
న్యూఢిల్లీ, జనవరి 21:భరత దేశం చేపట్టిన రోదసీ పరిశోధనలో మార్స్ మిషన్ ఓ సువర్ణ్ధ్యాయమని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఇస్రో తలపెట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్, ఇతర ప్రాజెక్టు డైరెక్టర్లతో సమావేశమైయ్యారు. జిఎస్‌ఎల్‌వి సహా ఇటీవల ఇస్రో సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన మన్మోహన్ ఈ ప్రాజెక్టుల్లో పాల్గొన్న అందరినీ అభినందించారు. రోదసీ పరిశోధనలో పాల్గొన్న శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లు సహా ప్రతిఒక్కరూ దేశానికి ఎంతో పేరుతెస్తున్నారని అన్నారు. అంతే కాకుండా రోదసీ టెక్నాలజీని జాతీయ అభివృద్ధిలో భాగంగా మార్చడంలో వీరి కృషి ఎంతో ఉందని తెలిపారు. అలాగే దేశ భద్రతావసరాలు తీర్చుకోవడానికీ రోదసీ పరిశోధనలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ‘మీ పరిశోథనలు అద్భుతం. జాతి నిర్మాణ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న మీ అందరినీ అభినందిస్తున్నాను’అని ప్రధాని అన్నారు. ముఖ్యంగా జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయోగ విజయాన్ని ప్రస్తావించారు. అత్యంత సంక్లిష్టమైన క్రయోజనిక్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించే దిశగా ఈ ప్రయోగ విజయం చారిత్రకమేనని అన్నారు.గత రెండు మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా రోదసీ పరిశోధన అవసరం భారత్‌కు మారిన పరిస్థితుల దృష్ట్యా మరింత పెరిగిందన్నారు.
........................
మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమైన ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, తన ఆధ్వర్యంలో విజయవంతమైన మార్స్ మిషన్ చిత్రపటాన్ని అందజేస్తున్న దృశ్యం.