్ల ప్రభుత్వానికి మంచిపేరుతో పాటు, వేలాది మంది మధ్యతరగతి వారికి మేలు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం గ్రహించింది. సిఎంఆర్‌ఎఫ్ దుర్వినియోగం కాకుండా నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారికి ఈ బాధ్యతను అప్పగిస్తే సద్వినియోగం అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావించారు. ఐఏఎస్ అధికారి మురళికి సిఎంఆర్‌ఎఫ్ బాధ్యలను అప్పగించిన తర్వాత ఈ పథకానికి మునుపటి పేరును అనతికాలంలోనే తీసుకురావడానికి ఆయన కృషి చేసారు. సిఎంఆర్‌ఎఫ్ పొందడానికి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలోనూ సిఎంఆర్‌ఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన చేసిన సిఫారసును ప్రభుత్వం ఆమోదించింది.
దీంతో సిఎంఆర్‌ఎఫ్ కింద సహాయం పొందగోరేవారు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, కర్నూలు, తిరుపతి, వరంగల్, ఆదిలాబాద్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంతో పాటు పై ఏడు కేంద్రాలలోనూ సిఎంఆర్‌ఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇవీ పని చేయనుండటంతో పేద, మధ్యతరగతి ప్రజానీకానికి శుభావార్తే.
కొత్తగా మరో ఏడు కేంద్రాలు ఏర్పాటు
english title:
a
Date:
Tuesday, January 14, 2014