హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, ఐఎఎస్ అధికారి బి.ఆర్.మీనాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు ఎసిబి అధికారులను ఆదేశించింది. వీరిద్దరు ఎమ్మార్ విల్లాల విక్రయాలకు సంబంధించి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లిందని, ఇందుకు బాధ్యులైన ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని న్యాయవాది వల్లూరి సాయినాథ్‌రాజు ఎసిబి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఎసిబి కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మార్ నిర్మించిన విల్లాలను విక్రయించడంలో జాప్యం కారణంగా ప్రభుత్వానికి రిజిష్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం, ఎపిఐఐసికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడిందని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇంతేకాకుండా మాజీ చైర్మన్, ఎండిలు ఎమ్మార్ కంపెనీ ప్రతినిధుల నుంచి కోట్లాది రూపాయల విలువైన విల్లాలను డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని న్యాయవాది తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మార్-ఎంజిఎఫ్ చీఫ్ ఫైనాన్సియల్ మేనేజర్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ఇదే అంశాలు ఉన్నాయని, వాటినీ, తన వద్ద ఉన్న సమాచారాన్నీ ఎసిబి కోర్టుకి ఫిర్యాదుతో జత చేసి అందించారు. దీంతో ఈ పిటీషన్‌పై స్పందించిన కోర్టు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించాలని ఎసిబి అధికారులను ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఎమ్మార్ కుంభకోణంలో ఒక వైపు సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తుండగా, తాజాగా మాజీ చైర్మన్, ఎండిలపై వచ్చిన ఆరోపణలతో ఎపిఐఐసి వ్యవహారంపై ఎసిబి దృష్టిసారించడంతో ఎమ్మార్ విల్లాల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
- ఎమ్మార్ విల్లాల వ్యవహారం - ఎసిబి కోర్టు ఆదేశం న్యాయవాది పిటీషన్‌పై స్పందించిన న్యాయస్థానం
english title:
daryaptu
Date:
Thursday, March 15, 2012