కర్నూలు, జనవరి 17 : రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో సమైక్యాంధ్ర ఉద్యమ ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లావాప్తంగా భారీ హోర్డింగులు వెలిశాయి. ఈ ప్రచారం వెనుక కొత్తపార్టీ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2009, 2013లో ఎగిసి పడిన సమైక్య ఉద్యమ సమయంలో కూడా ఇంత భారీ ఎత్తున ప్రచారం జరగలేదు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు ఉద్యమం లేకపోయినా ప్రచారం మాత్రం భారీ ఎత్తున ఉండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నది పలువురి అనుమానం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగులు నెలకొల్పడంతోపాటు సమైక్య రథాల పేరుతో కొన్ని వాహనాలు కర్నూలుకు పంపారు. ఈ వాహనాల సహాయంతో కళాకారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. విభజన అనివార్యమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందన్న ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని కొత్తపార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేదిశగా సన్నాహాలు చేయడంలో భాగమే ఈ ప్రచారం అని
కొందరు భావిస్తున్నారు. ఒకవేళ కొత్తపార్టీ ఏర్పడితే జిల్లాల్లో ఎవరు కీలకంగా మారనున్నారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడని పేరున్న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇటీవల ఆరోపణాస్త్రాలు సంధించంతో ఆయన ప్రమేయం కొత్త పార్టీలో ఉండదని భావిస్తున్నారు. మరోమంత్రి టీజీ వెంకటేష్‌పైనే ఇపుడు అందరి దృష్టి నిల్చి ఉంది. ఆయనే కొత్త పార్టీకి జిల్లాలో కీలక నేతగా ఉంటారన్న భావన వ్యక్తమవుతోంది. ఏదిఏమైన కొత్తపార్టీకి సంబంధించిన వ్యవహారం ఈనెల 26వ తేదీ తరువాతే స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
* కొత్తపార్టీ ప్రచారం అంటున్న ప్రజలు
english title:
hoardings
Date:
Saturday, January 18, 2014