
విజయనగరం, జనవరి 18: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసి చరిత్రకెక్కిన వారిలో చాగంటి సోమయాజులు (చాసో) ఒకరని, ఆయన రచించిన కథలు సార్వజనీనమని సాహితీవేత్తలు కొనియాడారు. గురజాడ వారసుల్లో రెండోతరానికి చెందిన వారిలో అగ్రగణ్యులుగా చాసోను చెప్పవచ్చన్నారు. విజయనగరంలో శనివారం జరిగిన చాసో శతజయంతి ఉత్సవాల ముగింపు సదస్సులో వక్తలు మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ఏడాది పొడవునా రాష్టమ్రంతటా నిర్వహించాలన్నారు. చాసో విగ్రహాన్ని విజయనగరంలో నెలకొల్పాలని, చాసో హవేలి భవనాన్ని చారిత్రక కట్టడంగా కాపాడుకోవాలని సాహితీవేత్తలు పిలుపునిచ్చారు. బెంగుళూరు సాహిత్య అకాడమీ ఆఫీస్ ఇన్‌ఛార్జి ఎస్‌పి మహాలింగేశ్వర్, తెలుగు సలహా మండలి సంచాలకులు ప్రొఫెసర్ ఎన్ గోపి మాట్లాడుతూ మహాకవుల శతజయంతి ఉత్సవాలను సాహిత్య అకాడమీ నిర్వహిస్తుందని, అందులో భాగంగానే ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, తిరుమల రామచంద్ర శతజయంత్యుత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు మాట్లాడుతూ చాసోకు తనకు గల అనుబంధం గురించి వివరించారు. చాసో గొప్ప కథారచయిత అని, ఆయన కథలు చదివిన వారు మరచిపోవడం జరగదని అన్నారు. ఎన్ గోపి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వం గురించి వివరించారు. ప్రముఖ రచయిత కేతు విశ్వనాధరెడ్డి తన కీలకోపన్యాసంలో మాట్లాడుతూ చాసో, రోణంకి, శెట్టి ఈశ్వరరావులు అభ్యుదయ సాహిత్యానికి పునాదులు వేశారన్నారు. చాసో కథల్లో కవితా సౌందర్యం గురించి కె శివారెడ్డి ప్రసంగించారు.
పరబ్రహ్మం, కుక్కుటేశ్వర్లు, ఎందుకు పారేస్తాను నాన్న వంటి కథల్లో కవిత్వం ఎలా పడగవిప్పినది ఆయన ఉదాహరణలతో వివరించారు. చాసో కుమార్తె చాగంటి కృష్ణకుమారి మాట్లాడుతూ తన తండ్రి కథల్లో సంగీతం, చిత్రలేఖనం గురించి వివరిస్తూ వాయులీనం కథను ఉదాహరించారు. చాసో రచనల్లో సామాజిక నేపథ్యం గురించి వకులాభరణం రాజగోపాల్ ప్రసంగించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనలకు చాసో కథలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కె సుమనస్పతిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో చాసో స్థానం గురించి వివరించారు. రచయిత రామతీర్థ ప్రసంగిస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని చాసో డేగ కళ్లతో చూశారన్నారు. 1942-1979 వరకు సుమారు 37 ఏళ్లపాటు సృజనాత్మక రచనలు చేశారన్నారు. వీటిని ‘చాసో దర్శనం’ పేరిట ఒక సంపుటిగా ప్రచురించాలని కోరారు. (చిత్రం) చాసో శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు హాజరైన కవులు