కర్నూలు, జనవరి 16: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి దూకుడు పెంచారు. తన చిన్ననాటి మిత్రుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విమర్శనాస్త్రాలకు పదునుపెట్టారు. కిరణ్‌కు స్నేహితునిగా, నమ్మిన బంటుగా పేరుపడ్డ న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తాజాగా ఆరోపణాస్త్రాలు సంధించడం వెనుక గల మర్మమేంటన్నది అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన వెంటనే తన నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో అనుచరులతో భారీ హంగామా చేయించిన ఏరాసు ఇపుడు అదే ముఖ్యమంత్రితో పనులు చేయించుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. కళాశాల నాటి మిత్రుడైన కిరణ్ సీఎం అవుతారని తెలిసిన వెంటనే తనకు మంత్రి పదవి ఖాయమని భావించే ఆత్మకూరులో హంగామా చేయించారని అప్పట్లో అనుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే కిరణ్ మంత్రివర్గంలో ఏరాసుకు స్థానం కల్పించారు. అంతేగాక కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి శిల్పా మోహనరెడ్డిని తప్పించడం గమనార్హం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వచ్చిన ఏరాసు ఇటు వైకాపా, తెలుగుదేశం పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చారు.
మంత్రి మండలిలో ముఖ్యమంత్రికి న్యాయ శాఖామంత్రి ఏరాసు అండగా ఉంటారన్న ప్రచారం కూడా జరిగింది. అంతేగాకుండా గాలి జనార్ధన్‌రెడ్డి బెయిలు కేసులో ఏరాసుపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదన్న అపవాదును ముఖ్యమంత్రి ఎదుర్కొన్నారు. ఏరాసుతో ఉన్న స్నేహం, జగన్‌తో ఉన్న సంబంధాల కారణంగానే ఏరాసును వెనుకేసుకొస్తున్నారన్న ఆరోపణలను కిరణ్ మూటగట్టుకున్నారు. ఆ తరువాత ఆ అంశం కూడా తెర మరుగైంది. ఒక దశలో ముఖ్యమంత్రి కిరణ్ ఏర్పాటు చేసే మంత్రివర్గ ఉప సంఘాల్లో ఏరాసుకు ఇస్తున్న ప్రాధాన్యత మరే మంత్రికి ఇవ్వడం లేదన్న చర్చ సైతం జరిగింది. ఆ స్థాయిలో కొనసాగిన కిరణ్, ఏరాసుల బంధం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎందుకు బెడిసి కొట్టిందన్నదే ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ అధిష్ఠానంపై వాగ్బాణాలు సంధిస్తున్న కిరణ్ కొత్తపార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జోరందుకున్న ప్రస్తుత తరుణంలో ఏరాసు సీఎంపై ఆరోపణలు సంధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తెలుగుదేశం, వైకాపాతో చర్చలు పూర్తయినప్పటికీ ఏ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ నేతలు సీఎం కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటుకై ఎదురుచూస్తున్నారు. తనను టిడిపి ఆహ్వానించిందని, అయితే నిర్ణయం తీసుకోలేదని ఇటీవల ఏరాసు చెప్పారు. మరోవైపు వైకాపా ఏరాసును కర్నూలు ఎంపి స్థానంలో పోటీకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. సిఎంపై, ఆరోపణలు చేసిన మరునాడే కర్నూలులో వైకాపా నేత ఎస్వీ మోహనరెడ్డి ఏరాసుతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఏపార్టీ వైపు చూస్తున్నారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వైకాపా నేతలు మాత్రం తమ పార్టీలోకి ఏరాసు వచ్చే అవకాశం లేదని, ఆయన పోటీ చేయడానికి ఏ స్థానం ఖాలీ లేదని అంటుండగా, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మాత్రం మరో 10 రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
సిఎంపై ఘాటు విమర్శలు చిన్ననాటి మిత్రుడిపై నిందలు అంతుచిక్కని మంత్రి వ్యూహం
english title:
yerasu
Date:
Friday, January 17, 2014