విశాలాక్షినగర్, జనవరి 20: పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్‌గా పనిచేస్తూ ప్యాకేజీ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం మద్దిలపాలెం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని ఎఐసిసి పెద్దలు గతంలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులచే ఆరోపణలు చేయించా రన్నారు. రాష్ట్రంలోని అనేక టీవీ ఛానళ్ళు సర్వే చేసి జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని చెప్పాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణను తగ్గించటానికి సబ్బం హరి వంటి నాయకులకు ప్యాకేజీలు ఇచ్చి ఢిల్లీ పెద్దలు ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. హరి కవాలీ పెడతామని హెచ్చరించడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కవాలీ కాదు కబాడ్డీ ఆడిస్తామని హెచ్చరించారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని హరి పార్టీ అధ్యక్షుడు జగన్‌పై గతంలో పొగిడి ఇప్పుడు విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇంట్లో నుండి హరిని బయట తిరగకుండా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనూక్, రవిరెడ్డి, పక్కి దివాకర్, పీలా ఉమారాణి, పసుపులేటి ఉషాకిరణ్, పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బిజెపి సీమాంధ్ర నేతల ధర్నా
విశాఖపట్నం, (జగదాంబ) జనవరి 20: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సోమవారం ఉదయం బిజెపి సీమాంధ్ర నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు 300 మంది జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు కంభంపాటి హరిబాబు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహనరావు ఆధ్వర్యంలో బయలుదేరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీమాంధ్రకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు.
విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
30 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరణ
గోపాలపట్నం, జనవరి 20: రిపబ్లిక్‌డే సందర్భంగా సోమవారం నుండి ఈ నెల 30 వరకు విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 26న రిపబ్లిక్‌డే సందర్భంగా ఉగ్రవాదులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని రెండురోజుల క్రితం విమానాశ్రయ అధికారులకు అందిన సమాచారం మేరకు విమానాశ్రయంలోని సిఐఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది. బందోబస్తు కోసం సిఐఎస్‌ఎఫ్ బలగాలను 40 శాతం పెంచారు. సిబ్బందికి అదనపు డ్యూడీలు వేశారు. తనిఖీలకు బాంబు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు.
ప్రవేశ రుసుముపై తమవారిని కలుసుకునేంకు విమానాశ్రయంలోకి వెళ్లే సందర్శకులను ఈ నెల 30 వరకు అనుమతించరని సిఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఎ.కె. మిత్ర తెలిపారు. సిఐఎస్‌ఎఫ్ బలగాలతో పాటు విమానాశ్రయం చుట్టుపక్కల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎయిర్‌పోర్టు జోన్ సి.ఐ. తిరుమలరావు తెలిపారు.