బుట్టాయగూడెం, జనవరి 21: తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఇచ్చిన గురువే పదో తరగతి విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగికదాడికి దిగాడు. గత కొద్ది నెలలుగా సాగుతున్న ఈ అకృత్యానికి ఆమె గర్భం దాల్చడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవహారాన్ని రాజీ పేరుతో మసిపూరి మారేడు చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో పరారయ్యాడు. బుట్టాయగూడెం మండలం నూజతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ దురాగతం అందరినీ నివ్వెరపరుస్తోంది. పాఠశాలలో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుంజా సోమరాజు అమాయకంగా ఉండే ఒక బాలికను పాఠశాల పై అంతస్తులోకి తీసుకెళ్లి లైంగిక దాడిచేశాడు. గత ఏడాది జూలై-ఆగస్టు నుండి ఈ దురాగతం సాగుతోంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం విద్యార్థినులకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షల సందర్భంగా ఈ నెల 11న ఎఎన్‌ఎం సరస్వతి గుర్తించారు. వ్యవహారాన్ని హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానోపాధ్యాయడు బాలికను తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు. ఇక ఇక్కడి నుండి రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చేసిన పాపాన్ని డబ్బుతో కడిగేసుకోవచ్చనే ధీమాతో నిందితుడు సోమరాజు కులాసాగా పాఠశాలకు వచ్చేవాడు. అయితే మంగళవారం ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి విజయశాంతి, స్థానిక తహసీల్దార్ ఎన్ నరసింహమ్మూర్తి తదితర అధికారులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లి విచారణ ప్రారంభించారు. బాలిక నుండి ఫిర్యాదు అందుకున్న జంగారెడ్డిగూడెం సిఐ మురళీరామకృష్ణ కేసు నమోదుచేసి, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రజా సంఘాలు, మహిళల ఆందోళన
టెన్త్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు చంద్రన్న వర్గం, మహిళలు ఆందోళనలకు దిగారు. విచారణకు వచ్చిన అధికారులు, ఉపాధ్యాయులపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోనే విద్యార్థినులకు రక్షణ లేకుంటే తమ పిల్లలను మరెక్కడ చదివించాలంటూ నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయునిపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలలో వివిధ సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ, కారం భాస్కర్, పోలోజు నాగేశ్వరరావు, అందుగుల ఫ్రాన్సిస్, ఎన్ సోమరాజు, డి గోవిందు, పలువురు మహిళలు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఇచ్చిన గురువే పదో
english title:
maro mrugaadu ..
Date:
Wednesday, January 22, 2014