
న్యూఢిల్లీ,జనవరి 15: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగకుండా ఓటింగ్ జరగపవలసి వస్తే గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజన మూలంగా పార్టీ అధినాయకత్వంపై మంటగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అధినాయకత్వం నిర్ణయించే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధినాయకత్వానికి బుద్ధి చెప్పేందుకు సీమాంధ్ర శాసన సభ్యులు రాజ్యసభ ఎన్నికల్లో పగతీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారనే మాట వినిపిస్తోంది. అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్న వారితోపాటు కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన శాసనసభ్యులు కూడా పార్టీ అధికార అభ్యర్థులను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారని అనుమానిస్తున్నారు. అందుకే వీలున్నంత వరకు రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చూసేందుకు అధినాయకత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. తెలంగాణకు చెందిన పార్టీ శాసనసభ్యులను ఎంఏ ఖాన్‌కు, సీమాంధ్రలోని పార్టీ విశ్వాసపాత్రులైన శాసనసభ్యులను కొప్పుల రాజుకు కేటాయించి సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న వారిని కెవిపి రామచంద్రరావుకు కేటాయించటం ద్వారా పరిస్థితిని అదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. తనకు కేటాయించే సమస్యాత్మక శాసనసభ్యులను కెవిపి ఏదోఒక విధంగా మేనేజ్ చేసుకుంటారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ మాజీ అధికారి కొప్పుల రాజును రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపించే అవకాశాలున్నట్లు తెలిసింది. కొప్పుల రాజు రాష్ట్రంలో వివిధ స్థాయిలలో పని చేసి మంచి పేరు తెచ్చుకున్న అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఈ కారణం చేతనే రాహుల్ ఆయనను తన పరిధిలోకి తెచ్చుకున్నాడని అంటున్నారు. రాష్ట్రం నుండి ఆరు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఎన్నుకోవలసి ఉండగా ఇందులో మూడు సీట్లు కాంగ్రెస్‌కు, రెండు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా లభిస్తాయి. నాలుగో సీటును కూడా గెలుచుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. టిఆర్‌ఎస్ కలిసి వస్తే నాలుగో సీటును సునాయంగా గెలుచుకోవచ్చునని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాజ్యసభ ప్రస్తుత సభ్యులు ఎంఏ ఖాన్, కెవిపిని రీనామినేట్ చేయటం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయాన్ని వారికి సూచనప్రాయంగా చెప్పినట్లు తెలిసింది. కాగా,రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే పక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన, చేయనున్న శాసనసభ్యులు ఎటువైపుఓటు వేస్తారనేది చర్చనీయాంశంగా తయారైంది. వైకాపాకు చెందిన సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశించటం తెలిసిందే. కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభ సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21,22 తేదీల్లో ప్రకటించవచ్చు.