
హైదరాబాద్, జనవరి 15: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు కొంతలో కొంత తీరనున్నాయి. వచ్చే రెండు నెలల్లో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అదనంగా 2100 మెగావాట్ల విద్యుత్ కలవనుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులను ఏపి జెన్కో పూర్తి చేసింది. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు తుదిదశలో ఉన్నాయి. వచ్చే నెల మొదటివారంలో కృష్ణపట్నం 800 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు జెన్కో కసరత్తు ప్రారంభించింది. రెండో యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్‌ను మార్చి నెలలో గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. విశాఖపట్నంలో హిందుజా నేషనల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనుంది. దీనివల్ల మరో రెండు నెలల్లో అదనంగా 2100 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి లభ్యమవుతుంది. దిగువ జూరాల వద్ద 240 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. వచ్చే రెండు నెలలో 80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బైన్లు, అనంతరం వచ్చే రోజుల్లో 160 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న నాలుగు యూనిట్లు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఈ ఏడాది అదనపు విద్యుత్ సామర్థ్యం కొత్తగా 3000 మెగావాట్లకు చేరుతుంది. ఈ వివరాలను జెన్కో సిఎండి విజయానంద్ తెలిపారు.
ఇక ‘సర్దుబాటు’కు ముగింపు
మరో రెండు ఇంధన సర్దుబాటు చార్జీల వాయిదాలు ఉన్నాయి. వీటిని ఏపిఇఆర్‌సి అనుమతితో ఈ ఏడాది ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల వసూలు ముగిసిన తర్వాత ఇక ఇంధన సర్దుబాటు చార్జీల వసూలు ఉండదు. కాని సాలీనా ట్రాన్స్‌కో ఏపిఇఆర్‌సికి సమర్పించే వార్షిక నివేదికలోనే విద్యుత్ కొనుగోలు వల్ల పడిన వ్యయ భారాన్ని టారిఫ్‌లో కలుపుతుంది. దీనివల్ల సాలీనా డిస్కాంలు 15శాతం విద్యుత్ చార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయి. వార్షిక నివేదికలోనే విద్యుత్ కొనుగోలు వల్ల పెరిగిన వ్యయం వివరాలను చేర్చాలని గతంలోనే ఏపిఇఆర్‌సి ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే.