భీమవరం, జనవరి 21: సార్వత్రిక ఎన్నికల భద్రతా ప్రణాళికకు పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఉన్నా, ముందుగానే ముగించాలని భావిస్తోంది. ప్రతి అంశాన్ని కుణ్ణంగా పరిగణనలోకి తీసుకుని సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలోని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న వారికి బదిలీలు తప్పనిసరి కానున్నాయి. ఇటీవల ఎన్నికల కమిషన్ జిల్లా రెవెన్యూ, పోలీసు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించింది. స్వేచ్చాయుత పోలింగు నిర్వహణ, ఓటర్ల రక్షణకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేయాలనేది ఆదేశం. ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే పోలింగ్ కేంద్రాలు ఎక్కడెకక్కడ ఉన్నాయి ? రిగ్గింగ్ జరిగే, పోలింగ్ కేంద్రాలను అడ్డుకునేవి ఎక్కడున్నాయి, నాన్ బెయిలబుల్ వారెంట్ల (ఎన్‌బిడబ్ల్యూ)ను తక్షణం అమలుచేయాలని కిందిస్థాయి అధికారులను ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ప్రతి పోలీసు స్టేషన్‌లోను ఎన్‌బిడబ్ల్యూలు ఎన్ని ఉన్నాయి, క్రిమినల్, సివిల్ కేసులు ఎన్ని ఉన్నాయో వివరాలు తీసుకుంటున్నారు. అలాగే 2009 ఎన్నికల సమయంలో ఏయే గ్రామాల్లో ముఖ్యంగా ఏయే పోలింగ్ బూత్‌లలో వివాదాలు చోటు చేసుకున్నాయో పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా మూడేళ్ళుగా పనిచేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆ పై అధికారుల బదిలీ అనివార్యం కానుంది. వారు జిల్లాను వదలక తప్పదు. ఎస్సైలు తమ సొంత నియోజకవర్గ పరిధిలో పనిచేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించిన జాబితాల తయారీని అధికారులు ప్రారంభించినట్టు సమాచారం. తహసీల్దార్లకు కూడా అదే పరిస్థితి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎంతమంది పోలీసు, రెవెన్యూశాఖ నుండి బదిలీ కానున్నారన్నది ఉన్నత స్థాయిలో అధికారులు నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
విలువలతో కూడిన విద్యాబోధన జరగాలి
ఏలూరు, జనవరి 21: ప్రాథమిక స్థాయి నుండే విద్యార్ధినీ విద్యార్ధులకు విలువలతో కూడిన విద్యాబోధన జరగాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యపడతాయని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ అన్నారు. ఏలూరులో మంగళవారం ఎంఇవోలు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల సమావేశంలో విద్యా ప్రమాణాల తీరుపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇటీవల తాను పలు ఇంటర్వ్యూలు నిర్వహించానని, ఒక్క విద్యార్ధి కూడా సరైన విజ్ఞానం లేకుండా సమాధానాలు ఇవ్వడం జరిగిందని, దీన్ని బట్టి కాగితాలకే డిగ్రీలు పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే విద్యా విధానం కావాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎల్‌కెజి నుండి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రయత్నించాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్టస్థ్రాయిలో ర్యాంకుల కోసం కాపీయింగ్ చేసే విధానం తనకు నచ్చదని, విద్యార్ధినీ విద్యార్ధుల ప్రతిభ ఆధారంగానే ఫలితాలు రావాలన్నారు. ఇప్పటి నుండే కొద్దిపాటి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఆశించిన ఫలితాలు పొందడం కష్టం కాదన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో చదివే విద్యార్ధినీ విద్యార్ధులపై ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని, వారికి మంచి విద్య అందిస్తే వారి జీవితం సుస్థిరం అవుతుందన్నారు. మండల స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ప్రాథమిక స్థాయి నుండే చక్కటి విద్యా విధానాన్ని అమలుచేయడానికి ఎంఇవోలు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు.
డిఇఒ ఆర్ నరసింహరావు మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాస్ కోసం ప్రయత్నించడం సిగ్గు చేటు అని ప్రతీ విద్యార్ధి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తే విద్యారంగంలో పశ్చిమ అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. జిల్లాలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ చదివే ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు అర్హులైన వారు ఫిబ్రవరి మొదటి వారంలోగా తమ పేర్లను ఈ-పాస్ ద్వారా నమోదు చేసుకునేలా ఎంఇవోలు, ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ హాస్టల్స్ అధికారులు శ్రద్ధ వహించాలని నరసింహరావు కోరారు.
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి:కలెక్టర్
ఏలూరు, జనవరి 21 : జిల్లాలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఉద్యమ రూపంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ గృహ నిర్మాణ శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం గృహ నిర్మాణ ప్రగతి తీరుపై ఆయన సమీక్షించారు. అర్హులైన వారికి నూతనంగా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలన్నీ ఫిబ్రవరి లోపు ప్రారంభించాలని, ప్రగతిలో ఉన్న ఇళ్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందీ వాటిలో పూర్తయినవి, ప్రగతిలో ఉన్నవి, ప్రారంభం కానివి, సొమ్ము చెల్లింపు, తదితర వివరాలతో వర్క్ ఇన్‌స్పెక్టర్, ఎఇల వారీగా రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా చురుగ్గా పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ విషయంలో ఆధార్ సీడింగ్‌లో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ మరో రెండు లక్షల ఇళ్లకు సంబంధించి ఆధార్ సీడింగ్‌ను జనవరి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండల, గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణ ప్రగతి తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, జిల్లాలోని డిఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 60 వేల మందికి ఓటుహక్కు
ఏలూరు, జనవరి 21 : జిల్లాలో కొత్తగా 60 వేల మంది యువతకు ఓటు హక్కు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో మంగళవారం రాత్రి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా చరిత్రలో ఓటర్ల జాబితా సవరణలో 18-19 సంవత్సరాల వయస్సున్న యువత ప్రప్రధమంగా 60 వేల మందికి ఓటు హక్కు లభించడం ఇదే ప్రప్రధమమని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బూత్ లెవెల్ ఆఫీసరు మొదలు జిల్లాస్థాయి అధికారులు, వివిధ కళాశాలలు ప్రత్యేక కృషి ఫలితంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఓటు హక్కు పొందిన వారంతా విధిగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు సెయింట్ ధెరిస్సా జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్యార్ధులకు వక్తృత్వ, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు ఈ నెల 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాస్థాయి పోటీలను ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాస్థాయి విజేతలను హైదరాబాదులో ఈ నెల 24వ తేదీన జరిగే రాష్టస్థ్రాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. అదే విధంగా 23వ తేదీ ఉదయం సర్ సి ఆర్ ఆర్ కళాశాల ఆవరణ నుండి ర్యాలీ నిర్వహించబడుతుందని, ఈ ర్యాలీలో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, పాఠశాల, కళాశాల విద్యార్ధులు, టీచర్లు, యువత వివిధ సేవా సంఘాల సభ్యులు, క్యాడెట్లు, వాలంటీర్లు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 6 గంటలకు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుండి ఇండోర్ స్టేడియం వరకు యువత, క్రీడాకారులు, ఔత్సాహికులు, పోలీసులు, హోంగార్డులు, ఎన్‌సిసి క్యాడెట్లు, కళాశాల విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాటదారుల అనాసక్తితో తలనీలాల వేలం వాయిదా
ద్వారకాతిరుమల, జనవరి 21: చిన వెంకన్నకు భక్తులు సమర్పించే తలనీలాల వేలం పాటలో పాల్గొన్న పాటదారులు పాటలో ఆసక్తి చూపకపోవడంతో అది వాయిదా పడింది. గత ఏడాది శ్రీవారికి తలనీలాల ద్వారా 7.02 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది మార్చి 31తో పాట కాలం ముగిసిపోతుండడంతో మంగళవారం ఆలయ కల్యాణ మండపంలో తలనీలాల వేలంపాట నిర్వహించారు. ఇందులో ఏలూరు, తణుకుకు చెందిన సంస్థలు పాల్గొన్నాయి. గత ఏడాది పాట హెచ్చు ధరనే మంగళవారం దేవుని పాటగా ప్రారంభించారు. అయితే పాల్గొన్న వారెవరూ పాట కొనసాగించకపోవడంతో వేలం రద్దు చేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తెలియచేస్తామని ఇఒ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
ప్రైవేటు బుకింగ్ కౌంటర్లను ఉపయోగించుకోండి
-దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ భరత్‌భూషణ్
భీమవరం, జనవరి 21: ప్రైవేటు రైల్వే టిక్కెట్ బుకింగ్ కౌంటర్లను ప్రయాణీకులు సద్వినియోగపరుచుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ అప్పికట్ల భరత్ భూషణ్ పేర్కొన్నారు. మంగళవారం భీమవరం రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీచేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం, టికెట్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ ప్రతి ప్రయాణీకుడు టికెట్ కొనుక్కుని ప్రయాణం చేయాలని, టిక్కెట్టు లేని ప్రయాణం నేరమన్నారు. ఈ సందర్భంగా భూషణ్‌ను దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జంక్షన్ రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌కు జంక్షన్ స్టేషన్‌లో హాల్టు ఇవ్వాలని కోరారు. అనంతరం దళితుల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందచేశారు. భూషణ్‌ను కలిసిన వారిలో న్యాయవాదులు బోకూరి విజయరాజు, డికెవి ప్రకాష్, మల్లిపూడి సూర్యారావు, ఎంఆర్‌పిఎస్ పట్టణ అధ్యక్షుడు అనపర్తి కృష్ణప్రసాద్, ఎంఆర్‌పిఎస్ ఉండి కన్వీనర్ దిద్దేబాబు, మాజీ రైల్వే ఉద్యోగి మువ్వల విల్సన్, ఏసుపాదం, భీమవరం బార్ అసోసియేషన్ సభ్యులు బొక్కా రాజారామ్మోహన్‌రావు, కె ముసలయ్య ఉన్నారు.
గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలకు రూ.40 లక్షలు
ఏలూరు, జనవరి 21: పాఠకులకు నూతన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు 40 లక్షల రూపాయలు కేటాయించినట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బివి నాగచంద్రారెడ్డి చెప్పారు. మంగళవారం జిల్లా గ్రంధాలయ సంస్థ సమావేశ మందిరంలో గ్రంధాలయాల పుస్తకాల ఎంపిక సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచంద్రారెడ్డి మాట్లాడుతూ నూతన పుస్తకాలు ఎంపిక చేసేందుకు తొమ్మిది మంది సభ్యుల కమిటీ ఏర్పాటు చేశామని, వారిలో ఆరుగురు ప్రభుత్వం తరఫున నామినేటెడ్ సభ్యులుగాను, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులుగా ఉంటారన్నారు. నిపుణులు ఎంపికచేసిన పుస్తకాలను కొనుగోలుచేసి పాఠకులకు అందుబాటులో గ్రంథాలయాల్లో ఉంచుతామన్నారు. అదేవిధంగా గ్రంథాలయాలకు వచ్చిన పాఠకులు కోరిన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించామని, వాటితో కూడా రెండు మూడు రోజుల్లో గ్రంథాలయాల్లో పుస్తకాలు సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సిఇఓ వి నాగార్జున సాగర్, గ్రంథాలయ సంస్థ సెక్రటరీ సిహెచ్ మదారు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి ఆధునిక యంత్రాలు
పోలవరం, జనవరి 21: పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఆధునిక యంత్రాలు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటున్నాయి. రామయ్యపేట గ్రామ సమీపాన ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి మంగళవారం ఈమేరకు యంత్రాలు చేరుకున్నాయి. ఎర్త్‌వర్క్ వేగవంతం చేసేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఎర్త్ వర్క్‌లో లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తీస్తున్నారు. ఆధునిక యంత్రాలతో రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని తీసి, అనంతరం స్పిల్‌వే, కాంక్రీట్ పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
విజయా బ్యాంకులో చోరీకి విఫలయత్నం
ఉండి, జనవరి 21: మండలంలోని కోలమూరు విజయాబ్యాంకులో దొంగలు కిటికీ ఊచలు తొలగించి, లోనికి ప్రవేశించి దొంగతనానికి విఫలయత్నం చేశారు. స్ట్రాంగ్‌రూమ్ తెరిచేందుకు వీలు కాకపోవడంతో డస్క్‌ల్లోని వస్తువులు చిందర వందర చేసి, జారుకున్నారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వెళ్లినపుడు దొంగలు ప్రవేశించిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ మంతెన వెంకట్రాజు ఉండి పోలీసులుకు ఫిర్యాదుచేశారు. భీమవరం రూరల్ సిఐ శివాజీరావు, ఉండి ఎస్సై ఎన్ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు లోనికి ప్రవేశించినప్పుడు విద్యుత్ మెయిన్ ఆపి ప్రవేశించారు. అయినప్పటికీ లోపల ఉన్న ఒక సిసి కెమెరాలో ఒక వ్యక్తి సంచరించినట్లు రికార్డయ్యిందని బ్యాంకు మేనేజర్ వెంకట్రాజు చెప్పారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు కూడా వివరాలు సేకరించారు. బ్యాంకులో ప్రధాన స్ట్రాంగ్ రూమ్ చక్రం ఊడదీసినా డోర్ మాత్రం ఓపెన్ కాలేదు. బ్యాంకుకు సంబంధించిన నగదు గాని వస్తువులుగాని పోలేదని మేనేజర్ వెంకట్రాజు తెలిపారు. దీనివల్ల బ్యాంకు సిబ్బందికి స్ట్రాంగ్‌రూం తెరుచుకోలేదు. దాంతో గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు బుధవారం వచ్చి దానిని తెరుస్తారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శంకర్ తెలిపారు.
ఇప్పటివరకు 60 ప్రైవేటు బస్సులు సీజ్
భీమవరం, జనవరి 21: జిల్లాలో ఇప్పటి వరకు అరవై ప్రైవేటు బస్సులను సీజ్ చేశామని జిల్లా ఉప రవాణా కమిషనర్ (డిటిసి) శ్రీదేవి తెలిపారు. జిల్లాలో 1300 స్కూల్ బస్సులు ఉన్నాయని, గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూళ్ల బస్సులను తనిఖీ చేశామన్నారు. తనిఖీలలో 229 బస్సులపై కేసులు నమోదుచేసి 60 బస్సులను సీజ్ చేశామన్నారు. అలాగే 105 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదుచేసి 20 బస్సులను సీజ్ చేశామన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి స్కూలు బస్సు, ఆటో, కారు, జీపులకు స్టిక్కర్లువ అతికిస్తున్నామన్నారు. జిల్లాలో 9వేల ఆటోలు ఉన్నాయని, ఆటోలో ఎంతమంది ప్రయాణించాలి, ఎలా నడపాలి వంటి పలు అంశాలు ఆ స్టిక్కర్లలో పొందుపరిచి ఉన్నాయన్నారు. సమావేశంలో భీమవరం ప్రాంతీయ రవాణా అధికారి జె రమేష్‌కుమార్ ఉన్నారు.