అన్నవరం, మార్చి 14: ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాలకు దీటుగా నేటికాలంలో నిర్మితమవుతున్న కట్టడాలను చూస్తే ఎంతో గర్వంగా ఉంటోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం అన్నవరంలో శ్రీసత్యదేవుని నూతన ఆలయ ప్రారంభం సందర్భంగా అన్నవరం విచ్చేసిన ఆయన పలు ప్రారంభోత్సవ, భూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ దిగువ సత్యదేవ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొండపై తారురోడ్ల నిర్మాణానికి రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రి తోట నరసింహం భూమిపూజ నిర్వహించారు. అలాగే సబ్ స్టేషన్ నిర్మాణానికి పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ భూమి పూజ నిర్వహించారు. అన్నవరం నూతన ఆలయ నిర్మాణం చాలా బాగుందని, పాత ఆలయాన్ని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మించడం పట్ల ఆలయ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇఒ కె రామచంద్రమోహన్, ఛైర్మన్ రాజా ఐవి రామ్‌కుమార్, ఛీప్ ఇంజనీర్ జగన్మోహనరావుతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జయేంద్రసరస్వతికి ఘన స్వాగతం...
రత్నగిరికి వచ్చిన కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామికి ఉదయం 9.20 గంటలకు ఆలయ అధికారులు అర్చకులు, పురోహితులు ఘనంగా స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం స్వామిజీ అతిధి గృహం నుంచి ప్రత్యేక వాహనంపై నూతన ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా నూతన ఆలయ విమానగోపురంపై వేంచేశారు. గోపురంపై 11.15 నిమిషాలకు బంగారు కలశాన్ని ప్రత్యేక పూజలు జరిపి ప్రదర్శించారు. అలాగే విమాన గోపురంపై కలశాలకు సప్తనదీ జలాలతో పూజలు నిర్వహించి బూరెలను వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శిఖరంపై వేశారు. అత్యంత వైభంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వీక్షించారు.
అదే విధంగా కలశ ప్రతిష్ట సమయంలో ఆలయ దిగువ అంతస్థులో గల యంత్రాలయంలో పంచాయతన విగ్రహాలైన వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, బాలాత్రిపురసుందరి, శివుడు విగ్రహాలను వైదిక సిబ్బంది ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ స్వామి వారికి పంచామృతాభిషేకాలు, మహా కుంభాషేకాలను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రధానాలయంలో వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమం దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య, పశుసంవర్ధక శాఖమంత్రి పినిపే విశ్వరూప్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం, స్థానిక ఎమ్మెల్యే పర్వత సత్యనారాయణమూర్తి, తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఇ నాని, శాసన మండలి సభ్యులు ఎన్ చినరాజప్ప, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, కాకినాడ ఆర్‌జెసి ఎన్ సోమశేఖర్ తదితర అధికారులు కలశ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కోలాటాలు, వేషధారణలు
సత్యదేవుని నూతన ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా యాగశాలల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనకాపల్లి నుండి వచ్చిన మహిళల కోలాట బృందం, వెంకటేశ్వరస్వామి వేషధారణలు చేపట్టిన పిల్లల కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
- దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య
english title:
s
Date:
Thursday, March 15, 2012