డోన్, జనవరి 22 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభను కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని క్రీడాభివృద్ధి అధికారి వి నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఒనైరో స్కూలులో 32వ ఎపి రాష్టస్థ్రాయి అండర్- 19 బాలికల రాష్టస్థ్రాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ముందుగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నుంచి పురవీదుల గుండా క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ఒనైరో స్కూలులో పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆటలను ప్రారంభించారు. స్కూలు ఈసందర్భంగా నాగరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యాన్ని పెంచుతాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా జరిగే క్రీడల్లో హ్యండ్‌బాల్ రెండోస్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాయ్ కోచ్ ఇన్‌చార్జి చెన్నారెడ్డి, పట్టణ ఎస్సై మోహనరెడ్డి, ఒనైరో స్కూలు ప్రిన్సిపాల్ కాజోల్ చటర్జీ, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు విజయ్‌కుమార్, జిల్లా హ్యండ్ బాల్ సంఘ కార్యదర్శి సి రామాంజనేయులు పాల్గొన్నారు.
హ్యండ్‌పోటీలో కర్నూలు జట్టు శుభారంభం
జూనియర్ బాలికల హ్యండ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో కర్నూలు జట్టు శుభారంభం పలికింది. ఎంతో ఉత్సాహభరింతంగా సాగిన ఆటల్లో హైదరాబాద్ జట్టు కడప జట్టుపై 9-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అదే విధంగా కర్నూలు జట్టు తూర్పు గోదావరి జట్టుపై 15- 7 గోల్స్ తేడాతో గెలిచి శుభారంభాన్ని పలికింది. శ్రీకాకుళం జట్టు ప్రకాశం జట్టుపై 12-2 గోల్స్ తేడాతో, వరంగల్ జట్టు, అదిలాబాద్ జట్టుపై 6-3 గోల్స్, కర్నూలు జట్టు, అనంతపురం జట్టుపై 9-0 గోల్స్, కడప జట్టు రంగారెడ్డి జిల్లా జట్టుపై 14-8 గోల్స్ తేడాతో విజయం సాధించాయి. ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 16 జట్లు పాల్గొన్నాయని సంఘ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు.
పదిలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు స్పోర్ట్స్, జనవరి 22 : జిల్లాలో మార్చి నెలలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు సాధించడంలో 100 శాతం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలపై కర్నూలు, డోన్ డివిజన్ల ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 64 రోజులు మాత్రమే ఉన్నాయని ఈ కీలక సమయాన్ని విద్యార్థులు వృథా చేయకుండా ఫలితాలు సాధనే లక్ష్యంగా శ్రద్ధ చూపాలన్నారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలన్నారు. 35 మార్కుల కన్నా తక్కువగా ఉన్న వారిపై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులను ప్రతిరోజు ప్రేరణ చేయాలని తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి సత్ఫలితాలు సాధిస్తారన్నారు. జిల్లాలో గత ఏడాది 91 శాతం ఉత్తీర్ణ నమోదైందని ఈసారి దాన్ని అధిగమించి రాష్ట్రంలో 100 శాతం ఫలితాలు సాధించిన జిల్లాగా రికార్డు సృష్టించాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన పౌష్ఠికాహారం అల్పహార రూపంలో ఇవ్వాలని, వారికి స్టడీ మెటిరియల్, ప్రత్యేక శిక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ అవసరమైన చోట్ల విద్యార్థులకు కావాల్సిన వసతులను కల్పిస్తున్నామని, అలాగే వారిని ప్రేరణ కల్పించేందుకు నిపుణల చేత అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఓర్వకల్లు, కోవెలకుంట్ల, డోన్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలలను దత్తతకు పలు శాఖల అధికారులు తీసుకోని పర్యవేక్షిస్తున్నారన్నారు. మిశ్రమ ఫలితాలను సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే వుందని డిఇవో తెలిపారు. ఈ సమావేశంలో కర్నూలు, డోన్ డివిజన్ల ఉప విద్యాధికారులు శైలజ, జయరాం, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
అక్కినేనికి నివాళి
* నగరంలో నేడు సినిమా థియేటర్ల బంద్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22: తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే పేరు ప్రఖ్యాతలను తెచ్చిన తెలుగు సినీ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు మృతికి నివాళులర్పించారు. బుధవారం స్థానిక రాజవిహార్ సెంటర్‌లో వైకాపా నేత ఎస్వీ మోహన్‌రెడ్డి, నగరంలోని ప్రధాన రహదారుల్లో అక్కినేని అభిమానులు బారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి అక్కినేని అమర్‌హై అంటు నినాదాలు చేసి నివాళులర్పించారు. అలాగే తోడుగా నగరంలోని సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్లు యాజమానుల సంఘం ప్రకటించింది. అక్కినేని మృతి పట్ల నగరంలోని ప్రజలు, అభిమానులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయం తనిఖీ
కర్నూలు, జనవరి 22 : జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన భవనాన్ని రాయలసీమ ఐజి రాజీవ్ రతన్ బుధవారం తనిఖీ చేశారు. వార్షీక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డిఐజి మురళీకృష్ణతోపాటు ఎస్పీ రఘురామిరెడ్డి ఇతన పోలీసు అధికారులతో కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, ఎఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీ రుషికేశ్వరరెడ్డి, కర్నూలు డీఎస్పీ వైవి రమణకుమార్, ఆర్‌ఐ రెడ్డప్పరెడ్డి, రంగముని, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి ఎస్‌ఎ సలాం పాల్గొన్నారు.
ఘనంగా గ్రామ దేవతల ఉత్సవాలు
పెద్దకడబూరు, జనవరి 22:మండల పరిధిలోని చిన్నకడబూరు, లేకల్లు గ్రామాల్లో వెలసిన అంకాలమ్మ, బంగారమ్మ దేవతల ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయాగ్రామాలు చల్లగా ఉండాలని, పాడి పంటలతో ఆనందగా ఉండాలని గ్రామస్థులు పూజలు చేశారు. ఉదయం దేవతల విగ్రహాలను అలంకరణ చేసి ఆకుపూజ, కుంకుమార్చన పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు దేవతలకు కుంబాలతో ఊరేగి పూజలు చేశారు. గ్రామ దేవత ఉత్సవాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా సిఐ ఓబులేసు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జగన్‌మోహన్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా నాయకులుప్రదీప్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, తిక్కన్న, ముక్కరన్న, ఆయాగ్రామాలకు వెళ్ళి దేవతలకు పూజలు చేశారు.
26న రాఘవులు రాక
కోడుమూరు, జనవరి 22 : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈనెల 26న కోడుమూరుకు వస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్రక్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడుమూరులో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించేందుకు రాఘవులు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సోమన్న, శేషయ్య, గఫార్‌మియ్యా, రాజు, నాగిరెడ్డి, వీరన్న కృష్ణ , నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల అభివృద్ధిలో
వార్డు మెంబర్లే కీలకం
* ఆర్డీవో నరసింహులు
నంద్యాల రూరల్, జనవరి 22: గ్రామ పంచాయతీల అభివృద్ధికి వార్డు మెంబర్లే ప్రధాన పాత్ర పోషించి సహకరించాలని ఆర్డీవో నరసింహులు అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు మొదటి, రెండో విడత నిర్వహించిన శిక్షణ తరగుతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డంపింగ్ యార్డు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా గ్రామ సభలు, సమావేశాలతో పరిష్కరించుకోవాలన్నారు. అధికారుల సమన్వయంతో వార్డు మెంబర్లు ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి వార్డు మెంబర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం టిఓటి మనోహర్, రామచంద్ర, అగస్టీన్, ఎంపిడిఓ మహ్మద్ దౌలా మాట్లాడుతూ వార్డు మెంబర్లు విధులు, అధికారాలు, బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. సర్పంచి, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మురికినీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈకార్యక్రమంలో మండల పర్యవేక్షకులు వాసుదేవగుప్త, వెంకటప్రసాదరెడ్డి, సర్పంచ్ బాలహుశేని, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
నందికొట్కూరు, జనవరి 22 : నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని జ్యోతి (17) మంగళవారం అర్ధరాత్రి చున్నీతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తపల్లె మండలం ముసలిమడుగు గ్రామనికి చెందిన కుమ్మరి కురుమన్న రమణమ్మ దంపతుల రెండవ కుమార్తె జ్యోతి ఉన్నత చదువుల కోసం పగిడ్యాల మండలంలోని తూర్పుప్రాతకోట గ్రామంలో అమ్మమ్మ సుబ్బమ్మ, తాతయ్య పెద్దసుబ్బన్నల వద్ద ఉంటూ చదువుకొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కళాశాలలో నిర్వహించిన గ్రాండ్ టెస్టు పరీక్షల్లో స్లిప్పులు పెట్టి కాపీయింగ్ పాల్పడింది. గమణించిన అధ్యాపకులు మందలించారు. దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానంగా భావించిన జ్యోతి మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన ఆత్మహత్యకు బంధువులు ఎవరూ బాధ్యలు కాదని, కేవలం పరీక్ష సమయంలో జరిగిన అవమానంతో చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జ్యోతి మృతదేహన్ని సొంత ఊరు ముసలిమడుగు గ్రామానికి తరలించి అంతక్రియలు నిర్వహించారు.
అధ్యాపకుల సస్పెన్షన్‌కు డిమాండ్
జ్యోతి ఆత్మహత్యకు కారకులైన అధ్యాపకులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎఐయస్‌ఎఫ్ జిల్లాసహయ కార్యదర్శి రామసుబ్బన్న డిమాండ్ చేశారు. విద్యార్థుల అందరి ముందు కొట్టి అవమాన పరిచినందుకే మనస్థాపానికిలోనై జ్యోతి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరన్నారు. అలాగే విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మకు శాంతి కలగాలని బుధవారం తరగతులు బహిష్కరించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని కళాశాల ప్రిన్సిపల్‌కు వినతిప్రతం అందజేశారు. కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు శ్రీనివాసులు, పరమే ష్, ఫైల్‌మాన్, బాలరాజు, నరేష్, వెంకటేష్, ప్రసాద్, మధు పాల్గొన్నారు.
రెండేళ్ల కొడుకును చంపిన తండ్రి
కోడుమూరు, జనవరి 22 : భార్యపై అనుమానంతో బుధవారం రెండేళ్ల కన్న కొడుకును తండ్రే హతమార్చిన సంఘటన సంచలనం కలిగించింది. మండలంలోని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన గొల్ల ఉగాది రంగన్న భార్య సౌజన్యను గత 5 ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా రంగన్న భార్యపై తరుచూ అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయంపై అనేక సార్లు గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగమే గత రాత్రి నిద్రిస్తున్న రెండేళ్ల పిల్లవాడిని ఎత్తుకుని బండకు బాదడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన మహిళ మృతి
మహానంది, జనవరి 22: మండలంలోని బోయలకుంట్ల-గాజులపల్లె మధ్యలో ఆటో, మోటార్ సైకిల్ ఢీ కొన్న ప్రమాదంలో గాయపడిన షంషాద్(50) మృతి చెందినట్లు ఎస్‌ఐ లోకేష్‌కుమార్ బుధవారం తెలిపారు. మంగళవారం బోయలకుంట్ల నుంచి గాజులపల్లె వైపు మోటార్ సైకిల్‌లో భార్యభర్తలు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీ కొనడంతో షంషాద్ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచంగా కోలుకోలేక బుధవారం మృతి చెందిందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.