పెద్దకడబూరు,జనవరి 17:రాయలసీమలో నాయకులుగా ఎదిగి, ఎన్నో పదవులను అనుభవిస్తూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న రాయలసీమ ద్రోహులను తరిమి కొట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం రాయలసీమ పరీరక్షణ సమితి ఆధ్వర్యంలో మండల పరిధిలోని దొడ్డిమేకల, హెచ్. మురవణి, జాలవాడి, కంబళదినె్న గ్రామాల్లో బస్సు యాత్ర జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, దీనికి కారణం రాయలసీమకు చెందిన పాలకులేనని దూయబట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు అయినప్పటికి, ఈప్రాంతానికి చేసింది ఏమీలేదని ఆరోపించారు. ప్రతి ఏడాది కరవుతో రాయలసీమప్రాంతం అల్లాడుతున్నా నేతలు పట్టించుకోలేదని, మాజీ ముఖ్యమంత్రులపై విరుచుకుబడ్డారు. చిత్తూరుకు చెందిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, కడపకు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చి సహకరించారని గుర్తు చేశారు. రాయలసీమ వాసులు వారిని నాయకులుగా, ముఖ్యంత్రులుగా, ఎంపీలుగా పదవుల్లో కూర్చోబెడితే వారు మాత్రం రాష్ట్ర విభజనకు సహకరిస్తూ ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా నీటి కోసం ఒకరికొకరు ఘర్షణలు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ సుభిక్షంగా ఉండాలంటే రాయలసీమ ప్రాత్యేక రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని దీనిలో భాగంగా రాయలసీమ పరీరక్షణ సమితీ పోరుడుతుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, వైకాపాలకు బుద్ధి చెప్పాలని, రాయలసీమ పరిరక్షణ సమితిని బలపరచాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు రాఘవేంద్ర, నాగరాజు, మల్లికార్జున, ప్రజలు పాల్గొన్నారు.
‘బోగస్’ లేకుండా చూడండి
* ఓటర్ల డేటా నమోదు 23 వరకూ పెంపు
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
కర్నూలు, జనవరి 17 : ఓటర్ల నమోదు సవరణపై సమగ్ర విచారణ జరిపి బోగస్ ఓటర్ల నమోదు కాకుండా పునంసమీక్షించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల డేటా నమోదుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు పెంచామని, ఓటర్ల జాబితాలో తప్పలు లేకుండా పునంసమీక్షించి నమోదు చేయాలన్నారు. ఓటుహక్కుపై 18న నియోజకవర్గం, 21న జిల్లా, 24న వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కోరారు. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ప్రచార రథం సిద్ధం చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్‌కు అనువుగా ఉన్న భవనాలు, విద్యుత్, టెలిఫోన్ తదితర వౌలిక వసతులు, పోలింగ్ కేంద్రానికి రోడ్డు సౌకర్యం తదితర ఏర్పాట్లను సమీక్షించుకోవాలన్నారు. ఎన్నికలు విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సేకరించుకోవాలని సూచించారు. ఈనెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉత్సవాలు జరుపుకోవాలని ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఓటర్లకు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఓటర్ల నమోదుకు 3,16,629 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 3,13,421 మందిని విచారించి ఓటర్ల జాబితాలో నమోదు చేశామని తెలిపారు. అలాగే ఫారం 7 కింద గుర్తించిన 51,290 మంది ఓటర్లను విచారించి ఓటర్ల జాబితాలో పొందుపరుస్తామని నివేదించారు. అలాగే ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి 31వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్దం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రఘురామిరెడ్డి, జెసి కన్నబాబు, ఎఎస్పీ వెంకటరత్నం, ఎజెసి రామస్వామి, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టరేట్ ఎఓ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వాలి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
గడివేముల, జనవరి 17: మండల పరిధిలోని జెఎస్‌డబ్ల్యు యాజమాన్యం ఫ్యాక్టరీ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి చేయూత నివ్వాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గడివేముల జిల్లా పరిషత్ ఆవరణలో జెఎస్‌డబ్ల్యు ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మండలంలోని వికలాంగులకు కృతిమ అవయవాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జెఎస్‌డబ్ల్యు యాజమాన్యం జెఎస్‌డబ్ల్యు పౌండేషన్ ద్వారా చేసే సేవలు అభినందనీయమన్నారు. సామాజిక సేవలతో పాటు గ్రామాల్లోని పాఠశాలల్లో సౌకర్యాలకు కల్పించడం, ప్రజలకు వైద్యసేవలు అందించడం గర్వించదగ్గ విషయం అన్నారు. నంద్యాల-గడివేములకు జెఎస్‌డబ్ల్యు ఆధర్యంలో సిమెంటు రోడ్డు వేసినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే చుట్టుపక్కల గ్రామాల యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. జెఎస్‌డబ్ల్యు వైస్ ప్రెసిడెంట్ వీరబాబు, వాక్‌చెస్‌పతి మాట్లాడుతూ జెఎస్‌డబ్ల్యు ద్వారా ఉచితంగా అందిస్తున్న కృతి అవయవాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెఎస్‌డబ్ల్యు ఆధ్వర్యంలో సామాజిక సేవలతో పాటు గ్రామాల్లో విద్య, వైద్య మొదలగు కార్యక్రమాలు జె ఎస్‌డబ్ల్యు పౌండేషన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జెఎస్‌డబ్ల్యు డైరెక్టర్ కులకర్ణి, బిలకలగుడూరు, గడివేముల, బుజూనూరు గ్రామాల సర్పంచ్‌లు సుదర్శన్‌రెడ్డి, రాములమ్మ, జమాల్‌బాషా, జెఎస్‌డబ్ల్యు డిఎం భాస్కర్, మేనేజర్ కృష్ణారావు, ఖాజావలి, కృష్ణారావు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం నినదిస్తాం
* ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య
చాగలమర్రి, జనవరి 17: ఈనెల 18వ తేదీన సమావేశం కానున్న శాసన మండలి సమావేశాల్లో రాష్టవ్రిభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తామని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. శుక్రవారం చాగలమర్రిలోని వాసవీ జూనియర్ కళాశాలలో చిన్నవంగలి, చింతలచెరువు గ్రామాల్లోని జడ్‌పి పాఠశాలలను, ముత్యాలపాడు ఎస్పీజి ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల్లో వసతుల కల్పన, ఉపాధ్యాయుల కొరతను తెలుసుకున్నారు. రాష్టవ్రిభజన అన్ని వర్గాల ప్రజలు అడ్డుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర తీర్మాణంతో శాసనమండలిలో ఓటింగ్‌ను నిలదీస్తామని, తెలంగాణ ఏర్పాటు బిల్లును ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో 15రోజులు శాసనమండలి సమావేశాలు పొడిగించాలని తాము కోరుతామన్నారు. అన్ని పార్టీలు సొంత అజెండాలు లేకుండా సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచేందుకు ముందుకు రావాలని ఆయన విన్నవించారు. స్వార్థపరుల కారణంగానే విభజన జరుగుతోందని, సమైక్యం కోసం ఉద్యమించే పార్టీలకు సంఘీభావం తెలుపుతామన్నారు. ఉపాధ్యాయుల, అధ్యాపకులు సమస్యలు పరిష్కరించేందుకు జెఎసి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్నామన్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమణయ్య, అధ్యాపకులు కృష్ణమూర్తి, రామసుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, పిఆర్‌టియు నాయకులు రసీద్‌ఖాన్, రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి ప్రచారథం ప్రారంభం
కర్నూలుటౌన్, జనవరి 17 : పాణ్యం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి కెజె రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాన్ని టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు నియోజవర్గంలో గడపగడపకూ టిడిపి కార్యక్రమం చేపట్టేందుకు రూ.12 లక్షల విలువజేసే ప్రచారథం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కెజె రెడ్డి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకొస్తే ప్రజల కష్టాలు గట్టెకుతాయన్నారు. విభజన ప్రక్రియను ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేంతవరకు చంద్రబాబు పోరాటాలు చేస్తూనే ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఇన్‌చార్జి మల్లెల పుల్లారెడ్డి, మాజీ మర్కెట్ యార్డు చైర్మన్ మల్లెల పుల్లారెడ్డి, మాజీ చైర్మన్ బాల వెంకటేశ్వరరెడ్డి, ఈశ్వరప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు షడ్రక్
కల్లూరు, జనవరి 17 : నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కాలుష్య కోరల నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్రక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక పరిశ్రమల వ్యర్థ పదార్థాలతో తుంగభద్ర నీరు కలుషితంగా అయి తాగు,సాగునీరుకు పనికి రాకుండా తయారైందన్నారు. ఈ విషయంపై వాతావరణ కాలుష్య నివారణ శాఖకు చెందిన అధికారులు విచారించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఎన్ని సార్లు ప్రజలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ఒకరిపై ఒకరు తమ పరిధిలోకి రాదంటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ విఫలమయ్యారని విమర్శించారు. గతంలో ఎన్నడు లేని విధంగా తుంగభద్ర నదిలో నీటి ఎద్దడి తగ్గడంతో ఈ దుర్వాసన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కారణం పరిశ్రమల వెదజల్లే దుర్గంధమే అన్నారు. ఈ విషయంపై ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు రమేష్ కుమార్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
ఎమ్మిగనూరు, జనవరి 17: స్థానిక మార్కెట్‌యార్డు రోడ్డులో గురువారం రాత్రి 12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగొళ్ళలదొడ్డి గ్రామానికి చెందిన బోయ మూకన్న (50) మృతి చెందాడు. శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరకు వచ్చిన మూకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.