పాడేరు, మార్చి 14: మావోయిస్టు అగ్ర నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ విశాఖ మన్యంలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిషా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో రామకృష్ణ గత రెండు రోజులుగా సంచరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. విశాఖ మన్యంలో రామకృష్ణ ఉన్నట్టు తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఆయనను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు బుధవారం నుంచి హెలికాప్టర్ల ద్వారా ఈ ప్రాంతంలో ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రెండో రోజు కూడా ఆయన ఆచూకీ కోసం గాలింపును చేపట్టారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నాయకుడైన రామకృష్ణను సజీవంగా, లేదా నిర్జీవంగానైనా పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం సర్వశక్తులూ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మానవ రహిత విమానాన్ని సైతం ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతాలలో ప్రయోగించి శాటిలైట్ చిత్రాలను సమీకరించినట్టు తెలిసింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా రామకృష్ణ ఉండే ప్రాంతాలను పోలీసు ఉన్నత అధికారులు గుర్తించి ఆయా ప్రాంతాలలో గాలింపునిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రం కొరాపుట్, మల్కనగిరి, చిత్రకొండ ప్రాంతాలలో కూడా గాలింపును ఉద్ధృతం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎఒబిలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పాడేరు కేంద్రంగా చేసుకుని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా మారుమూల గ్రామాలకు పోలీసు బలగాలను తరలించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో బుధవారం పాడేరు నుంచి ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల మారుమూల గ్రామాలకు హెలికాప్టర్ అనేక సార్లు సంచరించి పోలీసు బలగాలను తరలించింది. పాడేరు అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సైతం ఏరియల్ సర్వే నిర్వహించి పోలీసు బలగాలకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. విశాఖ మన్యంలో ఉన్న రామకృష్ణను ఏలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో పోలీసు యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విశాఖ మన్యంలోని పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మావోల ప్రబావిత ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న ఒడిషా గ్రామాలలో అణువణువునా జల్లెడపడుతుండడంతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణమే నెలకొంది. మావోయిస్టు అగ్రనేత కోసం పోలీసులు సాగిస్తున్న వేట ఏ పరిస్థితికి దారితీస్తుందోనని కుగ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుగ్రామాలకు బలగాల తరలింపు హెలికాప్టర్లతో విస్తృత గాలింపు
english title:
manyamlo rk
Date:
Thursday, March 15, 2012