ఇస్లామాబాద్-పెషావర్, జనవరి 21: పాకిస్తాన్‌లో తాలిబన్లు, అల్ ఖైదా తీవ్రవాదులకు ప్రధాన స్థావరమైన ఉత్తర వజిరిస్తాన్‌లో సైనికులు జరిపిన వైమానిక దాడిలో నలభై మంది మిలిటెంట్లు హతమయ్యారు. తాలిబన్ కమాండర్ అద్నాన్ రషీద్ ఇంటిపైన కూడా సైనికులు దాడి చేశారు. తమపై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ప్రతిగా సైనికులు మెరుపు వేగంగా స్పందించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలో నలభై మంది తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు సైనిక దళ అధికారులు మంగళవారం ప్రకటించారు. 2003లో పాక్ మాజీ అధ్యక్షుడు పెర్వెజ్ ముషారఫ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన రషీద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తాజా దాడిలో హతమైనట్లు పాక్‌లోని కొన్ని టీవీ చానళ్లు వార్తల్ని ప్రసారం చేశాయి. అయితే, రషీద్ మరణించినట్లు సైనికాధికారులు ధ్రువీకరంచడం లేదు. ముషారఫ్‌పై హత్యాయత్నం కేసులో రషీద్‌కు మరణశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పగా, ఆయన 2012 ఏప్రిల్‌లో జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఒకప్పుడు వైమానిక దళంలో టెక్నీషియన్‌గా పనిచేసిన రషీద్ తూర్పు వజిరిస్తాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో అతడ్ని పట్టుకునేందుకు సైనికులు కొంతకాలంగా విస్తృతంగా గాలిస్తున్నారు. మిలిటెంట్ల కదలికల గురించి కచ్చితమైన సమాచారం అందడంతో సైనికులు పకడ్బందీ వ్యూహంతో వైమానిక దాడి జరిపారు. పెషావర్‌లోని ఓ చర్చిపైన, ఖిస్సా బజార్‌లో, బన్నూ కంటోనె్మంట్ ప్రాంతంలో ఇటీవలి విధ్వంసకాండతో ఈ మిలిటెంట్లకు సంబంధం ఉన్నట్లు సైనికదళ అధికారులు చెప్పారు. కాగా, సైనికుల దాడిలో మరణించిన వారిలో కొంతమంది సాధారణ పౌరులు కూడా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతం వద్దకు మీడియాను అనుమతించక పోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. గత ఆదివారం బన్నూ కంటోనె్మంట్ ప్రాంతంలో మిలిటెంట్ల దాడిలో గాయపడిన వారిని పాక్ ఆర్మీ అధిపతి జనరల్ రహీల్ షరీఫ్ మంగళవారం పరామర్శించారు. ఇదిలా ఉండగా, మిలిటెంట్లపై సైనికులు వైమానిక దాడి జరపడం పాక్‌లో చర్చనీయాంశమైంది. 2007లో స్థానిక మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఉత్తర వజిరిస్తాన్‌లో సాయుధ సైనికులు తొలిసారిగా వైమానిక దాడి జరపడం గమనార్హం.
పాకిస్తాన్‌లో తాలిబన్లు, అల్ ఖైదా తీవ్రవాదులకు
english title:
p
Date:
Wednesday, January 22, 2014