విశాఖపట్నం, జనవరి 16: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అనకాపల్లి ఎంపి సబ్బం హరి విరుచుకుపడ్డారు. గురువారం విశాఖలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపిలుగా ఉన్న తమను ఏఐసిసి సమావేశానికి హాజరు కాకుండా ఆంక్షలు విధించడాన్ని చూస్తుంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భావిస్తున్నామని అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఎంపిగా ఏఐసిసి సమావేశంలో తీర్మానంపెట్టే హక్కు తమకు ఉందని, దానిని తిరస్కరించే హక్కు పార్టీకి ఉందని ఆయన చెప్పారు. అటువంటి సంప్రదాయం పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు. ఆ సంప్రదాయాన్ని పాటించబోమని పార్టీ అధినేత్రి ప్రకటిస్తే, తాము వెనక్కు తగ్గుతామని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సీతారాం కేశరిని ఏఐసిసి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు జితేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారన్నారు. అప్పుడు అన్ని పిసిసి కార్యాలయాల్లో ఓటింగ్ నిర్వహించినప్పుడు కేసరి, ప్రసాద్ పేర్లను బ్యాలెట్‌లు ముద్రించిన విషయన్ని హరి గుర్తు చేశారు. సిడబ్ల్యుసి తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఏఐసిసికి ఉందని, ఆ ఆశతోనే, ఏఐసిసిలో సమైక్యాంధ్ర తీర్మానం పెట్టాలని పట్టుపడుతున్నామని చెప్పారు. దీన్ని తెలుసుకున్న పార్టీ నేతలు తమను లోనికి రాకుండా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని హరి విమర్శించారు. కానీ తామంతా శుక్రవారం ఏఐసిసి సమావేశ ప్రాంగణానికి వెళ్లి పాస్‌లు వచ్చేంత వరకూ అక్కడే కూర్చుంటామని హరి చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా పనిచేయాలని హరి డిమాండ్ చేశారు. సమైక్యం కోసం అందరినీ తనతో కలిసి రమ్మంటున్నారని ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఏ హోదాలేని జగన్ దగ్గరకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరుఆ ఎమ్మెల్యేలకు భయం వేస్తోందని హరి అన్నారు.
పార్టీలో ప్రజాస్వామ్యం ఖూనీ: ఎంపి సబ్బం హరి
english title:
sabbam hari
Date:
Friday, January 17, 2014