Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అత్తారింట్లో విషాదం

$
0
0

ఏలూరు/దెందులూరు, జనవరి 22: తెలుగు సినీ రంగానికి మూలస్తంభంలా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు మరణంతో జిల్లా తల్లడిల్లింది. అక్కినేని పశ్చిమ గోదావరి జిల్లా అల్లుడు. జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలోని దెందులూరు గ్రామానికి చెందిన కొర్లిపర వెంకటనారాయణ, భూషణమ్మ దంపతుల కుమార్తె అన్నపూర్ణమ్మను ఆయన వివాహమాడారు. 1949 ఫిబ్రవరి 18న వారి వివాహం జరిగింది. సినీరంగంలో కథానాయకునిగా వెలుగొందుతున్న ఆ రోజుల్లో కూడా అల్లుడి హోదాలో తరచూ ఆయన జిల్లాను సందర్శించేవారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలందరితో దెందులూరు వచ్చి, పండుగ మూడు రోజులూ ఆనందంగా గడిపేవారని గ్రామస్థులు తెలిపారు. అన్నపూర్ణమ్మకు రామకుటుంబరావు అనే సోదరుడు ఉండేవారు. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యప్రసాద్, నాగమణి దంపతులు ప్రస్తుతం దెందులూరులో ఉంటున్నారు. ఏ మాత్రం భేషజం లేకుండా అందరితో కలివిడిగా ఉండేవారని, నాగేశ్వరరావు శ్రేయోభిలాషి, స్వాతంత్ర సమరయోధుడు మల్లిపెద్ది రామకృష్ణ గుర్తుచేసుకున్నారు. బుధవారం ఉదయం అక్కినేని మృతిచెందారనే వార్త టివిల ద్వారా తెలుసుకున్న దెందులూరు గ్రామం చిన్నబోయింది. ఆయన బంధువులు సుబ్రహ్మణ్యప్రసాద్, నాగమణి దంపతులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. నాగేశ్వరరావు మరణం వ్యక్తిగతంగా తమను ఎంతో కుంగదీసిందని గ్రామానికి చెందిన కొడాలి ఆంజనేయులు, వీరమాచనేని శివాజీ, దేవినేని గంగాధరరావు తదితర సన్నిహితులు ఆవేదన వ్యక్తంచేశారు. అక్కినేని మరణవార్త తెలిసిన వెంటనే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంతాప సభలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

అంతర్వేది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
నరసాపురం, జనవరి 22: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఒ జె.వసంతరావు ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంతర్వేది ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఒ వసంతరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంతర్వేది ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఈ సంవత్సరం లాంచీల ప్రయాణం ఉండదన్నారు. మాధవయ్యపాలెం ఫంటు నుండి 100 నుండి 150 వరకు ప్రయాణీకులను సఖినేటిపల్లి రేవుకు చేరవేస్తారన్నారు. ఫంటుతో పాటు 6 బోటులకు అనుమతిచ్చామన్నారు. అనధికారిక బోటులు నడిపితే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. తాత్కాలిక వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, చలువ పందిళ్లు, మంచినీరు, తాత్కాలిక మరుగుదొడ్డు, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూదం, మద్యం వంటి అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 108, 104, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆర్డీఒ ఆదేశించారు. సమావేశంలో అంతర్వేది దేవస్థానం సహయ కమిషనర్ చిక్కాల వెంకట్రావు, ఆర్టీసి డిపో మేనేజర్ ఎస్.గిరధరకుమార్, తహసీల్దార్ దాసిరాజు, ఎంపిడిఒ ప్రసాద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాన్పు సమయంలో అనవసర ఆపరేషన్లు తగదు
ఏలూరు, జనవరి 22: జిల్లాలో కాన్పు సమయంలో 60 శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయని, కాన్పు సహజ సిద్ధంగా జరగాలే తప్ప అనవసర ఆపరేషన్లు నిర్వహించడం విచారకరమని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులు, సిడిపివోలు, ఆరోగ్య సిబ్బంది సమావేశంలో కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. అనవసర ఆపరేషన్లు చేయడం వల్ల మహిళలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో పాటు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారన్నారు. తొలి కాన్పు ఆపరేషన్ జరగడంతో మలి కాన్పు కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో కేవలం 28 శాతం మాత్రమే కాన్పు సమయంలో ఆపరేషన్లు జరుగుతుంటే జిల్లాలో 60 శాతం వరకూ ఆపరేషన్లు ఏమిటని కలెక్టర్ వైద్యాధికారులను ప్రశ్నించారు. అనవసర ఆపరేషన్ల నిరోధానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తీసుకువచ్చి వారికి అవసరమైన వైద్య సేవలను అందించాలన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే జీరో డోస్ వ్యాధి నిరోధక టీకాలను అందించాలన్నారు. బిడ్డ పుట్టిన మొదటి వారం, మొదటి నెలలో సరైన వైద్య సేవలు అందిస్తే ఆ బిడ్డ జీవనం సాఫీగా సాగిపోతుందన్నారు. ఈ విషయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిడిపివోల పర్యవేక్షణ కూడా ఎంతో అవసరమన్నారు. తక్కువ బరువు గల పిల్లలు పుడితే సమీప ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ పిల్లల సంరక్షణ కోసం ఏలూరులో స్పెషల్ కేర్ న్యూ బోర్న్ యూనిట్లను, న్యూట్రీషనల్ రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రసవం తర్వాత తల్లి పిల్లలను వారి గృహాలకు ప్రత్యేక వాహనం ద్వారా పంపించే సౌకర్యం కూడా కల్పించామన్నారు. ఏటా నాలుగు కోట్ల రూపాయలు 108 వాహనాలకు అందిస్తున్నామని వీటిని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అలవాటుపడేలా వైద్యాధికారులు అవగాహన కలిగించాలన్నారు. ఆడపిల్లలకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న బంగారుతల్లి కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయడంలో వైద్యాధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌వో డాక్టర్ టి శకుంతల, ఐసిడిఎస్ పిడి వసంతబాల తదితరులు పాల్గొన్నారు.
అంకెల గారడీదార్ల ఆట కట్టిస్తా
ఏలూరు, జనవరి 22 : జిల్లాలో అంకెల గారడీ చేసి దొంగ లెక్కలు చూపించే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుండి తప్పిస్తానని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ హెచ్చరించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి తీరుపై బుధవారం ఆయన సమీక్షిస్తూ చింతలపూడి సిడిపివో, లింగపాలెం, దెందులూరు తదితర ప్రాంతాలలో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నత్తనడకన సాగడం పట్ల ఆయా ప్రాంత సిబ్బందిపై మండిపడ్డారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సమర్పించే నివేదికల్లో దొంగలెక్కలు ఉంటే సహించబోనని, థర్డ్ పార్టీ విచారణ జరిపిస్తానని, అంకెల గారడీ కనిపిస్తే సంబంధిత సిబ్బంది, అధికారులు ఉద్యోగాలు వదులుకుని వెళ్లేలా చేస్తానని హెచ్చరించారు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు ఎక్కడైనా నివేదికలో చూపిస్తే అటువంటి వారిని క్షమించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలవద్దకే వెళ్లి వైద్య సేవలను అందించాలని, అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెరుగుతుందని, ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించబోరని చెప్పారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు జీతాలు చెల్లిస్తోందని, ఇటువంటి స్థితిలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందించకపోతే వైద్య సిబ్బంది అవసరం లేదనే భావన కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. డాక్టర్లు కేవలం ఔట్ పేషెంట్లను చూసి హడావిడిగా తిరిగి ఇళ్లకు వెళ్లిపోతే సరిపోదని, నిర్ధేశించిన ప్రాంతంలో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అలా చేయని వారిని వెనక్కి పంపిస్తానని ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు. తాను త్వరలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పిహెచ్‌సిలు, ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఆ సందర్బంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సహించబోనని కలెక్టర్ హెచ్చరించారు. చింతలపూడి ప్రాంతంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని, పౌష్టికాహార కార్యక్రమం అమలులో నిర్లక్ష్యంతో వ్యవహరించిన సిడిపివో హేమలతను కలెక్టర్ హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌వో డాక్టర్ టి శకుంతల, స్ర్తి శిశు సంక్షేమ శాఖ పిడి వసంతబాల తదితరులు పాల్గొన్నారు.

గూడెంలో మరిన్ని రైళ్లకు హాల్టు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 22: ప్రజలు, రైల్వే ప్రయాణీకుల కోరిక మేరకు తాడేపల్లిగూడెంలో మరిన్ని రైళ్ళకు హాల్ట్ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపి కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైల్వే స్టేషన్‌లో సంత్రాకచ్చి ఎసి రైలుకు హాల్ట్ ఇచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటికే కోరమాండల్, గరీభ్థ్‌ల్రకు గూడెంలో హాల్ట్ ఇప్పించామన్నారు. త్వరలో యశ్వంత్‌పూర్, అమరావతిలకు హాల్ట్ ఇప్పిస్తామన్నారు. శివాలయం వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. టూటౌన్‌లో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై డిఆర్‌ఎం ప్రదీప్‌కమార్ మాట్లాడుతూ టూటౌన్‌లో టిక్కెట్ కౌంటర్ ఏర్పాటుకు రైల్వేకు స్థలం లేదని, స్థలం బదలాయిస్తే పరిశీలిస్తామన్నారు. అదే విధంగా శివాలయం వద్ద అండర్ పాస్ నిర్మాణానికి, సర్వే ప్రారంభానికి అంచనాలలో 2 శాతం మున్సిపాల్టీ భరించవలసి ఉంటుందన్నారు. అయితే మున్సిపాల్టీ నిధులు లేవని లేఖ రాసిందని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఈలి నాని మాట్లాడుతూ రైల్వే శాఖ మున్సిపాల్టీకి సర్వే కోసం 2 శాతం నిధులు అడిగిన విషయం ఎంపి, ఎమ్మెల్యేలకు మున్సిపల్ అధికారులు తెలపకపోవడం దారుణం అన్నారు. అనంతరం సంత్రాకచ్చి మద్రాసు రైలుకు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, తహసీల్దార్ రామాంజనేయులు, మేనేజర్ భూషణం, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కరణం అప్పారావు, ఈతకోట తాతాజీ, చాంబర్ సభ్యుడు తంగెళ్ల పేర్రాజు, నంద్యాల కృష్ణమూర్తి, కొవ్వూరు డిఎస్పీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
డివైడర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 22: ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో డివైడర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇటీవల భీమవరంలో ఒకరోజుబస చేసిన జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ భీమవరం ఆరంభంలోని ఉండి గేటు నుండి రహదారి మధ్యలో డివైడర్లు లేకపోవడాన్ని గుర్తించారు. మరికొన్ని చోట్ల ఉన్న డివైడర్లు రోడ్డుకి సమాంతరంగా వచ్చేశాయి. దీంతో వెంటనే డివైడర్లు ఎత్తు పెంచి లేనిచోట్ల కొత్తగా డివైడర్లను ఏర్పాటుచేయాలని జాతీయ రహదారుల శాఖ అధికార్లకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆ శాఖ అధికారులు హుటాహుటిన స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఉండి రైల్వేగేటు వరకు నూతనంగా డివైడర్లు నిర్మించేందుకు రూ.6.7 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పదోతరగతి విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో
ఉపాధ్యాయుడు సస్పెన్షన్, అరెస్టు
బుట్టాయగూడెం, జనవరి 22: మండలంలోని నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి తెగబడ్డ పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు కుంజా సోమరాజును విధుల నుండి సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.సావిత్రి తెలిపారు. అదే క్రమంలో విద్యార్థినిపై జరిగిన అకృత్యాన్ని ఉన్నతాధికారులకు నివేదించడంలో విఫలమైన పాఠశాల ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డిడి పేర్కొన్నారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పిఇటి కుంజా సోమరాజును అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీరామకృష్ణ తెలిపారు. నిందితుణ్ణి కొవ్వాడలో బుధవారం సాయంత్రం ఐదుగంటలకు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుణ్ణి గురువారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరచనున్నట్టు సిఐ తెలిపారు.
ఆర్డీవో, డిఎస్పీ విచారణ
మండలంలోని నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై వ్యాయామోపాధ్యాయుడు కుంజా సోమరాజు అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో నాన్‌రాజు, డిఎస్పీ సుబ్బరాజు బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులను, సిబ్బందిని, విద్యార్థుల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో నాన్‌రాజు సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డిఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ విచారణ పూర్తయిన అనంతరం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తరలిస్తామన్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సంఘటనకు బాధ్యలైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదన్నారు. ఇదిలా ఉండగా సంఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కారం భాస్కర్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం కామకృష్ణ, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి సరియం రామ్మోహన్ తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
పంట కాలువలోకి రైలు బోగీ
నరసాపురం, జనవరి 22: తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగి పంటకాలువలోకి దూసుకుపోయింది. బుధవారం ఉదయం రైలు షంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నరసాపురం రైల్వేస్టేషన్‌లో నిర్వహణ చేస్తారు. మెయిన్ లైన్‌లో ఉన్న ఈ రైళ్ళను నిర్వహణ కోసం ఫిట్ లైన్‌లోకి తీసుకువస్తారు. ఇటీవల నరసాపురం వచ్చిన స్పెషల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలను తిరుపతి రైలుకి జతచేసి మెయిన్ లైన్ నుంచి ఫిట్ లైన్‌లోకి తీసుకువచ్చే క్రమంలో పక్కనే ఉన్న పంటకాలువలోకి ఎక్స్‌ప్రెస్ వెనుక ఉన్న బోగి దూసుకుపోయింది. అప్రమత్తమైన ఇంజన్ డ్రైవర్ రైలును నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బోగి రెండు చక్రాలు పూర్తిగా ఊడిపోయి కాలువలో పడ్డాయి. షంటింగ్ సమయంలో రైలు వెనుక భాగంలో ఉండాల్సిన రైలు సిబ్బంది అక్కడ లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాద సమాచారాన్ని విజయవాడలోని రైల్వే ఉన్నతాధికారులకు స్థానిక రైల్వే అధికారులు అందించారు. దీంతో విజయవాడ, భీమవరం, రాజమండ్రి నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ ఇంజనీరింగ్ సిబ్బంది నరసాపురం స్టేషన్‌కు హుటహుటిన చేరుకున్నారు. పంటకాలువలోకి పడిపోయిన బోగీని రైలు నుండి వేరుచేశారు. జాకీలు, బంపర్ల సహాయంతో పడిపోయిన బోగీని పట్టాల పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం రాత్రి వరకు పట్టాలపై రైలును తీసుకువచ్చే కార్యక్రమం సాగింది. సాయంత్రం షెడ్యూల్ సమయానికే తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడ నుంచి పంపించారు. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మాత్రం షెడ్యూల్ సమయం కన్నా ఒక గంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు పంపారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

ఫిబ్రవరి 17న పొగాకు వేలం ప్రారంభం
దేవరపల్లి, జనవరి 22: రాష్ట్రంలో పొగాకు వేలం వచ్చే నెల 17న ప్రారంభమవుతుందని పొగాకు బోర్డు చైర్మన్ కె గోపాలన్ తమకు ఆదేశాలు పంపారని దేవరపల్లి పొగాకు వేలం నిర్వహణాధికారి ఎన్ సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 17న ఎస్‌ఎల్‌ఎస్ ఏరియాలో గల వేలం కేంద్రాల్లో, రెండో దశలో మార్చి మూడున ఎన్‌ఎల్‌ఎస్ వేలం కేంద్రాలైన దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1 కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుందన్నారు. 2013-14 సంవత్సరానికి రాష్ట్రంలో 172 మిలియన్ కిలోల ఎఫ్‌సివి పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా రైతులకు అనుమతించినట్టు ఆయన చెప్పారు.

తెలుగు సినీ రంగానికి మూలస్తంభంలా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు మరణంతో జిల్లా తల్లడిల్లింది. అక్కినేని పశ్చిమ గోదావరి జిల్లా అల్లుడు.
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>