
ఏలూరు, జనవరి 15: ఏటా సంప్రదాయం పేరుతో అన్నివర్గాలు కలిసి కోడిపందాలు నిర్వహించుకోవటం పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణంగా జరుగుతుంటుంది. దీనిలో పార్టీ బేధం, వర్గ బేధాలు ఎక్కడా కన్పించేవి కావు. కానీ ఈసారి ఎన్నికల సంవత్సరం కావటంతో ఆ ప్రభావం చాలాచోట్ల స్పష్టంగా కన్పించింది. ఎవరి వర్గాన్ని వారు దగ్గరకు చేర్చుకుంటూ, ఎవరి పార్టీని వారు ఇటువంటి సందర్భంలోనూ బలపర్చుకుంటూ పందాలకు దిగారంటే ఆతిశయోక్తి కాదు. కోడిపందాల వ్యవహారంలో ఇది కొత్త కోణంగానే చెప్పుకోవాలి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా మూడురోజులపాటు వౌఖిక అనుమతులు రావటం, దానికి తగ్గట్టు భారీగానే పందాల ఏర్పాట్లు జరిగిపోవటం తెల్సిందే. యధాప్రకారం కోట్ల రూపాయల్లోనే ఈ పందాలు సాగిపోవటం, రెండురోజుల్లో దాదాపుగా రెండువందల కోట్ల రూపాయల మేర పందాల రూపంలో చేతులుమారినట్లు ఒక అంచనా ఉంది. అయితే ఇది రానున్న కొద్ది గంటల్లోనూ మరింత భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని కూడా చెపుతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా జూదాల సూపర్‌బజార్లు అన్నిచోట్ల వెలిశాయి. రోజుల తరబడి పేకాట శిబిరాలు, గుండాట, కోతాట ఇలా అనేకరకాలైన జూదాలకు ఈ ప్రాంతాలు కేంద్రాలుగా మారిపోయాయి. అంతేకాకుండా రాజధాని స్ధాయి నుంచే ప్రముఖులు పందాలకు హాజరుకావటం ఈసారి కూడా జరిగిపోయింది. ఏదీఏమైనా ఈస్థాయిలో జాతర జరుగుతున్న సందర్భాల్లో మద్యం సిండికేట్లు దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాయనే చెప్పుకోవాలి. ప్రతిచోటా రెండు,మూడు బెల్టుషాపులు అక్కడికక్కడే ఏర్పాటు అయ్యాయి. దీనికోసం ప్రత్యేకంగా షామియానాలు, భారీగా కుర్చీలు, బల్లలు ఏర్పాటుచేసి మరీ అవసరమైన తినుబండారాలను అందుబాటులోకి తీసుకువచ్చి నిర్భయంగా బహిరంగంగానే మద్యం విక్రయాలు జరిగిపోయాయి. ఈ విక్రయాలే కోట్ల రూపాయల్లో ఉంటాయని చెపుతున్నారు. ఇక ఈ ఏడాది వచ్చిన కొత్త పరిణామంగా ఎన్నికల ప్రభావాన్ని చెప్పుకోవచ్చు. అయా పార్టీల నేతలు తమ పలుకుబడిని నిరూపించుకునేందుకు సొంతంగా పందాల బరిలు ఏర్పాటుచేసుకోవటం విశేషం. డెల్టా ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో నిలుస్తారనుకున్న పెద్ద నాయకులంతా సొంతంగా ఈ పందాల ఏర్పాట్లు చేయటం గమనార్హం. ఇటువంటి పందాల ప్రాంతాలకు దాదాపుగా ఆ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలే భారీగా హాజరుకావటం మరో విశేషం. ఇదే సమయంలో వర్గాల వారీగా కూడా పందాల బరులు విడిపోయాయని చెపుతున్నారు. డెల్టా ప్రాంతంలో అన్ని పార్టీల్లోనూ కీలకమైన వర్గంగా నిలుస్తున్న సామాజిక వర్గం సొంతంగా ఈ బరులను ఏర్పాటుచేసుకుంది. దీంతో మిగిలిన వర్గాలు కూడా తమ బరులు ఏర్పాటుచేసుకున్నారు. మోస్తరు పందాల నుంచి పెద్ద పందాల వరకు ఇదే పరిణామం చోటుచేసుకున్నట్లు కన్పిస్తోంది. ఈ విధంగా భారీగా నగదు చెలామణి అయినా ఆ నగదు అంతా తమ వర్గం పరిధిలోనే ఉండేలా ఈ నిర్వాహకులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెపుతున్నారు. ఈ పరిస్థితి ఇలాఉంటే మరో ఆందోళన కూడా పందెగాళ్లలో గట్టిగా కన్పిస్తోంది. గతం నుంచి దొంగనోట్ల చెలామణి వ్యవహారం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా బయటపడటం తెల్సిందే. దీంతో ఇప్పుడు ఆ దొంగనోట్లు పందాల బరుల్లోకి కూడా ప్రవేశించాయన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల నోట్లను తనిఖీ చేసుకునే ఏర్పాట్లు కూడా చేసినట్లు చెపుతున్నారు. ఇవే ఇలా ఉంటే పేకాట శిబిరాలు ఈసారి మరింత విశృంఖలంగా వెలసాయని చెపుతున్నారు. దాదాపు ప్రతిచోటా పేకాటకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటుచేసి గంటల తరబడి, రోజుల తరబడి ఈ ఆట కొనసాగేలా ఏర్పాట్లు చేశారని చెపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు యంత్రాంగం ప్రస్తావన లేకపోవటం, గతంతో పోలిస్తే పందాలు మరింత విస్తృతంగా జరగటం గమనార్హం. ప్రధానంగా జిల్లాలోని భీమవరం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, కాళ్ల, పాలకొల్లు, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, పోలవరం, లింగపాలెం తదితర ప్రాంతాల్లో భారీ పందాలు కొనసాగిపోయాయి. టిడిపి నేత తలసాని శ్రీనివాసయాదవ్, వర్ధమాన సినీహీరో తనిష్ వంటివారు ఈ కోడిపందాలను తిలకించారు. అలాగే కోడిపందాల లైవ్‌షోలు కూడా ఈసారి ఈ పందాలకు కొత్త ఆకర్షణగా నిలిచాయి. ఇదివరకు పోలీసు భయంతో కొంత తగ్గిఉండే పందెగాళ్లు ఈసారి ఆ పరిస్థితి లేకపోవటంతో బహిరంగ ప్రదర్శనకు దిగారు. ఔత్సాహికులను పందాలకు ఆకర్షించేవిధంగా కొన్ని పట్టణాల్లో ఫంక్షన్ హాలులలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటుచేసి కోడిపందాల ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో
కోడి పందాలు దృశ్యం