
తిరుపతి, జనవరి 16: మకర సంక్రమణం మరుసటి రోజు అంటే కనుమ పండుగ నాడు తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామికి టిటిడి నిర్వహించే పారువేట ఉత్సవం గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి గోదా పరిణయోత్సవం కూడా కన్నులపండువగా నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ గోదాదేవి చెంత నుండి ప్రత్యేక మాలలను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి కానుకగా అందించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు వెండి తిరుచ్చిపైన, మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామిని అధిరోహింపచేసి ఊరేగింపుంగా పార్వేట మండపం వద్దకు తీసుకొచ్చారు. మండపంలో పుణ్యాహ కార్యక్రమాన్ని జరిపి, అనంతరం మంచెలో స్వామివార్లను వేంచేపు చేయించారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామివారికి ఆరాధన, నివేదనలు నిర్వహించి హారతులు పట్టారు. అన్నమయ్య వంశస్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. శ్రీకృష్ణస్వామివారిని మాత్రం సన్నిధి గొల్లపూజ చేసే చోట వేంచేపు చేసి పాలు, వెన్నలను స్వామికి ఆరగింపుచేశారు. యాదవ భక్తులు సమర్పించిన పాలు, వెన్నలను మలయప్ప స్వామిని నివేదన చేసి హారతి పట్టారు. అనంతరం గొల్లలకు బహుమానం కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా మలయప్పస్వామివారిని పల్లకిపై వేంచేపు చేయించి వాహన సేవకులతో ముందుకు ఉరికించారు. స్వామివారు తరపున వేటాడుతున్నట్లుగా అర్చకులు జింక బొమ్మపై ఈటెను విసిరారు. ఈ పార్వేట ఉత్సవం పూర్తయిన తరువాత మలయప్పస్వామిని, కృష్ణస్వామిని ఊరేగింపుగా మహద్వారం వద్దకు వచ్చారు. హథిరాంజీ బెత్తాన్ని తీసుకొని స్వామివారు సన్నిధిలోకి వేంచేశారు. దీంతో పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసినట్లయింది. టిటిడి పాలకమండలి అధ్యక్షులు బాపిరాజు, ఇఓ ఎంజి గోపాల్, డిప్యూటీ ఇఓ చిన్నంగారి రమణ, భద్రతాధికారి శివకుమార్ రెడ్డి, పారపత్తేదారు అజయ్,పాల్గొన్నారు.
నేత్ర పర్వంగా ప్రణయ కలహోత్సవం
నిత్య కల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు తన దేవేరులతో ప్రణయ కలహోత్సవ సందర్భాన్ని గురువారం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మలయప్పస్వామిని ఆయన ఉభయ దేవేరులను సాయంత్రం 4.30 గంటల సమయంలో వైభవోత్సవ మండపం నుండి వేర్వేరుగా స్వామివారిని ఒక మార్గం గుండా, అమ్మవారిని మరో మార్గం గుండా ఊరేగించారు. వరాహస్వామి ఆలయం సమీపాన స్వామి, అమ్మవార్లు ఎదురెదురుగా తారసపడ్డారు. (చిత్రం) శీవారి పారువేట ఉత్సవంలో భాగంగా గురువారం శ్రీవారు లేడిని వేటాడుతున్నట్టు అభినయిస్తున్న అర్చకస్వాములు