Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ కార్యదర్శి అభ్యర్థులకు ఉచిత శిక్షణ

$
0
0

నెల్లూరు రూరల్, జనవరి 22 : పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు ఇస్తామని ఎపి బిసి స్టడీసర్కిల్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోసం బీసి , ఎస్సీ, ఎస్టీ తెగలవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నామని వారి విద్యార్హతలను బట్టి ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణాతరగతులు నిర్వహిస్తామని ఎంపికకు 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల, ఆదాయ, డిగ్రి, నివాస సర్ట్ఫికెట్లను, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ నమూనా నకళ్లను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకోసం భక్తవత్సల నగర్‌లో ఉన్న వెనుకబడిన తరగతులు ఎపి స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు.

................
స్కాలర్‌షిప్‌కు ఆధార్ లింక్ పెట్టవద్దు

తోటపల్లి గూడూరు, జనవరి 22: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌కార్డును లింక్‌పెడుతున్నారని ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శి పి రాము విమర్శించారు. మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్ దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్, మీసేవ సర్ట్ఫికెట్లు అడగడంతో అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారని అన్నారు. అధికారులు ఆలోచించి ఈ నిబంధనలు తొలగించాలని అన్నారు. తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో డివిజన్ ఉపాధ్యక్షులు ఆర్ దినేష్, దయాకర్ స్టాలిన్ , శివమణి తదితరులు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్లను మీసేవకు అప్పగించవద్దు
కొనసాగుతున్న దస్తావేజులేఖరుల ఆందోళన
నెల్లూరు రూరల్, జనవరి 22 : రిజిస్ట్రేషన్లను కార్యాలయంలో కాకుండా మీసేవకు బదలాయిస్తామని వస్తున్న వార్తలను ఖండిస్తూ దస్తావేజ లేఖర్లు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజులేఖరుల సంఘం అధ్యక్షులు దుర్గేష్‌బాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నమ్ముకుని అనేకమంది పేదవారు జీవనం సాగిస్తున్నారన్నారు. వారి కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం మీసేవకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను బదలాయించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసిలు కూడా మీ సేవకు ఇవ్వడం ద్వారా ప్రజలూ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం యధా స్థితిలో రిజిస్ట్రేషన్లు కార్యాలయంలో నే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘానికి సంబంధించిన పలువురు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
అనూష హత్యకేసులో నిందితులను ఉరిశిక్ష వేయాలి
బిజెపి మహిళామోర్చా ధర్నా
నెల్లూరు రూరల్ , జనవరి 22 : మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూషను ముంబాయిలో అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులకు నడిరోడ్డులో ఉరిశిక్ష వేయాలని బిజెపి నగర మహిళామోర్చా అధ్యక్షురాలు అన్నాబత్తుల శాంతమ్మ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ యూపిఎ ప్రభుత్వంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యుపిఎ హయాంలో ఇంటినుంచి బయటికి వెళ్లిన మహిళ తిరిగి సురక్షితంగా ఇంటికి వస్తామని నమ్మకంలేకుండా పోయిందన్నారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళ చిత్రహింసకు గురవుతూనే ఉందన్నారు. ఇంతజరుగుతున్నా అధికార పార్టీ నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళలు యుపిఏ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అలీమా, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

చర్చికి అబ్దుల్ ట్రస్టు విరాళం
నెల్లూరు అర్బన్, జనవరి 22: నగరంలో హజీ అబ్దుల్ అజీజ్ ట్రస్టు ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రస్టు వ్యవస్థాపకుడు అబ్దుల్ అజీజ్ బుధవారం నగరంలో రవిచంద్ర గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ని స్థానికులు చర్చిలో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా చర్చి అభివృద్ధికి 50 వేలరూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈసమావేశంలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు బి బాలచెన్నయ్య, చిట్టిబాబు, సురేష్‌కుమార్ తదతరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు
రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి
* లేకుంటే రాజేష్ ట్రావెల్స్ బస్సులను తిరగనివ్వం
* టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి హెచ్చరిక
నెల్లూరు, జనవరి 22: రాజేష్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల నెల్లూరుకు చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారని, వెంటనే మృతుల కుటుంబాలకు ట్రావెల్స్ యజమాన్యం రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి పూర్తి చికిత్స చేయించడంతోపాటు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని లేనిపక్షంలో రాజేష్ ట్రావెల్స్ బస్సులను తిరగనివ్వబోమని టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. రాజేష్ ట్రావెల్స్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మద్రాసుబస్టాండ్ వద్ద ఉన్న రాజేష్ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వకుండా ఆటోను తోలే వార్ని బస్సులకు డ్రైవర్‌గా ఎక్కించారన్నారు. బెంగుళూరులో ఆరులైన్ల రోడ్డులో రెండుసార్లు డివైడర్‌ను ఢీకొన్నాడంటే ఏ విధంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడో అర్థమవుతుందన్నారు. గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి చేర్చాల్సిన బాధ్యత ట్రావెల్ వారికి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మృతదేహాలను కూడా ప్రత్యేక వాహనంలో నెల్లూరుకు చేర్చలేదన్నారు. వెంటనే ట్రావెల్ సంస్థ మృతులకు 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం కూడా 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ట్రావెల్స్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రవాణాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెల్లూరునగర, రూరల్ ఎమ్మెల్యేలు అయితే ప్రజలను బ్రతికించేందుకు చూడటం లేదని విమర్శించారు. ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల నుంచి రోజుకు లక్ష రూపాయలు తీసుకునే నెల్లూరు ఆర్‌టివో రాంప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం లోపల బాధితులకు ట్రావెల్స్ యాజమాన్యం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని, లేనిపక్షంలో ఆ కార్యాలయానికి శాశ్వత తాళాలు వేసి, బస్సులను తిరగనీయబోమని హెచ్చరించారు. ప్రైవేట్ బస్సులన్నిటిపై టిడిపి ఆధ్వర్యంలో నిఘా పెట్టి ప్రజల ప్రక్షాన నిలబడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, నాయకులు ధర్మవరపు సుబ్బారావు, వైవి సుబ్బారావు,మండవ రామయ్య, ఎస్‌కె మున్వర్‌బాషా, పడవల కృష్ణమూర్తి, సతీష్‌యాదవ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

దొంగతనాలు, ప్రమాదాల నివారణకు
పటిష్ఠమైన చర్యలు
* డయల్ 100ను ఉపయోగించుకోండి
* రైల్వే ఎస్పీ జనార్దన్
నెల్లూరు, జనవరి 22: రైళ్లల్లో జరిగే దొంగతనాలు, ప్రమాదాలు నివారించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్లు గుంతకల్ రైల్వే ఎస్‌పి ఎస్‌జె జనార్దన్ తెలిపారు. బుధవారం నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్ల పరిధిల్లో జరుగుతున్న నేరాలపై సమీక్షించేందుకు వచ్చిన ఎస్‌పి విలేఖర్లతో మాట్లాడుతూ రైళ్లల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే తక్షణం డయల్ 100తోపాటు ట్రోల్ ఫ్రీ నెంబర్ 9701373737కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అడిషనల్ డిజి భూపతిబాబు ఆదేశాల మేరకు గుంతకల్, అనంతపురం, కర్నూల్, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, తిరుపతి అర్బన్ జిల్లాల్లో నిఘా ముమ్మరం చేస్తామన్నారు. రైల్వేస్టేషన్లల్లోని ప్లాట్ ఫారాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు. ఇటీవల రైల్వే దొంగలు, అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రైలుల్లో ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి, రేణిగుంట, గూడూరు జంక్షన్‌లలో ఎక్స్‌ప్రెస్, పాసెంజర్ రైళ్లు ఎక్కువ సమయంలో అగుతాయని, ఆ సమయంలో జిఆర్‌పి, ఎలక్ట్రికల్ వారి సిబ్బందితో ఏసి కోచ్‌లను పరిశీలిస్తామన్నారు. ఏమైనా షార్ట్‌సర్క్యూట్ లోపాలు ఉంటే అక్కడికక్కడే సరిచేస్తామన్నారు. అలాగే 900 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, ఇంకా 200 మంది సిబ్బంది అవసరమని, సిబ్బందిని నియమించేందుకు నెల్లూరు ఎస్‌పి రామకృష్ణను కలవడం జరుగుతుందన్నారు. రైళ్లలో హిజ్రాల అల్లర్లు, దాడులు ఎక్కువయ్యాయని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానం ఇస్తూ ఇప్పటికే హిజ్రాలపై కేసులు నమోదు చేస్తున్నామని, ఎక్కడైనా దాడులకు పాల్పడితే తక్షణం రైల్వే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. తద్వారా ఆ హిజ్రాలను అదుపులోకి తీసుకొని వారిపై నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదుచేస్తామన్నారు. వేదాయపాళెం, వెంకటాచలం మధ్యలో ఎక్కువగా గుర్తుతెలియని మృతదేహాలు పడుతున్నాయని, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత రైలులలో నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో కూడా ప్రత్యేక టీంను నియమించి అధ్యయనం చేస్తున్నామన్నారు. 120 స్పీడ్‌లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళుతుంటాయని, ప్రయాణికులు తలుపుల వద్ద నిర్లక్ష్యంగా కూడా నిలబడి ఉంటున్నారని, అటువంటి వ్యక్తులను గమనించి ఆ విధంగా నిలబడి ఉంచకుండా లోనికి పంపించి తలుపు వేసేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. నెల్లూరులోని తమిళనాడు ఎక్స్‌ప్రెస్, పుట్టపర్తిలో జరిగిన ఎక్స్‌ప్రెస్‌లలో జరిగిన ఘోర ప్రమాదాలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఎక్కడైనా ప్రమాదం అనిపిస్తే తక్షణం డయల్ 100కు ఫోన్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి వెంట రైల్వే డిఎస్పీ ఆర్‌పి రాజేంద్రకుమార్, సిఐ విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

‘బ్యాంకర్లు రుణలక్ష్యాన్ని పూర్తిచేయాలి’
తోటపల్లి గూడూరు, జనవరి 22 : 2013- 14 సమీకృత కార్యాచరణ ప్రణాళిక రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని ఎంపిడిఓ సావిత్రమ్మ బ్యాకర్లకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకర్లు కేటాయించిన యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి ఓ, ఎబి ఐ , ఎస్‌బి హెచ్, పినాకిని గ్రామీణ బ్యాంక్ శాఖాధికారులు , కార్యదర్శులు పాల్గొన్నారు.

వెండితెర వేలుపు అక్కినేని
ఎఎన్నార్‌కు అభిమానుల ఘన నివాళి
నెల్లూరు కల్చరల్, జనవరి 22:వెండి తెరపై తన నటనతో దశాబ్ధాలపాటు తెలుగువారిని అలరించిన దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు మృతిపట్ల ఆయన అభిమానులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని అక్కినేని అభిమానులు, వివిధ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో వివిధ కూడళ్లలో షామ్యానాలు వేసి అక్కినేని చిత్రపటాలను ఏర్పాటుచేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల గానం చేసిన భగవద్గీతను వినిపిస్తూ నాగేశ్వరరావు చిత్ర రంగానికి చేసిన సేవలను, వివిధ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలను, ఆయన అద్భుత నటనను 90 సంవత్సరాల వయస్సులో ఆయన చలాకీతనాన్ని, క్యాన్సర్ అని తెలిసినా ప్రేక్షకుల అభిమానం ఉంటే సెంచరీ చేస్తానంటూ ఇటీవల ఆయన అన్న మాటలను తలచుకుంటూ ఆయన అభిమానులు కంట తడిపెట్టుకోవడం కనిపించింది. నగరంలో ఎక్కడ చూసినా నాగేశ్వరరావు మృతిని గురించి మాట్లాడుకోవడమే కనిపించింది. .
కళాసంఘాల ఆధ్వర్యంలో
నగరంలోని 25 కళాసంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక టౌన్‌హాలులో బుధవారం రాత్రి రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, 25 కళాసంఘాల అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అక్కినేని సంస్మరణ సభను నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ 75సంవత్సరాలపాటు సినీ రంగంలో రాణించిన అక్కినేని మృతికి కళారంగానికి తీరని లోటన్నారు. ఆయన లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. తెలుగు సినిమాకు మూలస్థంభంమైన నాగేశ్వరరావు తన జీవితాన్ని కళకే అంకితం చేశారన్నారు. ఒక నటుడు 75 సంవత్సరాలపాటు నటించడం సాధారణ విషయం కాదని అది నాగేశ్వరరావుకే చెల్లిందన్నారు. ఈసందర్భంగా నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో ఆచార్య ఆదిత్య, బండి శ్రీనివాసులురెడ్డి, అందే శ్రీనివాసులు, గాలి కిరణ్‌కుమార్, డేగా రామచంద్రారెడ్డి, వాస్తురామచంద్రరావు,పొన్నాల రామసుబ్బారెడ్డి, టివి సుబ్బారావు, ముత్తుతోపాటు వివిధ కళాసంఘాల నాయకులు, అక్కినేని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కినేని నాగేశ్వరావు నటించిన పలు చిత్రాల్లోని పాటలను గాయకులు ఆర్టీసి క్రిష్ణయ్య, రవితేజ, స్టాలిన్, దుర్గం మధుసూదన్ గానం చేశారు.
అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో
స్థానిక నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు తాళ్లపాక రమేష్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన సంస్మరణ సభలోనాగేశ్వరరావు అభిమానులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు నివాళులర్పించారు. అక్కినేని నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షులు ఎం మధు, సిహెచ్ బాబూరావు, ఎ రమేష్ తోపాటు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున అభిమానులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

సామ్రాట్ క్లినిక్‌లో
స్థానిక శోధన నగర్‌లోని సామ్రాట్ క్లినిక్‌లో డాక్టర్ మారం సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్కినేని సంస్మరణ సభలో పలువురు అభిమానులు పాల్గొని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ అక్కినేని మృతి తెలుగువారందరికీ ఆవేదన కలిగించిందన్నారు. పాత తరం నటుడైనా నేటి తరం నటులకు పోటీగా ప్రేక్షకులను అలరించడం ఒక్క నాగేశ్వరరావుకే చెల్లిందన్నారు. ఈకార్యక్రమంలో దగ్గుపాటి రాధాకృష్ణ, కమల్‌బాబు, నాయబ్, కృష్ణయ్య, కె రాఘవరెడ్డి, వీరారెడ్డి, పూర్ణప్రకాష్, సీతారామయ్య, గాయకులు ఆనంద్, దుర్గం మధుసూధన్‌రావు, మారం మాధవ్, వెంకటేశ్వర్లు, ఆర్వీ శేఖర్, సల్మా, వౌలాలి, రమణి, తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో..

నెల్లూరు అర్బన్: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు వైఎస్‌ఆర్‌సిపి నేత అనిల్ కుమార్ నివాళి అర్పించారు. స్థానిక నర్తకి సెంటర్ అక్కినేని చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ మాట్లాడుతూ అక్కినేని మరణం తెలుగుచిత్రరంగానికి తీరని లోటన్నారు. ఎన్టీఆర్, ఎఎన్నార్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లులాంటివారన్నారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ మన రాష్ట్రానికి రావడానికి వీరిద్దరూ ఎంతో కృషి చేశారన్నారు. తొలుత ఎఎన్నార్ అన్నపూర్ణ సినీ స్టూడియో నిర్మించారన్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఎన్ మధు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ముప్పసాని శ్రీనివాసులు, పెళ్లూరు శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు.

సింహపురి సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలలో.
నెల్లూరుసిటీ: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి సందర్భంగా దర్గామిట్ట సుజాతమ్మ కాలని, సాహితీ ఎన్‌క్లేవ్ అపార్టుమెంటు ప్రాంగణంలో సింహపురి సాహితీ సమాఖ్య గణపం రాజగోపాలరెడ్డి అధ్యక్షతన సంతాపసభను బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నటన కౌశల్యాన్ని గురించి వారి వ్యక్తిగత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి గుర్రాల రమణయ్య, సిరిమామిళ్ల కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రావూరి శారద, పి చెంచయ్య, సర్వేపల్లి ప్రభాకర్, అమరా బాలగంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

24నుంచి కోర్టు విధులకు హాజరుకానున్న న్యాయవాదులు
నెల్లూరు లీగర్, జనవరి 22: ఈనెల 24నుంచి కోర్టు విధులకు యధావిధిగా హాజరుకావాలని నెల్లూరు న్యాయవాదులు నిర్ణయించారు. బుధవారం నెల్లూరు బార్ అసోసియేషన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అత్యధిక సభ్యులు ఆమోదించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి జి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఉద్యమాన్ని భవిష్యత్‌లో మరోరూపంలో చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా గత ఏడాది జూలై 12నుంచి నెల్లూరు న్యాయవాదులు నిరవధికంగా కోర్టు విధులను బహిష్కరించిన విషయం పాఠకులకు విదితమే. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు న్యాయవాదులు ప్రారంభించిన కోర్టు విధుల బహిష్కరణ గత ఐదునెలలుగా కొనసాగుతోంది. వీరు విధుల బహిష్కరణతో పలువురు జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు బార్ అసోసియేషన్ సమ్మె విరమించాలని తీసుకున్న నిర్ణయంతోవారు ఊపిరి పీల్చుకున్నారు.

పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>