జగిత్యాల/ కోరుట్ల, జనవరి 17: ఆరుగాలం శ్రమించి పండించిన పసుపుకు మద్దతు ధర చెల్లించక ప్రభుత్వం రైతులపై పగబూనిందని ఆగ్రహించిన రైతులు శుక్రవారం జగిత్యాల, కోరుట్ల లో రోడ్డెక్కి నిరసన తెలిపారు. క్వింటాలు పసుపుకు రూ. 15వేలు మద్దతు ధర చెల్లించాలని, పసుపు రైతుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 500కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో చేశారు. డివిజన్ కేంద్రమైన జగిత్యాలలో రైతులు చేపట్టిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి బిజెపి,బిజెవైఎం అధ్యక్షుడు సీపెల్లి రవి, ఆముద రాజు,లింగంపేట శ్రీనివాస్ మద్ధతు ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు పంటకు మద్ధతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అనేక యేళ్ల తరబడి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులు నష్టాల ఊబిలో చిక్కిశల్యమవుతున్నా పాలకులు పట్టింపులేనట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఇది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్పితే పసుపు రైతులు నిలువు దోపిడీకి గురువుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలోఅత్యధికంగా సాగయ్యే పసుపు పంట కొనుగోలు చేయడంలో పాలకులు వివక్ష చూపడం తగదన్నారు. పసుపు రైతులను దళారీల భారీ పడి దగా పడుతున్నప్పటికీ ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, వాణిజ్య పంటగా పక్షపాతం చూపడంతో పసుపు రైతు పరేషాన్ అవుతున్నారన్నారు. పసుపు రైతుల సమస్య చిత్తశుద్ధితో పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైన నేపధ్యంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పండించిన పంటలు మద్ధతు ధరతో కొనుగోలు చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, పసుపుకు క్వింటాల్‌కు రూ. 15వేలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శుద్ధి కర్మాగారాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు, అనుబంధ పరిశ్రమలు, వడ్డీలేని రుణాలు చెల్లించి, ప్రతి మార్కెట్ కమిటీలో కోల్ట్‌స్టోరేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రూ. 15వేల మద్ధతు ధర చెల్లించి పసుపును ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రహదారులను దిగ్భంధించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని డివిజన్ పరిధిలోని జగిత్యాల, సారంగాపూర్ తదితర మండలాల రైతులు జగిత్యాలలో రోడ్డెక్కి ధర్నా,రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ఆందోళనకారులను శాంతపర్చారు.
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
వేములవాడ, జనవరి 17: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే కోడె మొక్కులు, ధర్మదర్శనం చేసుకునే భక్తులు నిర్దేశించిన క్యూలైన్లో బారులు తీరారు.స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్న భక్తులు గర్భాలయంలో కొలువుదీరిన స్వామివార్ల, అమ్మవారి సేవలో తరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామివారి ధర్మదర్శనానికి సుమారు మూడుగంటలకు పైగా సమయం పట్టింది.సెస్ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకోని తరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వివిధ అర్జిత సేవల టిక్కెట్ల విక్రయాల వల్ల ఆలయానికి దాదాపురూ. 20 లక్షల పై చిలుకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా వచ్చే మహాశివరాత్రి దేవస్థానం అధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం వౌలిక వసతులు కల్పించనున్నారు.
ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేత
కరీంనగర్ , జనవరి 17: జిల్లాలో వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ జిల్లా ఎస్పీ వి.శివకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై శాఖాపరంగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న వారిపై న్యాయస్థానంలో చార్జిషీట్లను వేయడం జరిగిందని పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాటారం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఎ.నవీన్ రెడ్డిపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. ఆ కారణంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి.కాశయ్య తనకు వివాహమైన విషయాన్ని దాచి ఉంచి మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాడనే ఆరోపణతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి పొట్లాటకు దిగినందుకు సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ జి.శ్రీనివాస్‌కు కొయ్యూరు, డి.రమేష్‌కు చిగురుమామిడి, కె.శ్రీనివాస్‌కు కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లకు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.