విశాఖపట్నం, జనవరి 20: కాసుల్లేక డీలా పడిన జివిఎంసి ఖజానాకు త్వరలోనే నిధులు వరదలా రానున్నాయి. ఈఅర్థిక సంవత్సరాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 120 కోట్ల రూపాయల మేర నిధులు జివిఎంసికి జమయ్యే అవకాశాలున్నాయి. పెద్ద మొత్తంలో పన్ను, ఫీజులు బకాయి పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్, హిందూజా పవర్ ప్రాజెక్టుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరగనున్నాయి. ముఖ్యంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తంలో 10 శాతం పెండింగ్ పెట్టింది. రిఫార్మ్స్ పేరిట కేంద్రం వద్ద ఆగిపోయిన రూ. 80 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా విడుదల చేసే అవకాశం ఉందని జివిఎంసి కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ సోమవారం ఆయన్ను కలిసిన విలేఖరులకు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 40 కోట్లు కూడా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జమ కానున్నాయని, దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. ఇక విశాఖలోని అతిపెద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ప్లాంట్ చెల్లించాల్సిన ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను కూడా త్వరలోనే చెల్లించే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ చెల్లించాల్సిన ఆస్తిపన్ను రూ 13 కోట్లకుగాను ప్రతియేటా రూ 6.5 కోట్లను మాత్రమే చెల్లిస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టీల్‌ప్లాంట్ ఈమొత్తాన్ని గత నాలుగేళ్లుగా చెల్లిస్తోందని ఆయన తెలిపారు. కేసు జివిఎంసికి అనుకూలంగా ఉన్నందున త్వరలోనే బకాయిలు చెల్లించే విధంగా తీర్పు వెలువడే అవకాశం ఉందన్నారు. బకాయిలు రూ 26 కోట్లు చెల్లించేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కూడా సుముఖంగానే ఉందని ఆయన తెలిపారు. ఇక స్టీల్‌ప్లాంట్ వద్ద ఖాళీగా ఉన్న భూములకు సంబంధించి వేకెంట్ లేండ్ టాక్స్ (విఎల్‌టి) సాలీనా రూ 22 కోట్లుగా లెక్కించారు. దీనిపై కూడా స్టీల్‌ప్లాంట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పన్నుల వసూళ్లకు సంబంధించి స్థానిక సంస్థల అధికారాల నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ విధిగా విఎల్‌టి చెల్లించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం విఎల్‌టిని 70 శాతానికి తగ్గించాలంటూ తమను కోరిందని పేర్కొన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్‌లో కొత్తగా చేపట్టిన నిర్మాణాల మేరకు ఆస్తిపన్ను సాలీనా రూ 13 నుంచి 18 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. న్యాయస్థానం తుది తీర్పు వెలువడితే స్టీల్‌ప్లాంట్ నుంచి జివిఎంసికి సాలీనా రూ 40 కోట్ల మేర ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు. హిందుజా పవర్ ప్లాంట్ నుంచి ఫీజుల రూపంలో రూ 54 కోట్లు జివిఎంసికి రావాల్సి ఉందన్నారు. దీనిలో రూ 4 కోట్లను ఇటీవల హిందుజా సంస్థ చెల్లించిందని తెలిపారు. మిగిలిన మొత్తం కూడా త్వరలోనే చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. హిందుజా సంస్థ నిర్మాణాలకు సంబంధించి గతంలో కౌన్సిల్ ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ నివేదిక ప్రకారం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే హిందుజా చెల్లించే మొత్తంలో కొంత భాగాన్ని ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నామని తెలిపారు. అలాగే కొంతమొత్తాన్ని నగర సుందరీకరణకు ఖర్చు చేసేందుకు జివిఎంసి ప్రత్యేకాధికారి అంగీకరించారని తెలిపారు. లేండ్ స్కేపింగ్, బీచ్‌రోడ్డు సుందరీకరణ, రహదార్లు, పుట్‌పాత్‌ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపు విధానంలో సాంకేతిక లోపాల కారణంగానే నిలిపివేసినట్టు కమిషనర్ ప్రకటించారు. సర్వర్ల ఆధునీకరణ, ఇతర అంశాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన అనంతరం ఎపిటిఎస్ ఆమోదం తర్వాత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. భీమునిపట్నం మండల పరిధిలోని అయిదు పంచాయతీల విలీన అంశం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని ఆయన తెలిపారు.
నిర్వహణకు డబ్బుల్లేవ్!
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 20: విశాఖ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను దుర్దశ వెంటాడుతూనే ఉంది. సుమారు అయి దు సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్‌ల నిర్వహణకు చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం విదల్చలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల కింద లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. వీటికి సవ్యంగా నీరు అందే పరిస్థితి లేదు. కేవలం నిర్వహణ లేకపోవడం వలనే నీరు అందడం లేదన్న విషయం అధికారులకు తెలిసినా, పట్టించుకోలేదు. నీటి తీరువా కింద వచ్చే పన్ను మొత్తం ఇప్పటి వరకూ ఎటు పోతోందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లాలో తాండవ, పెద్దేరు, వరాహ, ఏలేరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కింద సుమారు లక్ష ఎకరాల్లో పంట భూములు సాగులో ఉన్నాయి. 2006 ప్రాంతంలో జిల్లాలోని రిజర్వాయర్ల ఆధునీకరణ పనులు మొదలు పెట్టారు. ఇవి చాలా వరకూ నాశిరకంగా జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అనేక వైఫల్యాలు కూడా దర్శనమిచ్చాయి. ఏదోరకంగా ఆధునీకరణ పనులను పూర్తి చేశారు. ఆ తరువాత ప్రాజెక్ట్‌ల నిర్వహణ చేపట్టాల్సి ఉంది. కానీ గడచిన అయిదు సంవత్సరాల నుంచి నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో ఆ పనులన్నీ మూలపడ్డాయి. సాధారణంగా నీటి తీరువా కింద రైతులు పన్ను చెల్లిస్తుంటారు. తహశీలార్లు ఈ పన్నును వసూలు చేసి కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) కమిషనర్‌కు పంపించాల్సి ఉంటుంది. కమిషనర్ ఆ మొత్తంలోని నిష్పత్తి ప్రకారం ప్రాజెక్ట్‌ల నిర్వహణకు నిధులు కేటాయిస్తుంటారు. నీటి తీరువా కింద ఎంత మొత్తం వచ్చిందన్న విషయం జిల్లా ఇరిగేషన్ అధికారులకు తెలిస్తే, ఆ ప్రకారం నిర్వహణకు, పూడిక తొలగింపు తదితరాలకు ప్రతిపాదనలు పంపిస్తారు. అయితే గత ఐదేళ్ళుగా నీటి తీరువా కింద ఎంత మొత్తం వచ్చిందో ఇరిగేషన్ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఈ పద్దు కింద వచ్చిన మొత్తం ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి అధికారులు పంపిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కదానికీ ఆమోదం లభించడం లేదు. దీంతో ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి, తహశీల్దార్లను ఆశ్రయిస్తున్నారు. ఐదేళ్ళుగా నీటి తీరువా కింద వచ్చిన మొత్తం గురించి ఆరా తీస్తున్నారు. ఈ డబ్బులు వస్తే, ప్రాజెక్ట్‌ల నిర్వహణతోపాటు, చేపట్టాల్సిన అనేక పనులు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పెద్దేరు ప్రాజెక్‌ను 2005-06లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పనులు దాదాపూ పూర్తయినా, నేటికీ ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కిందే ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్‌కు వచ్చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు ఈ ప్రాజెక్ట్ ఏయే సర్వే నెంబర్లలో ఉన్నాయి? ఆయకట్టు ఎంత? వంటి పూర్తి వివరాలతో కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్‌పై గజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇదంతా మరికొద్ది నెలల్లో పూర్తికానుంది.
‘క్రమశిక్షణతోనే వ్యక్తి వికాసం’
విశాఖపట్నం, జనవరి 20: క్రమశిక్షణతోనే విజయం సాధించగలమని ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిఐజి, డైరెక్టర్ అబ్రహంలింకన్ అన్నారు. ఆర్టీసీ 25వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్దిలపాలెం డిపోలో నిర్వహించిన డ్రైవర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది తాము చేసిన వృత్తిలో క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించినపుడే వారి ఇంటి వద్ద, సమాజంలోను, చివరకు అన్నిచోట్ల ఒకే విధంగా గుర్తింపబడతారు అన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో ఓర్పు, సహనం ఉండాలని, అపుడే ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందన్నారు. ప్రమాదాల నివారణలో నూరుశాతం ఫలితాలను సాధించగలిగితే ప్రపంచంలో ఇది గొప్ప లక్ష్యం అవుతుందన్నారు. సిబ్బంది సంక్షేమం పట్ల యాజమాన్యం శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవలకాలంలో ప్రైవేటు ఓల్వో బస్సుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. నెల్లూరు వద్ద, బెంగుళూరు-ముంబై మధ్య, పాలెం సంఘటనలతో అనేకమంది సజీవ దహనం అయ్యారన్నారు. దీనివల్ల సురక్షితంగా గమ్యాలకు చేర్చే ఆర్టీసీ పట్ల ప్రయాణికుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. అందువల్ల ఆర్టీసీల్లో కూడా అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా పొగ వ్యాపించే పరిస్థితులను క్షణాల్లో తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా బస్సులో ‘స్మోక్ మీటర్స్’ను ప్రవేశపెట్టామని, ఇది ఫలితాలనిస్తే అంతటా విస్తరించదలిచామన్నారు. దీని ద్వారా అలారమ్ కొడుతుందని, అపుడు ప్రయాణికులు అప్రమత్తం అయ్యేందుకు వీలుంటుందన్నారు. బస్సుల నిర్మాణంలోనే ప్రమాదాల నియంత్రణ పరికరాలను అమర్చే విధంగా భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సింహాచలం డిపో అతి తక్కువ ప్రమాదాలు నమోదు కాగా, మద్దిలపాలెంలో ఎక్కువయ్యాయన్నారు. 2012-13 సంవత్సరంలో ఆర్టీసీ ప్రమాద సంఘటనల్లో బాధిత కుటుంబాలకు 4.5 కోట్ల నష్టపరిహారం చెల్లించామన్నారు. పాడేరులో ఆరు మాసాల వ్యవధిలో ఒక్క ప్రమాదం జరగలేదని, ఇదే తరహాలో ప్రతి డిపో ఉండాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బి.మోహన్ వెంకటరామ్ మాట్లాడుతూ ఏయును ఆర్టీసీలో భాగస్వామ్యం చేస్తున్నారని, ఇది కొనే్నళ్ళుగా జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు, చనిపోయినవారు భారతదేశంలోనే ఉంటున్నారన్నారు. 1985లో విశాఖ నగరంలో కేవలం 48 వేల వాహనాలుండగా, ఇపుడు అవి ఎనిమిది లక్షలకు చేరుకున్నాయని, అలాగే 35 జంక్షన్ల స్థాయి నుంచి 150 జంక్షన్ల స్థాయికి చేరుకున్నాయన్నారు. అయినా రోడ్డు విస్తరణ మాత్రం పెరగలేదన్నారు. మానవ తప్పిదాల వలన 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బ్రిటిష్ ప్రజలు అక్కడి డ్రైవర్లకు సాల్యూట్ కొడతారని అంటే అంత గౌరవిస్తారన్నారు. రాత్రిళ్ళ డ్రైవింగ్ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలు 15 నుంచి 20 శాతం మేర పెరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యేపట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు సరిగా లేదని, ఇక నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు. ఆర్టీవో ఖాన్ మాట్లాడుతూ ఎప్పటికపుడు డ్రైవర్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, తాగి నడపడం వంటివి సరైనవికావన్నారు. ముఖ్యంగా ఏకాగ్రత, మర్యాదపూర్వకంగా వ్యవహరించడం అవసరమన్నారు. ఆర్టీసీ విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ వై.జగదీష్‌బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు వీరన్నచౌదరి, పి.జీవన్‌ప్రసాద్ డిపో మేనేజర్లు అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాచలం, మద్దిలపాలెం డిపోలకు చెందిన డ్రైవర్లు వైఎన్ రావు, ఎస్‌ఎస్ నారాయణ, ఎం నారాయణ, పివిఎస్‌ఎన్ నారాయణ, కెపి రాజు, ఎస్‌ఆర్ బాబులకు నగదు అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు.
కాసుల్లేక డీలా పడిన జివిఎంసి ఖజానాకు త్వరలోనే నిధులు వరదలా రానున్నాయి. ఈఅర్థిక
english title:
g
Date:
Tuesday, January 21, 2014