ఏలూరు, జనవరి 21: జనావాసాలు కాని, వ్యవసాయం కాని సాగుతున్న దాఖలాలు లేని భూములు అవి...వాటిపైనే ఇప్పుడు గద్దల కన్నుపడింది. అనుకున్నదే తడవు మంత్రాంగం సిద్ధమైంది. కోట్ల విలువైన భూమి కోసం మంత్రాంగం సిద్ధమైపోయింది. ఏలూరులోనే ఒక హోటల్ కేంద్రంగా దీనికోసం నెలన్నర రోజులుగా వ్యూహరచన సాగుతూనే ఉంది. అన్ని స్ధాయిల్లోనూ ఈ మేనేజ్‌మెంట్2 పూర్తయింది. ఇక మిగిలింది ఒక్కరే. ఆ ఒక్కరే ఆమోదముద్ర వేయాల్సింది కూడా. అది కూడా జరిగిపోతే ఇక కోరుకున్న వారికి పట్టపగ్గాలే ఉండవు. అయితే సమస్య అంతా అక్కడే ఉంది. రాడార్లు పేరు చెప్పి అధికార యంత్రాంగాన్ని వణికిస్తున్న ఆ ఒక్కరు దీనికి అంగీకరిస్తారా, లేక ఫైల్ తుప్పు వదులుస్తారా అన్నది వేచి చూడాలి. టి.నర్సాపురం మండలం కృష్ణాపురంలోని ఈ భూముల వ్యవహారం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒకో ఎకరం పదిలక్షల రూపాయలు మార్కెట్ ధర పలుకుతుందనుకుంటే ఈ 89.68 ఎకరాల భూముల విలువ పది కోట్ల రూపాయలకు చేరువలోనే ఉంటుంది. ఈ స్ధాయిలోనే ఇప్పుడు వ్యవహారం జరుగుతున్నది కూడా. వాస్తవానికి గ్రామస్తుల కధనం ప్రకారం పూరీలోని జగన్నాధస్వామి ఆలయం జగద్విదితమే. ఆ ఆలయంలోని పురోహితులకు ఈ భూములను ఈనాంగా ఇచ్చారని చెపుతుంటారు. అయితే గతంలోనే ఆ పురోహితులు ఆ భూములు సాగు చేసే అవకాశం లేక జిల్లా వాసి ఒకరికి లీజుకిచ్చినట్లు చెపుతున్నారు. ఈమాత్రం అవకాశం ఇస్తే చెలరేగిపోవటం సహజమే అయినట్లు లీజుకు తీసుకున్న వ్యక్తి ఆ భూములను ఏకమొత్తంగా మరొకరికి విక్రయించినట్లు చెపుతుంటారు. అసలు పురోహితుల ప్రమేయం లేకుండా ఈ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయని ఈ ప్రచారంలో భాగం. అవన్నీ ఎలాఉన్నా ఆ భూములను మాత్రం గతంలోనూ, ఇప్పుడు కూడా ఎవరూ నివాసం ఉండటం కాని, వ్యవసాయం చేయటం గాని జరగలేదని స్ధానికులు స్పష్టంగా చెపుతుంటారు. ఈవిధంగా కొన్ని వివాదాలు ప్రచారంలో ఉన్న ఈ భూముల విలువ భారీగా ఉండటంతో తమకున్న పలుకుబడి ఉపయోగించి ఎలాగోలా వాటిని దక్కించుకునేందుకు గద్దల యత్నం ప్రారంభమైంది. గత 55 సంవత్సరాల నుండి ఈ భూముల వ్యవహారం ఎవరికి పట్టనివిధంగా మారిపోయింది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నుండి ఈ భూములు తమకు చెందుతాయని కొంతమంది భూ సెటిల్‌మెంట్ కోర్టును ఆశ్రయించారని గ్రామస్తులు చెపుతున్నారు. గతంలో పనిచేసిన అధికారులు ఈ భూములను పరిశీలించటం, అయితే భూమిలో ఎటువంటి సేద్యం గాని, నివాసాలు గాని లేకపోవటంతో తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించలేకపోయారు. దీంతో ఈ భూములను దక్కించుకునేందుకు కొన్ని గద్దలు రంగంలోకి దిగిపోయాయి. ఏలూరులోని ఎన్‌ఆర్ పేటలో ఉన్న ఒక హోటల్ కేంద్రంగా గత నెలన్నర రోజులుగా ఈ మంత్రాంగాన్ని నడిపిస్తూ వస్తున్నాయి. భూ వ్యవహారాల్లో అరితేరిన వారి అనుభవాన్ని రంగరిస్తూ దాన్ని ఈ భూములను దక్కించుకునేందుకు ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటూ ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేస్తూ ఒక స్ధాయిలో మొత్తం అనుకూలంగా మార్చుకోగలిగారు. ఏలూరుకు సమీపంలోని ఒక మండల తహసిల్దారు, మరో ఉన్నతాధికారి, కొల్లేరు చేపల చెర్వుల లీజు వ్యవహారంలో చక్రం తిప్పే మన మాయలరాజుతోపాటు హైదరాబాద్ నుండి వస్తున్న వ్యక్తులు కలిసి ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈస్ధాయిలో ఎలాఉన్నా ఇప్పుడది నిర్ణయం తీసుకునే స్ధితికి చేరుకుందని చెపుతున్నారు. ఇక ఆ నిర్ణయం తీసుకునే ఆ ఒక్కరు మాత్రం ఈస్ధాయిలో లేకపోవటం, ఆక్కడకు వెళ్లి వ్యవహారం నడిపించగలిగే ధైర్యం చేయలేకపోవటంతో అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం వీరందర్ని కుదిపేస్తోంది. అయితే తమ పంతం నెగ్గించుకునేందుకు రాష్ట్ర మంత్రులతో కూడా సిఫార్సులు చేయించేస్తున్నారు. ప్రభుత్వరికార్డుల్లో భిన్నంగా నమోదై ఉన్న ఈ భూములను గద్దలకు కాకుండా పేదలకు ఇస్తే ఎంతోకొంత ఉపయుక్తంగా ఉంటుందని గ్రామస్తులంతా వ్యాఖ్యానిస్తున్నారు. గత 50 సంవత్సరాల నుండి ఎవరి పాలు కాకుండా కాపాడుకుంటూ వస్తున్న ఈ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని తమకు పట్టాల రూపంలో పంపిణి చేయాలని వారు కోరుకుంటున్నారు.
ఇవివి సోదరుడు గిరి మృతి
నిడదవోలు, జనవరి 21: ప్రముఖ సినీ దర్శకుడు దివంగత ఇవివి సత్యనారాయణ సోదరుడు ఇవివి గిరి మంగళవారం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఇవివితో కలిసి ఆయన అనేక చిత్రాల్లో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. చిరంజీవి హీరోగా నటించిన చంటిబ్బాయి చిత్రంతో గిరికి మంచి గుర్తింపు లభించింది. ఇవివి దర్శకత్వం వహించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, బెండు అప్పారావు ఆర్‌ఎంపి, కత్తి కాంతారావు, ఏవండీ ఆవిడొచ్చింది తదితర చిత్రాలకు ఆయన స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. తాళి చిత్రానికి నిర్మాతగా కూడ వ్యవహరించారు. 2011 జనవరి 21న ఇవివి మృతి చెందగా గిరి మూడేళ్ల అనంతరం జనవరి 21నే మరణించడం వారి అన్యోన్యతకు నిదర్శనంగా పలువురు చెప్పుకొంటున్నారు. గిరి మృతితో ఆయన జన్మస్థలమైన దొమ్మేరు, పెరిగిన కోరుమామిడి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జనావాసాలు కాని, వ్యవసాయం కాని సాగుతున్న దాఖలాలు లేని భూములు అవి
english title:
evariki eenam
Date:
Wednesday, January 22, 2014