కర్నూలు, జనవరి 17 : రైతులకు ఉపయోగపడేలా పథకాలు నిర్మించి బీడు భూములను సాగులోకి తీసుకురావచ్చని మంత్రి టీజీ ఆలోచనల ఫలితంగా ప్రస్తుతం జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలు రైతులకు చేరువవుతున్నాయి. ఇలాంటి పథకాలు జిల్లాలోని రైతుల్లో బలాన్ని తీసుకువచ్చి మంచి పంట దిగుబడులను సాధించడం ద్వారా వ్యక్తిగతంగా రైతులకు మేలు కలుగడమే కాకుండా దేశ సౌభాగ్యానికి ఎంతో ఉపయోగపడుతోంది. మంత్రిగా టీజీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు కేటాయించిన చిన్న పారుదల శాఖ అంత ప్రాధాన్యత లేనిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే చిత్తశుద్ధితో సేవ చేయాలని మనసుంటే మార్గముందని బాధ్యతలు చేపట్టి తన వంతుగా జిల్లాలోని బీడు భూములను సశ్యశ్యామలం చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారని ఆయన వర్గీయులు వెల్లడిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఆయన హయాంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల వివరాలను వారు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం జిల్లాలో 2004-2009వ సంవత్సరాల మధ్య కేవలం రూ.186కోట్లతో ఎత్తిపోతల పథకాలను చేపట్టి 30వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించారు. మంత్రిగా 2010లో బాధ్యతలు చేపట్టిన టీజీ వెంకటేష్ హయాంలో కేవలం మూడు సంవత్సరాల కాలంలో రూ.815కోట్లు ఖర్చు చేసి 1.05లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశారు. ఇందులో ఇంత వరకు పూర్తయిన ఎత్తిపోతల పథకాల ద్వారా 45వేల ఎకరాలకు పైగా భూముల్లో రైతులు పచ్చని పంటలు పండిస్తున్నారు. కర్నూలు రూరల్ మండలంలోని ఇ.తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల, సుంకేసుల, దేవమడ గ్రామాలు తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు. నది దిగువన ఉండటం, భూములు ఎగువన ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఈ గ్రామాల రైతులకు ఎత్తిపోతల పథకాలు ఉపయోగపడతాయని భావించి మంజూరు చేశారు. దీంతో ఈ గ్రామాల పరిధిలో సుమారు 3,900 ఎకరాలకు సాగునీరందించగలిగారు. ఇక మిగతా జిల్లాలో రూ.501కోట్ల ఖర్చుతో 63 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. ఇందులో పూర్తయిన ఎత్తిపోతల పథకాల ద్వారా 75వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాల్లో 33శాతం కేవలం జిల్లాకు కేటాయించినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇవి గాక చిన్ననీటి పారుదల శాఖ కిందకు వచ్చే చెరువుల అభివృద్ధి కోసం రూ.35కోట్ల ఖర్చుతో 78 చెరువులను మరమ్మతు చేశారు. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి మరో రూ.30కోట్లతో 44 చెరువు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రైతులకు ఆధునిక శిక్షణను ఇచ్చేందుకు పంచలింగాల గ్రామంలో ఒక శిక్షణా కేంద్రం, మండల కేంద్రాల్లో రూ.మూడు కోట్ల ఖర్చుతో వౌళిక వసతులు కల్పిస్తున్నారు. ఇక కేసీ కాలువ వాటా నీటిని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన గుండ్రేవుల జలాశయ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. నగర శివార్లలో ప్రవహించే తుంగభద్ర నదిపై రూ.65కోట్లతో 0.50టి ఎంసీ సామర్థ్యంతో జలాశయానే్న కాకుండా నది అవతలి ఒడ్డున ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు పూర్తయితే 1.05లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరందించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.
* రూ.815కోట్లతో పనులు * 1.05 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం
english title:
yetti pothalu
Date:
Saturday, January 18, 2014