హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై అసెంబ్లీలో చర్చ తరువాత ఓటింగ్ ఉండదని, అదే విధంగా బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు కూడా ఉండదని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. వివిధ పార్టీల్లోని టి.నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే బిల్లుపై చర్చలు సాగిస్తున్నారు. టిజెఎసి నాయకులు అన్ని పార్టీల తెలంగాణ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. మున్సిఫ్ కోర్టు తీర్పును చాలెంజ్ చేయవచ్చు, చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లవచ్చు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మున్సిప్ కోర్టుకు వెళ్లలేం ఇప్పుడు ముసాయిదా బిల్లు వ్యవహారం కూడా అలానే ఉందని టిఆర్‌ఎస్ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది, రాష్టప్రతి ముసాయిదా బిల్లు పంపించారు, ఈ బిల్లుపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది కానీ అసెంబ్లీకి కాదని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ అంశంపై రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ సుదర్శన్‌రెడ్డితో తెలంగాణ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. బిల్లు ఆగడానికి ఎలాంటి అవకాశం లేదని ఆయన తెలంగాణ నాయకులకు వివరించారు. న్యాయనిపుణుతో కూడా టిఆర్‌ఎస్, టిజెఎసి నాయకులు చర్చిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ రెండు రోజులకు మించి చర్చించలేదు, మన రాష్ట్రంలో చర్చకు ఆరువారాల గడువు ఇచ్చారు. బిల్లును అడ్డుకొని చర్చించకుండా చేసిన సభ్యులు ఇప్పుడు పొడిగించాలని అడగడంలో ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసునని తెలంగాణ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వారి ఎత్తుగడను ముందే గ్రహించి రాష్టప్రతి హైదరాబాద్ పర్యటనలో ఈ విషయాన్ని వివరించినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాల్లోనో ఒక రోజు, రెండు రోజులు మాత్రమే చర్చ జరిగిందని, అయితే ఇక్కడ మాత్రం ఆరువారాల గడువు ఇచ్చారని తెలంగాణ నాయకులు గుర్తు చేస్తున్నారు. అంతకు మించి గడువు ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని తెలంగాణ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
విభజన బిల్లుపై ఓటింగ్ ఉండదని, అందుకే స్పీకర్ సైతం సభలో ఓటింగ్‌పై స్పష్టమైన వైఖరి చెప్పలేదని అంటున్నారు.
ఓటింగ్ ఉంటుందని రూలింగ్ ఇవ్వాలని వైకాపా సభ్యులు పదే పదే డిమాండ్ చేసినా స్పీకర్ అంగీకరించలేదు, చర్చ జరిగిన తరువాత అడగాల్సింది, ముందే అడగడం సరికాదని అన్నారు కానీ చర్చ తరువాత అడిగితే ఓటింగ్ ఉంటుందని చెప్పలేదని టిఆర్‌ఎస్ సభ్యులు తెలిపారు. 23న బిల్లు ఢిల్లీకి వెళ్లక తప్పదు, పొడిగింపు ఉండదు అదే సమయంలో బిజెపి తెలంగాణకు మద్దతు విషయంలో మాకు ఎలాంటి అనుమానం లేదని టిఆర్‌ఎస్, టిజెఎసి నాయకులు చెబుతున్నారు. బిజెపి అగ్రనాయకులు తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారని టిఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు.
టి.బిల్లుపై తెలంగాణ వాదుల ధీమా
english title:
o
Date:
Tuesday, January 14, 2014