
న్యూఢిల్లీ, జనవరి 15: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చించడానికి గరిష్ట స్థాయిలో మరో పది రోజుల వ్యవధి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆరువారాల గడువుతో రాష్టప్రతి నుంచి ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పటి నుంచి ఇంత వరకూ సభ సక్రమంగా జరుగనందున మరో పది రోజుల పాటు వ్యవధిని పెంచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పునర్విభజన బిల్లుపై అభిప్రాయం తెలియజేసేందుకు రాష్టప్రతి ఇచ్చిన గడువు 23తో ముగుస్తుంది. సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య నిరంతర గందరగోళం చెలరేగడంతో ఇంత వరకూ సభలో చర్చ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి మాతృరాష్ట్ర అసెంబ్లీ కోరితే చర్చ గడువును పెంచిన ఉదంతాలున్నాయని అధికార వర్గాల వర్గాల కథనం. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేసినందున..రాష్ట్ర అసెంబ్లీ కోరితే చర్చ గడువును పెంచే అవకాశాలున్నాయని తెలిపాయి. చత్తీస్‌గఢ్ ఏర్పాటుకు సంబంధించి చర్చించి, ఆమోదించేందుకు మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఇచ్చిన గడువును అప్పటి రాష్టప్రతి పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా అధికార వర్గాలు ఈ సందర్భంగా ఉటంకించాయి. జనవరి 23 తర్వాత కూడా రాష్ట్ర విభజన పై చర్చించేందుకు అసెంబ్లీకి గడువు ఇచ్చే పక్షంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్రానికి మరింతగా సమయం తగ్గిపోతుంది. ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించేందుకు పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు పదిహేను రోజుల పాటు లేదా పది సిట్టింగ్‌లపాటు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంలో చేపట్టబోయే అంశాలను త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. కాగా, అసెంబ్లీ నిర్ణయంతో నిమిత్తం లేకుండా కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విషయంలో పార్లమెంట్ ముందుకు వెళ్లేందుకు ఎంతైనా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.