హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా గవర్నర్‌కు విస్తృత అధికారాలను కట్టబెడితే తాము ఊరుకునేది లేదని, పునర్వ్యవస్థీకరణ బిల్లులో అందుకు తగిన సవరణలు చేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు సూచించారు. సోమవారం ఆయన పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మూడేళ్ల పాటు మాత్రమే కొనసాగించాలని అన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్ పాలన సరికాదని, అలాగే ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు స్థానికులకే కేటాయించాలని, పెన్షన్లు, ఉద్యోగుల బదిలీ స్థానికత అంశం ఆధారంగా జరగాలని అన్నారు. టిఆర్‌ఎస్ పోరాటం పాలకుల మీదనే తప్ప సామాన్య సీమాంధ్రుల మీద కాదని పేర్కొన్నారు. తమ ఉద్యమంలో సంకుచితత్వం లేదని, విదేశీయురాలు మదర్ థెరిస్సాకు భారతరత్న ఇచ్చిన సంస్కారం ఉన్న దేశం మనది కనుక హైదరాబాద్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పేర్కొన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్న తర్వాతనే తెలంగాణ బిల్లు శాసనసభలోకి వచ్చిందని దానిని అంతా సమర్థించాలని సూచించారు. తెలంగాణ పేరు మీద టిఆర్‌ఎస్ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఆ పార్టీ నేతలు పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ట్యాంకుబండ్‌పై విగ్రహాలను మట్టిబొమ్మలు అని కె తారకరామారావు అనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారికి కూడా సమాధులు కట్టడమేగాక, ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన సంస్కారం మీదని టిడిపిని కె తారకరామారావు నిందించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని, కేవలం సీమాంధ్రకు సమన్యాయం చేయమని మాత్రమే కోరుతోందని టిడిపి నేత యర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆనాడు వైస్రాయ్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినపుడు నాయకుడు కెసిఆర్ కాదా అని నిలదీశారు. టిఆర్‌ఎస్ రెచ్చగొడితేనే వెయ్యి మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. దానికి కారణం టిఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వద్దని టిడిపి ఎన్నడూ చెప్పలేదని, సీమాంధ్రకు సమన్యాయం కావాలని మాత్రమే అంటోందని అన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో
పార్టీ అభ్యర్థులను ఓడిస్తాం
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 21: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీమాంధ్రకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరితో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీరశివారెడ్డి మంగళవారం చెప్పారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దించుతామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు, తెలుగు దేశం పార్టీకి రెండు సీట్లు లభిస్తాయని అన్నారు. మరో స్థానాన్ని టిఆర్‌ఎస్‌కు ఇచ్చి ఇప్పటి నుంచే ఎన్నికల పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కెవివి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. పార్టీ వారే కాకుండా ఇతరులను కూడబెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చండి’
హైదరాబాద్, జనవరి 21: జీవో 101 సవరించి అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీశైలం డిమాండ్ చేసారు. తప్పుల తడకగా, దురుద్దేశపూర్వకంగా ఉన్న జీవో 101 ను వెంటనే సవరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన పథకం కింద లక్ష రూపాయలకు మించకుండా 60 శాతం వరకు సబ్సిడీని కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత ఈ పథకంలో అనేక సవరణలు చేస్తూ జీవో 101 విడుదల చేసారని ఆయన విమర్శించారు. జీవో 101లో సవరణలు చేయకపోతే, రాష్టవ్య్రాప్తంగా తమ ఎస్సీ, ఎస్టీ సెల్‌ల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతామని శ్రీశైలం హెచ్చరించారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జి రాంబాబు, కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యరావు డిమాండ్ చేసారు. ఆటో చార్జీలు పెంచాలని డిమాండ్‌తో ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆటో యూనియన్ల నేతలను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తోన్నట్టు పేర్కొన్నారు.
అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని రాంబాబు డిమాండ్ చేసారు.