రామచంద్రపురం, మార్చి 14: తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, తన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ఈ నెల 18న సమావేశం నిర్వహిస్తున్నట్లు గుత్తుల శ్రీసూర్యనారాయణ బాబు ప్రకటించారు. పట్టణంలో బుధవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీని ఒక సామాజికవర్గ పార్టీగా అభివర్ణిస్తూ ఒక పథకం ప్రకారం తనను పార్టీ నుంచి దూరం చేసే కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు చినరాజప్ప, దేశం పార్టీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం తన ఇంటికి వచ్చి, ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని వేరొకరిని పెడతామని చెప్పిన సమయంలో తాను వ్యతిరేకించానని తెలిపారు.
ఈ నెల 10న హైదరాబాద్‌లో దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశాన్ని ఏర్పరచగా, తాను హాజరై, తనను అభ్యర్థిగా ఉంచాలని.. ఈసారి పరాజయం పాలైతే.. ఇకముందు సామాన్య కార్యకర్తగా వ్యవహరిస్తానని చెప్పానన్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజికవర్గీయులు గుత్తుల అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారన్నారు. వేరొక అభ్యర్థిని ఖరారు చేస్తామని, సహకరించాలని చంద్రబాబు ఆదేశించినట్లు గుత్తుల తెలిపారు. తాను నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరగా చంద్రబాబు అంగీకరించారన్నారు. ఈలోగా తన ప్రమేయం లేకుండా రామచంద్రపురంలో సమావేశం నిర్వహించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తన వెంట 10 వేల కుటుంబాలు ఉన్నాయని, వారందరినీ సమీకరించి, నచ్చజెబుతానని చెప్పినా తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం పట్ల కార్యకర్తల్లో ఆందోళన, ఆవేదన కలిగిందన్నారు. తన ప్రమేయం లేకుండానే ఈ ఘటనలన్నీ జరిగాయన్నారు. చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఒక వైపు బాధగా ఉన్నప్పటికీ, ఆ సామాజికవర్గ పాలేరుతనం నుండి విముక్తి కలిగినందుకు సంతోషంగా ఉందని గుత్తుల పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు
రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఉప ఎన్నికల పోరులో బలహీనమైన అభ్యర్ధిని నిలపడం ద్వారా బోస్ ఎన్నిక సుగమం అయ్యేందుకు ఆ సామాజికవర్గీయులు ప్రణాళిక రచించారని గుత్తుల ఆరోపించారు. ఇటీవల జరిగిన మండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు నటిస్తూ, కోట్లాది రూపాయల పంపకం ద్వారా, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన బొడ్డు భాస్కర రామారావు ఎన్నిక అయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కృషి చేసారని, అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి టిడిపి నేత ఒకరు కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగిన సమయంలో దివంగత ఎన్‌టిఆర్ ఆశయాలకు, లక్ష్యాలకు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తిలోదకాలిచ్చిందని, పేద, బడుగు, బలహీన, హరిజన, గిరిజన, మైనార్టీ సామాజికవర్గాలకు ఎటువంటి ప్రయోజనం ఈ పార్టీ కల్పించలేదని గుత్తుల పేర్కొన్నారు. గుత్తుల శ్రీసూర్యనారాయణ బాబు అభిమానులు అధికసంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*్భవిష్యత్ కార్యాచరణపై 18న కార్యకర్తల సమావేశం *తెలుగుదేశం ఒక సామాజిక వర్గ పార్టీ:గుత్తుల ధ్వజం
english title:
f
Date:
Thursday, March 15, 2012