
న్యూఢిల్లీ, జనవరి 21: పెరిగిపోతున్న జనాభాకు తగిన విధంగా నగరాలు అభివృద్ధి చెందలేకపోవడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేసారు. నగరాల్లో పేదరికం నిర్మూలన ఒక పెద్ద సమస్య అని, అయితే ఇది పరిష్కరించలేనిది మాత్రం కాదని ఆయన అన్నారు. మురికివాడలు లేని భారత దేశానికి దారితీసే చర్యలు చేపడతారన్న ఆశాభావం వ్యక్తం చేసారు. రాబోయే నలభై ఏళ్లలో దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా పట్టణ జనాభా పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారని, అయితే అందుకు అనుగుణంగా పట్టణాల్లో వౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. వ్యవస్థ లోపాలకు ప్రత్యక్ష నిదర్శనాలయిన మురికివాడలు, నిరుపేదలకు నివాసాలు లేకపోవడం విధానకర్తలకు పెద్ద సమస్యగా మారుతున్నాయన్నారు. మన దేశంలో 9.3 కోట్ల మంది మురికివాడ వాసులున్నారని, సుమారు కోటీ 80 లక్షల గృహాలకు కొరత ఉందని అంచనాలు చెబుతున్నాయని ఆయన అన్నారు. అయితే మన నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా పెద్దవి అయినప్పటికీ పరిష్కరించలేనివి మాత్రం కాదని ఆయన అన్నారు. గృహ నిర్మాణం, పట్టణ పేదరికం నిర్మూలన మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ పథకాల కింద వివిధ కేటగిరీల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రాలు, నగరాలకు అవార్డులు ప్రదానం చేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి ప్రసంగించారు. పట్టణాల్లో పేదరికాన్ని పూర్తిగా అంచనా వేయడానికి సంప్రదాయ ఆదాయలు, ఆహార వినియోగం కొలమానాలుగా సరిపోవని పేదరికాన్ని నిర్మూలించడానికి నివాస గృహాలు, వృత్తి, సామాజిక జీవనం అనే మూడు రంగాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ మిషన్, స్వర్ణ జయంతి శహర్ రోజ్‌గార్ యోజన, జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్, రాజీవ్ ఆవాస్ యోజన లాంటి పథకాల కింద జరిగిన కృషిని ఆయన ప్రశంసించారు. 2000 సంవత్సరం నుంచి 2010 మధ్య సుమారు 2 కోట్ల మందిని మురికివాడల నుంచి విముక్తం చేసినట్లు ఆయన చెప్పారు. దేశాన్ని మురికివాడలు లేని దేశంగా చేసే దిశగా మనం ముందుకు సాగేందుకు తోడ్పడే చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి గిరిజావ్యాస్ తన ప్రసంగంలో తమ శాఖ సాధించిన అభివృద్ధిని వివరించారు. జెఎన్‌ఎన్‌యుఆర్ పథకంలోని ఉప ప్రణాళికల కింద దేశవ్యాప్తంగా నగరాల్లోని నిరుపేదలకు 15 లక్షల పక్కా గృహాలు మంజూరు అయ్యాయని, సామాజిక గృహ నిర్మాణం, వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాథమికంగా 42 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేయడం జరిగిందని ఆమె చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాజీవ్ ఆవాస్ యోజనను అమలు చేయడానికి ప్రణాళికా సంఘం 32,300 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆమె చెప్పారు.
వివిధ పథకాల కింద అవార్డులు అందుకున్న నగరాల్లో పట్టణ పేదలకు వౌలిక సదుపాయాలు కల్పించడం, పట్టణ పేదలకు గృహనిర్మాణం కోసం వడ్డీ సబ్సిడీ పథకం కింద అవార్డులు అందుకున్న ఉత్తమ నగరాల్లో విశాఖపట్నం, అహ్మదాబాద్, దుర్గ్ ఉన్నాయి. వివిధ కేటగిరీల కింద అవార్డులు అందుకున్న నగరాల్లో తిరువనంతపురం, థానె, చండీగఢ్, అజ్మీర్ ఉన్నాయి.
......................................
పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్‌కు అవార్డును అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ