
న్యూఢిల్లీ,జనవరి 15: శుక్రవారం జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా తయారైంది. బిజెపి లోక్‌సభ ఎన్నికల కోసం తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని భావించింది. దీని కోసం ఏఐసిసి సర్వసభ్య సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోవాలనుకున్నారు. అయితే అమేథీలో రాహుల్ గాంధీపై తమ పార్టీ అభ్యర్థి కుమార్ అవస్థిని రంగంలోకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించటం, అవస్థి అక్కడికి వెళ్లి పెద్ద బహిరంగసభ నిర్వహించి రాహుల్‌ను సవాల్ చేయటంతో పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. అయితే పార్టీ ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధమేనని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధమేనని ఆయన పరోక్షంగా సూచించినట్లు భావిస్తున్నారు. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మాత్రం రాహుల్‌ను కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని కుండబద్దల కొట్టినట్లు చెబుతున్నారు. రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై దిగ్విజయ్ ఇంత గట్టిగా మాట్లాడటం అంటే పార్టీ అధినాయకత్వం స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగే ఉంటుందని, ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాహుల్ అభ్యర్థిత్వాన్ని దిగ్విజయ్ వ్యతిరేకిస్తున్నారని భావించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోందని, ఇందుకు భిన్నంగా రాహుల్‌ను ధాని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడిని ఎంచుకునే ఎంపీల హక్కులను హరించటం మంచిది కాదని ఆయన వాదిస్తున్నారు.
రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం వలన అతనికి రాజకీయంగా నష్టం కలుగుతుందని కూడా దిగ్విజయ్ చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదన్నది ఆయన వాదన. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడటం వలన పార్టీ ప్రతిష్ఠ బాగా దెబ్బతిన్నదని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీకి పరాజయం ఎదురవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని దిగ్విజయ్ అభిప్రాయపడుతున్నారు. ఏఐసిసి సమావేశంలో రాహుల్‌ను పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అనే అంశంపై ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. ‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినాయకుడు. ఆయన నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాం. అయితే ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అనేది ఏఐసిసిలోనే స్పష్టమవుతుంది’ అని దిగ్విజయ్ చెప్పారు. ఏఐసిసిలో ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పటం మంచిది కాదన్నారు.
రక్షణ మంత్రి ఏకె ఆంటోని అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశమై ఏఐసిసి సమావేశం గురించి చర్చించారు. కాగా ఏఐసిసి సర్వసభ్య సమావేశం గురించి చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరుగుతోంది. ఏఐసిసిలో చేపట్టే రాజకీయ, సామాజిక, ఆర్థిక, విదేశీ తీర్మానాలపై వారు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తుందనే మాట వినిపిస్తోంది.