తిరువనంతపురం, జనవరి 21: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఆహార భద్రతా చట్టాని యుపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తూ, ఇది ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించడమే కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ దుకాణాల్లో సైతం సంస్కరణలను తీసుకు వస్తుందన్నారు. మంగళవారం ఇక్కడ సెంటర్ ఫర్ సోషల్ ఎక్సలెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసిన ఎక్సలెన్స్ అవార్డును కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి కెవి థామస్‌కు అందజేసిన అనంతరం మాట్లాడుతూ జైరాం రమేశ్ ఈ విషయం చెప్పారు.
ఈ చట్టం రేషన్ దుకాణాల వ్యవస్థ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు విప్లవాత్మకమైనది కాకపోవచ్చుకానీ, దేశంలోని నిరుపేదల్లో 70 శాతం మంది నివసించే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ మార్పులను తీసుకు వస్తుందని, ఇది వారి పాలిట నిజమైన విప్లవమేనని జైరాం చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేషన్ దుకాణాలు దాదాపుగా అన్ని గ్రామాల్లోను ఉన్నాయని, ఇక్కడ ఆహార ధాన్యాలు పక్కదోవ పట్టడం తక్కువని, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని మంత్రి చెప్పారు. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, మనం చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆయన అంటూ, ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ దుకాణాల్లో సంస్కరణలు తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర వహించినందుకు థామస్‌ను అవార్డుతో సత్కరించడం రాజకీయ నేతలు సమాజానికి నిర్మాణాత్మక సేవలు అందించగలరనే సందేశాన్ని కూడా ఇస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా విమర్శిస్తూ రమేశ్ అన్నారు. దేశంలో ఇప్పుడు రాజకీయ వ్యతిరేక సంస్కృతి ఎక్కడ చూసినా కనిపిస్తోందని ఆయన అంటూ, ఏ టీవీ చానల్ పెట్టినా అదే కనిపిస్తోందని, ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులను వారు సమాజానికి చేసిన సేవలకు గుర్తిస్తూ సత్కరించడం చాలా మంచిపనని అన్నారు. ప్రజలందరికీ ఆహారం లభించేలా చూడడం ద్వారా యుపిఏ ప్రభుత్వం 2009లో ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఆయన అన్నారు. ఈ చట్టంపై ఒక సినిమా తీస్తే దానికి ప్రధాని మన్మోహన్ సింగ్ డైరెక్టర్‌గా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రధాన నటుడుగా ఆహార శాఖ సహాయ మంత్రి కెవి థామస్ ఉంటారని జైరాం రమేశ్ అన్నారు.
కేజ్రీవాల్ ఎన్నికను కొట్టివేయండి
హైకోర్టులో బిజెపి నాయకుల పిటిషన్
న్యూఢిల్లీ, జనవరి 21: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేబినెట్ మంత్రి సోమనాథ్ భారతి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా ఖర్చుచేశారని ఆరోపిస్తూ బిజెపి నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. వారి ఎన్నికను కొట్టివేయాలంటూ ఆ పిటిషన్‌లో విజ్ఞప్తిచేశారు. రూ.14 లక్షల ఎన్నికల వ్యయ పరిధికి మించి ఖర్చుచేసి ఈ ఇద్దరు నాయకులు ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన బిజెపి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ఆర్.పి.మెహ్రా వేర్వేరుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో అధికంగా ఖర్చు చేశారని, దీని ఆధారంగా వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లు ఈ వారమే విచారణకు రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగైదు లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేజ్రీవాల్, సోమనాథ్ భారతి ఎన్నికల ప్యానెల్‌కు తెలిపారని కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 23న జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటుచేసిన గాన విభావరి ఖర్చు కూడా కలిపిన పక్షంలో ఒక్కొక్కరి ఎన్నికల ఖర్చు ఇసి విధించిన పరిధి దాటిపోతుందని ఢిల్లీ హైకోర్టు ఆవరణలో ఆర్.పి.మెహ్రా విలేఖరులకు వెల్లడించారు. గానవిభావరి కార్యక్రమానికి రూ.40 లక్షలు ఖర్చుచేశారని, ఆ ఖర్చును కూడా సమానంగా కలిపిన పక్షంలో ఇసి విధించిన పరిధి దాటిపోతుందన్నారు. వారిపై అనర్హత వేటుకు ఈ ఆధారాలు సరిపోతాయన్నారు.