మక్కువ, జనవరి 20: ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబర శ్రీ పోలమాంబ జాతర ఈ నెల 27, 28, 29తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని పార్వతీపురం సబ్‌కలెక్టర్ శే్వతామహంతి వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం శంబర ప్రధాన ఆలయం వద్ద వివిధ శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంబర-మామిడిపల్లి, మక్కువ-శంబర రహదారుల మరమ్మతులు ఇంకా పూర్తిగా చేపట్టకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల వారీగా గత సమావేశంలో విషయాలను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. చెముడు గ్రామం వద్ద వంతెన పూర్తి కాకపోవడంతో భక్తులు వచ్చి వెళ్లేందుకు వీలుగా నదిలో తాత్కాలిక రహదారి మెరుగుపర్చాలని ఆర్ అండ్ బి అధికారులకు తెలిపారు. భక్తులను చేరవేసేందుకు వివిధ ఆర్టీసి డిపోల నుండి 229బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్‌లు తెలిపారు. 800మంది వివిధ పోలీసు దళాలతో జాతరకు గట్టి బందోబస్సు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒ.ఎస్.డి కె.ప్రవీణ్ తెలిపారు. స్థానిక బి.సి హాస్టల్ వద్ద మహిళ పోలీసులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు. జాతరలో మూడు పోలీసు కంట్రోల్ రూంలు వనంగుడి వద్ద, టికెట్ కౌంటర్ వద్ద, హైస్కూల్ వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20వాకీటాకీ పోన్‌లను వినియోగంలో ఉంచాలని ఆమె ఒ.ఎస్.డిను కోరారు. వి.ఐ.పిలకు ప్రత్యేక దర్శనం 10, 25రూపాయిలు, ఉచిత దర్శనం టికెట్ క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఇ.వో నాగార్జున తెలిపారు. మక్కువ-శంబర పి.హెఛ్.సి డాక్టర్లకు గ్రామంలో బోర్లు, బావులను క్లోరినేషన్ చేయించాలని తెలిపారు. వైద్య శిబిరాలు, 108వాహనాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎం.పి.డి.వో కె.విజయలక్ష్మికు పారిశుద్ద్యం మెరుగుపర్చాలని ఆదేశించారు. మంచినీటికి ఇబ్బందులు లేకుండా బోర్లు, మంచినీటి పథకాలు త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని ఆర్.డబ్య్లూ. ఎస్ అధికారులకు ఆమె ఆదేశించారు. జాతర దగ్గర పడడంతో అన్ని శాఖాధికారులు అప్రమత్తంగా త్వరగా పనిచేయాలని లేనిచో చర్యలు చేపడతామని ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబర శ్రీ పోలమాంబ జాతర ఈ నెల 27, 28, 29తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు
english title:
s
Date:
Tuesday, January 21, 2014