రాజమండ్రి, జనవరి 16: సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకుంటున్నట్టే వెనుకబడిన తరగతుల మద్దతును కూడా కూడగట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్, బిసి కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు సబ్సిడీని పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 15రోజుల క్రితమే రాష్ట్రప్రభుత్వం జారీచేసింది. బిసి కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు కేవలం 30శాతం సబ్సిడీతో రూ.లక్ష మాత్రమే రుణం ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం తాజా విధానం ప్రకారం లబ్ధిదారుడు తీసుకున్న రుణంలో రూ.లక్షకు మించకుండా 50శాతం సబ్సిడీని అందిస్తుంది. అంటే బిసి కార్పొరేషన్ ద్వారా ఇక నుండి రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీ లబిస్తుందన్న మాట. బిసిలకు నిజంగా ఇదొక వరం. రాష్ట్రప్రభుత్వం బిసి కార్పొరేషన్‌కు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీగా అందించేందుకు సుమారు రూ.274కోట్లను కేటాయించింది. బిసిల కోసం రూపొందించిన ఇంత మంచి సబ్సిడీ పథకాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలన్న లక్ష్యంతో బిసి కార్పొరేషన్ చైర్మన్ డోకల మురళి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే ఈ విషయమైన మాట్లాడిన చైర్మన్ డోకల మురళి, మరోవైపు ఎమ్మెల్యేలతో కూడా చర్చించి కేటాయించిన సబ్సిడీ మొత్తాన్ని పూర్తిగా బిసి లబ్ధిదారులకు వినియోగించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పథకంలో రుణం కోసం దరఖాస్తుచేసే లబ్ధిదారులు 21ఏళ్ల నుండి 40ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారై ఉండాలి. హెచ్‌ఐవి సోకిన బాధితులు, అత్యాచారానికి గురైన మహిళలు తదితరులకు 45ఏళ్ల వయస్సు వరకు పరిమితిని పెంచారు. మొదటి సారి రుణం పొందుతున్న వారికి, ఉన్నత విద్యార్హత ఉండి, నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణం ఇవ్వాలని, 33శాతం మహిళలకు రుణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక సంవత్సరం ముగియటానికి తక్కువ సమయం ఉండటం వల్ల స్క్రీనింగ్, ఎంపిక బాధ్యతలను మండల స్థాయిలో ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీకి అప్పగించారు.
సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకుంటున్నట్టే
english title:
subsidy
Date:
Friday, January 17, 2014