గుంటూరు, జనవరి 23: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రప్రియేట్ అథారిటీ ఫర్ పిసి, పిఎన్‌డిటి యాక్ట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 258 స్కానింగ్ సెంటర్‌లు, నర్సింగ్ హోంలు రిజిస్ట్రర్ చేసుకున్నాయని, నెలలో 10 స్కానింగ్ సెంటర్ల చొప్పున కమిటీ సభ్యులు తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకూడదని, స్కానింగ్ సెంటర్‌లను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. లింగ నిర్ధారణ చేపట్టిన స్కానింగ్ సెంటర్‌ల నిర్వాహకులు చట్టపరంగా శిక్షార్హులన్న విషయాన్ని పిహెచ్‌సి స్థాయిలో తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్‌ల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ధేశించిన ఐదు రిజిస్టర్లను తప్పక నిర్వహించాలని, వీటిపై కమిటీ సభ్యులు దృష్టి సారించాలన్నారు. స్కానింగ్ సెంటర్‌లలో పనిచేస్తున్న వైద్యాధికారులు స్కానింగ్ వివరాలను నేరుగా చెప్పకపోయినప్పటికీ మధ్య దళారుల ద్వారా వివరాలు తెలియజేసే అవకాశముందన్నారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎస్‌ఎం రఫి మాట్లాడుతూ ఇప్పటివరకు పిసి పిఎన్‌డిటి చట్టం కింద రిజిస్టర్ అయిన మూడు కేసుల వివరాలు తెలియజేయాలన్నారు. కేసుల నమోదులో పంచనామా రాసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో గల ఒక కేసును మూడు రోజుల్లోగా కమిటీ చర్చించి కేసు పరిస్థితిని తెలియజేయాలని, సంబంధిత కోర్టు అధికారికి లేఖ రాయాలని జడ్జి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం గోపీనాయక్ మాట్లాడుతూ ఇప్పటివరకు రిజిస్టర్ అయిన మూడు కేసుల పూర్వాపరాలను కమిటీకి వివరించారు. కమిటీ బృందం నవంబర్, డిసెంబర్ మాసాల్లో సుమారు 13 నర్సింగ్ హోంలను తనిఖీ చేయడం జరిగిందని వివరించారు. నూతనంగా ఏడు స్కానింగ్ సెంటర్‌ల రిజిస్ట్రేషన్, 12 స్కానింగ్ సెంటర్‌ల రెన్యువల్స్‌కు కమిటీ ఆమోదం తెలిపింది. స్కానింగ్ సెంటర్‌లలో ఆన్‌లైన్ సిస్టమ్ పెట్టాలని కమిటీ తీర్మానించింది. అలాగే పిసి, పిఎన్‌డిటి చట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చేలా తీర్మానించి ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు చేపడతామని కమిటీ పేర్కొంది. స్వచ్చంద సంస్థ ప్రతినిధి రోషన్‌కుమార్‌ను ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా పిసి, పిఎన్‌డిటి చట్టాన్ని అనుసరించి స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ ఆదేశించారు. ఈసమావేశంలో అర్బన్ ఎస్‌పి జెట్టి గోపీనాధ్, అదనపు డిఎంహెచ్‌ఒ ఆర్ నాగమల్లేశ్వరి, డిపిఎంఒ డాక్టర్ ఎం శ్యామలాదేవి, న్యాయవాది ఏలియా తదితరులు పాల్గొన్నారు.
గర్భిణుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి
* కలెక్టర్ సురేష్‌కుమార్
గుంటూరు, జనవరి 13: జిల్లాలో గర్భిణుల వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సూచించారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎస్‌పిహెచ్‌ఒ, మెడికల్ అధికారులతో మార్పు కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2012-13 సంవత్సరంలో గర్భిణీల నమోదు (ఎఎన్‌ఇ రిజిస్ట్రేషన్) 89 శాతం కాగా, 2013-14 సంవత్సరం డిసెంబర్ వరకు 85 శాతం రిజిస్ట్రేషన్ జరిగిందని, దీన్ని బట్టి చూస్తే శాఖ పనితీరు అర్థమవుతోందన్నారు. కావూరు, కాట్రపాడు, కుంచనపూడి, పెదకూరపాడు పిహెచ్‌సిలలో గర్భిణీల నమోదు కార్యక్రమంపై ఆయన ఎస్‌పిహెచ్‌ఎస్‌లతో సమీక్షించారు. గర్భిణీల నమోదులో అలక్ష్యం వహించిన ఎస్‌పిహెచ్‌ఒఎస్‌లకు ఛార్జి మెమో ఇవ్వాలని డిఎంహెచ్‌ఒను కలెక్టర్ ఆదేశించారు. సక్రమంగా పనిచేయని వైద్యాధికారులను బదిలీకి సిఫార్సు చేస్తూ దస్త్రం పెట్టాలన్నారు. పిహెచ్‌సిలలో నాన్ క్లినికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ద్వారా, సూపర్‌వైజర్ల ద్వారా వివిధ అంశాలపై కంప్యూటర్‌లో నమోదు చేయించేలా చూడాలని ఎస్‌పిహెచ్‌ఒలను ఆదేశించారు. ఎఎన్‌ఎంల ద్వారా సేకరించిన అంశాలను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్ధేశిత ప్రొఫార్మాలో నమోదయ్యేలా చూడాలన్నారు. హైరిస్క్‌గా గుర్తించిన గర్భిణీల నెలసరి చెకప్‌లను మెడికల్ ఆఫీసర్‌లు సక్రమంగా నిర్వహించడం లేదని అంటూ వీరి కాన్పు నిపుణల ద్వారా జరిగేలా చూడాలని సూచించారు. హై రిస్క్‌గా గుర్తించిన వారందరూ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి సిజేరియన్ చేయించుకుంటున్నారన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల నుండి వచ్చి కార్పొరేషన్ పరిధిలో గల ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు చేసుకున్న వారి వివరాలను ప్రైవేటు ఆసుపత్రుల నుండి ఆన్‌లైన్ ద్వారా పొందాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఎవరు పని చేస్తున్నారని ప్రశ్నించగా డిఎంహెచ్‌ఒ, అదనపు డిఎంహెచ్‌ఒ సమాధానమివ్వక పోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక శాతం ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇంటింటినీ సందర్శించి గర్భిణీలు, బాలింతల వివరాలను తెలుసుకోవాలని సూచించారు. సిజేరియన్‌లు ఎక్కువ శాతం జరగకుండా సహజ కాన్పులు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాన్పు జరిగిన గంటలోపు తల్లిపాలు బిడ్డకు తాగించేలా అవగాహన కల్పించాలన్నారు. కేవలం వైద్య కార్యకలాపాలు నిర్వహించేలా ఒక డాక్టర్‌ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎంహెచ్‌ఒకు సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కల్పించే సదుపాయాలు, మల్టీ స్పెషాలిటీ సౌకర్యాల గురించి కరపత్రాలు, ఫ్లెక్సీలు తయారు చేసి సామాన్య ప్రజలందరికీ కనిపించేలా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జెసి నాగేశ్వరరావు, అదనపు డిఎంహెచ్‌ఒ నాగమల్లేశ్వరి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీదేవి, డిపిఎంఒ డాక్టర్ శ్యామలాదేవి, ఐసిడిఎస్ పిడి చంద్రశేఖర్, ఎస్‌పిహెచ్‌ఒఎస్, సిడిపిఒలు, మార్పు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వ్యాయామవిద్యకు ఉజ్వల భవిష్యత్తు
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 23: రానున్న రోజుల్లో వ్యాయామ విద్యను అభ్యసించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య పి విజయప్రకాష్ అన్నారు. వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో పీసెట్ మెథడాలజీ అండ్ కామన్‌కోర్ సిలబస్ అనే అంశంపై గురువారం వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు అధ్యక్షత వహించారు. ఆచార్య విజయప్రకాష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విలువలతో కూడిన విద్యాభోదన ద్వారా ఉత్తమమైన నిపుణులను తయారు చేయగలుగుతామని, కళాశాలలు మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నూతన విధానాలను విద్యాభోదనలో వినియోగించుకోవటం ద్వా రా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతామని తెలిపారు. వీసీ ఆచార్య కెవిరావు మాట్లాడుతూ వరుసగా పీసెట్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వా రా నాగార్జున వర్సిటీ మంచి పేరును సంపాదించుకుందని అన్నా రు. క్రీడలకు కావాల్సిన అన్ని వసతులు వర్సిటీలో ఏర్పాటు చేయటం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య వైపి రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఆచార్య వై కిషోర్, వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిపిఎస్ పాల్‌కుమార్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ పి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పనబాకకు సమైక్య సెగ
చెరుకుపల్లి, జనవరి 23: ఇటీవల పునర్నిర్మాణం జరుపుకున్న చెరుకుపల్లి గ్రామ దేవత శ్రీపోలేరమ్మ అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన కేంద్ర పెట్రోలియం సహాయ మంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. గురువారం అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించడానికి వచ్చిన మంత్రి కారు దిగుతుండగా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు వస్తున్నవారితోపాటు ఒక యువకుడు సమైక్యాంధ్ర ప్లకార్డుతో దూసుకెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలంటూ నినాదాలు చేశాడు. వెంటనే పక్కనే ఉన్న మంత్రి వర్గీయులు ఆ యువకునికి దేహశుద్ధి చేసి పక్కకు నెట్టారు. ఇదంతా గమనిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా సమైక్య నినాదం చేసిన యువనికిపై దాడి జరగటం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. చివరిగా చెరుకుపల్లి శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ పలువురు గ్రామస్థులు అర్జీ అందజేశారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పూలమాలలువేసి నివాళులర్పించి రేపల్లె వైపునకు తరలివెళ్ళారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మోపిదేవి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగలిపువ్వు నాగేశ్వరరావు, తమ్మల నరేంద్ర, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రావూరి ఆంజనేయులు, దివి రాంబాబు, సంపత్‌బాబు, రాథాకృష్ణమూర్తి, ఆవిఎస్ ఆంజనేయులు, ఆలయ ధర్మకర్త చెరుకుపల్లి మురహరిరావు, అర్చకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక రవాణాతో వచ్చేది...
ప్రభుత్వానికి వెయ్యి కోట్లు.. మాఫియాకు 30 వేల కోట్లు
* రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ
అమరావతి, జనవరి 23: రాష్ట్రంలో ఇసుక రవాణా కోసం ప్రభుత్వం అనుసరించిన విధానాల మూలంగా ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోందని, దళారులు, ఇసుక మాఫియాకు సుమారు 30 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ అన్నారు. గురువారం అమరావతిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల మూలంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక సీనరేజ్‌లను పూర్తిగా ఎత్తివేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సరళీకృత ఆర్థికవిధానాలను సక్రమంగా అమలు చేయడం, నియంత్రణ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 6.35 కోట్ల మంది రైతులు 5.30 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారని రాష్ట్రంలో సుమారు 10మంది కాంట్రాక్టర్లు మాత్రమే 6.35 లక్షల కోట్లు వివిధ జాతీయ బ్యాంకు నుండి అప్పులు తీసుకుని నిబంధనల ప్రకారం వినియోగించకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుని బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళారుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఉత్కంఠభరితంగా సెంట్రల్ జోనల్ అథ్లెటిక్స్ పోటీలు
అచ్చంపేట, జనవరి 23: జిల్లా సెకండరీ పాఠశాలల 13 జోన్‌ల పరిధిలోని బాలుర సెంట్రల్ జోనల్ అథ్లెటిక్ క్రీడాపోటీలు అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆహ్లాదకరంగా, రసవత్తరంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన గురువారం క్రీడాకారులకు సీనియర్ విభాగంలో పలురకాల అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. 400 మీటర్ల పరుగులో సిహెచ్ అశోక్‌బాబు (ఎఎంజి చిలకలూరిపేట) ప్రథమస్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వి దేవుడునాయుడు (ఎస్‌పికెహెచ్ గవర్నమెంటు హైస్కూల్ గుంటూరు), అలాగే వరుసగా 300 మీటర్ల పరుగులో శివన్నారాయణ (ఎస్‌కెసిఎం నరసరావుపేట), అరుణోదయ కిరణ్ (ఎఎంజి చిలకలూరిపేట), 1500 మీటర్ల పరుగులో అరుణోదయ కిరణ్ (ఎఎంజి చిలకలూరిపేట), ఎం గోపీ శ్రీనివాస్ (జడ్పీ పలకలూరు), 200 మీటర్ల పరుగులో సిహెచ్ అశోక్ (ఎఎంజి చిలకలూరిపేట), వి లక్ష్మణ్‌బాబు (ఎస్‌పికెహెచ్ గుంటూరు), పోల్‌వాల్ట్‌లో కె రాజేష్ (జడ్పీ ఉల్లిపాలెం), ఎస్‌కె అమీర్ (ఎఎంజి చిలకలూరిపేట), హై జంప్‌లో కె నెహేమియా (ఎఎంజి చిలకలూరిపేట), సిహెచ్ భాస్కర్ (ఆక్స్‌ఫర్డ్ పిడుగురాళ్ల), షాట్‌పుట్‌లో గోపి (జడ్పీ ఇనిమెళ్ల), వి సాయి సాత్విక్ (జడ్పీ ఉల్లిపాలెం), డిస్కస్‌త్రోలో ఎస్ సాగర్ (సెయింట్ జోసఫ్ రెంటచింతల), బి వెంకట్రావ్ (ఎస్‌కెసిఎం హైస్కూల్ నరసరావుపేట), లాంగ్‌జంప్‌లో బి ప్రేమచంద్ (జడ్పీ గణపవరం), పి కాజామొహిద్దీన్ (ఎల్‌ఎన్‌హెచ్‌ఎస్ పెదనందిపాడు) నిలిచారు. అయితే జూనియర్స్ విభాగాల్లో కొన్నింటికి ఫలితాలు ప్రకటించలేదు. ఈ అథ్లెటిక్ క్రీడలు శుక్రవారంతో ముగియనున్నాయని పిడి మస్తాన్‌రెడ్డి, పిఇటి రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.
‘రానున్న ఎన్నికల్లో ఎన్నారై సేవలు వినియోగించుకుంటాం’
గుంటూరు (కొత్తపేట), జనవరి 23: రానున్న ఎన్నికల్లో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యుల సేవలను వినియోగించుకుంటామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో గుంటూరుకు చెందిన ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు రూపొందించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సోషల్ మీడియా, సెల్‌ఫోన్ అప్లికేషన్స్, షాట్ ఫిలిమ్స్, పోస్టర్లు తదితర రూపాల్లో పార్టీ ప్రచారాన్ని ఎన్నారై సభ్యులు చేయాలన్నారు. విద్యావంతులందరూ ఏకమై, మేధావులు వౌనం వీడి దుర్మార్గానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలు, ప్రస్తుత సమాజ రుగ్మతులపై వినూత్నరీతిలో ఎన్నారై సభ్యులు ప్రచారం చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సవాళ్లు ఎదుర్కొనేందుకు హైటెక్ సిటీ, నాలెడ్జి పార్కు, బయోటెక్ పార్కు, స్పెషల్ ఎకనామిక్ జోన్ వంటి ప్రతిష్టకరమైన సంస్థలను నెలకొల్పి లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకు సమైక్యవాదం
ప్రజా ప్రయోజనాల కోసమే
గుంటూరు, జనవరి 23: రాష్ట్రం విడిపోతే ఆర్ధికంగా, సామాజికంగా సంక్షోభం వస్తుందనే ఆందోళన నేపథ్యంలో ప్రజల ప్రయోజనాల కోసం గడప గడపకు సమైక్యవాదం వినిపిస్తున్నామని, ప్రజలంతా సమున్నతంగా ఉద్యమానికి తరలి రావాలని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావంలో భాగంగా గురువారం నగరంలోని శ్రీనివాసరావుపేటలో గడప గడపకు సమైక్యవాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. 21,26 డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు శ్రావణకుమారి, గేదెల రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అప్పిరెడ్డి పాల్గొని పర్యటించారు. శ్రీనివాసరావుపేటలో స్థానికంగా ఉన్న పలు సమస్యలను అక్కడి ప్రజలు అప్పిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కొండారెడ్డి, మార్కెట్‌బాబు, ఇంజనీర్ కిషోర్, మేడం కిషోర్, ఎస్‌కె రఫి, అడ్వకేట్ బాబు, అంబటి రవి, అత్తోట అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువత చేతిలోనే దేశభవిష్యత్తు
మంగళగిరి, జనవరి 23: దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ఎపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఎంవి కృష్ణయ్య అన్నారు. పట్టణంలోని షాదీఖానాలో గురువారం జరిగిన పిడిఎస్‌ఓ మహాసభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. నాగుల్‌మీరా, గురులింగం అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భగత్‌సింగ్, ఆజాద్‌లాంటి ఎందరో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించి అమరులయ్యారని అన్నారు. నూతన విద్యావిధానంకై ప్రజాతంత్ర ఉద్యమం అవసరమని ఆయన అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ విద్యావ్యాపారానికి పాలకులు తెరతీశారని ఆయన అన్నారు. పేద, బడుగు వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారని, పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్‌వైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషా, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పిడిఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు బాజీసైదా, ఎన్‌వైఎస్ జిల్లా అధ్యక్షుడు కె శ్రీను, దుర్గాప్రసాద్ తదితరులు ప్రసంగించారు. తొలుత విద్యార్థులు పట్టణంలో భారీప్రదర్శన నిర్వహించారు.
భారతజాతి గర్వించదగ్గ దేశభక్తుడు నేతాజీ
గుంటూరు (పట్నంబజారు), జనవరి 23: భారతిజాతి గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య కొనియాడారు. గురువారం స్థానిక కొత్తపేటలోని బోసుబొమ్మ సెంటర్‌లోగల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జరిగిన జయంతి సభకు అవగాహన సంస్థ సీనియర్ సభ్యుడు ఎంవి రమణరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ చరిత్ర కీర్తి కిరీటాల్లో నిలిచిపోయిన కొద్దిమందిలో నేతాజీ ప్రముఖుడన్నారు. దాస్యశృంఖలాల్లో మ్రగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి వారిలో నూతనోత్తేజాన్ని నింపిన మహనీయుడు బోస్ అని కొనియాడారు. మాతృదేశ విముక్తి కోసం నేతాజీ పడిన తపన కొంతమేరైనా నేటి నాయకుల్లో ఉండి ఉంటే భారతదేశం సుసంపన్నమయ్యేదన్నారు. అవగాహన సంస్థ సీనియర్ సభ్యుడు నడింపల్లి గురుదత్తు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నంగా నేతాజీ మారారన్నారు. తొలుత నేతాజీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సభ్యులు కొల్లా రోశయ్య, కె కనకదుర్గయ్య, కస్తూరి సైదులు, సిఎస్ మహేశ్వరరావు, సత్యనారాయణ, జి బాబురావు, పాశం రవీంద్రయాదవ్, మస్తాన్‌మేస్ర్తీ, జానీబాషా తదితరులు పాల్గొన్నారు.
దానాల్లో కెల్లా విద్యాదానం మిన్న: ఎంపి రాయపాటి
అమరావతి, జనవరి 23: దానాలన్నింటిలో కెల్లా విద్యాదానం ఎంతో గొప్పదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. గురువారం స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో మల్లెల శ్రీ్ధర్‌చౌదరి సతీమణి సక్కుబాయి, కుమార్తె సూర్యకిరణ్ స్మారకార్థం వారి పేర్లతో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియాన్ని విజయవాడ సిద్ధార్థ అకాడమీ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు మల్లెల అనంత పద్మనాభరావు అధ్యక్షత వహించారు. పార్లమెంటు సభ్యు డు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్య నందించేందుకు హైస్కూల్ కరస్పాండెంట్ మల్లెల శ్రీనాథచౌదరి చేస్తున్న కృషి అపారమైందని, అం దుకు తనవంతుగా పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ హైస్కూల్ అభివృద్ధికి తన గ్రాంటు నుండి 2 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారికి మాత్రం ప్రభుత్వం నుండి సరైన సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ నిమ్మా విజయసాగర్‌బాబు, మాజీ ఎంపిపి వెంపా జ్వాలా లక్ష్మీనరసింహారావు, రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ వావిలాల సుబ్బారావు, శనగవరపు రామ్మోహనశర్మ, జనార్ధనరావు, హైస్కూల్ కమిటీ అధ్యక్షుడు వజినేపల్లి వెంకట శివశేఖర్, కార్యదర్శి గుబ్బా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పారేపల్లి వెంకట సత్యనారాయణ, వ్యాపారవేత్త ఆళ్లగడ్డ సురేష్‌కుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, అమరావతి సర్పంచ్ జి నిర్మలాదేవి, ఫాదర్ పూ దోట దాసయ్య, ఫాదర్ బాలి, ఆడిటర్ సిహెచ్ మస్తానయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభలో హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనాధచౌదరిని ఘనంగా సత్కరించారు.
ఏడాదికి 12 సిలిండర్లకు కేంద్రం సుముఖం
* కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి
బాపట్ల, జనవరి 23: గ్యాస్ వినియోగదారులకు ఏడాదికి 9 సిలెండర్లు మాత్రమే ఇవ్వాలని గతంలో కేంద్రం నిర్ణయించినా, ప్రజల కోరిక మేరకు ఈసంఖ్యను 12కు పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఈమేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారని, త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఆమె వివరించారు. గురువారం గుంటూరు జిల్లా బాపట్లలోని తన నివాసంలో విలేఖర్ల సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక మాట్లాడుతూ తాను భారతీయ జనతా పార్టీలో చేరి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల లోక్‌సభ స్థానం నుండే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అధిష్ఠానం అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్లడానికైనా సిద్ధమేని పనబాక అన్నారు.
అధికారుల అలసత్వంతో అభివృద్ధిలో వెనుకంజ
తన పార్లమెంటరీ నియోజికవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం అధికారుల అలసత్వం వల్లనే వెనుకబడి ఉన్నాయని, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కూడా విడుదల కాలేదని కేంద్రమంత్రి పనబాక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యలంక టూరిజం ప్రాజెక్టు పనులు, గడియారస్తంభం, భావన్నారాయణస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు అధికారుల వైఖరి వలనే తీవ్ర జాప్యం జరుగుతున్నాయన్నారు.
27న ఇండోర్ స్టేడియం
పనులకు శంకుస్థాపన
బాపట్ల వ్యవసాయ కళాశాలలో రూ.6.6కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులకు ఈనెల 27న శంకుస్థాపన చేయనున్నట్లు, ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, క్రీడా శాఖా మంత్రి వట్టి వసంత్‌కుమార్ తదితరులు హాజరవుతారన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్ పనులకు ఫిబ్రవరి మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని వివరించారు.
వృక్ష- జంతు సంపద సమృద్ధితోనే జీవవైవిధ్యం సుభిక్షం
తెనాలి, జనవరి 23: ప్రకృతిలో వృక్ష - జంతు సంపదలు సమృద్ధిగా ఉంటేనే జీవవైవిధ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రస్తుతం 7.6శాతం జీవవైవిధ్యమే మానవాళికి ప్రయోజనకరంగా ఉందని లలిత ఫార్మాస్యూటికల్ (చెన్నై) సిఇఒ డాక్టర్ సిఎన్.రామచంద్ర పేర్కొన్నారు. స్థానిక జెఎంజె కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బయోడైవర్సిటీ అనే అంశంపై రెండురోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభించారు. కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ సిస్టర్ షైనీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సిఎన్.రామచంద్ర మాట్లాడుతూ భారతదేశంలో 20.4శాతం భూ భాగాన్ని జీవివైవిద్యం ఆవరించియుండగా మానవాళికి 7.6శాతం ప్రయోజనకరంగా ఉందన్నారు. వృక్ష సంపద ద్వారా మానవాళికి ప్రయోజనకరమైన ఔషధాలను ప్రయోగాత్మకంగా ప్రజలకు చేరువ చేస్తున్న తీరును వివరించారు. చెన్నైకి చెందిన తుప్పాలి ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ రవిశంకర్, లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రజనీకాంత్ జీవ వైవిధ్యాన్ని ఎవిధంగా పరిరక్షించుకోవాలో వివరించారు. ఇదే సదస్సులో డాక్టర్ శివరాజ్ నటరాజన్, కళాశాల కరస్పాండెంట్ స్టెల్లా మారీస్, సిస్టర్ రోస్‌లీనా విద్యార్థులు పాల్గొనగా, జంతుశాస్త్ర విభాగం ముఖ్యులు ఎం ఆదిలక్ష్మి, కె.శైలజ, ఎం.అమల, సిహెచ్.సరోజిని పర్యవేక్షించారు.
మెడికల్ షాపులపై అధికారుల మెరుపు దాడులు
* దాడుల నేపథ్యంలో షాపులు మూసివేత
మాచర్ల, జనవరి 23: పట్టణంలోని పలు మెడికల్ షాపులపై గురువారం జిల్లా డ్రగ్గిస్టు అసిస్టెంట్ డైరెక్టర్ బాలనాగేంద్రజన్ బృందం అకస్మికంగా దాడులు నిర్వహించింది. దాడులు విషయం తెలుసుకున్న మెడికల్ షాపుల యజమానులు ఎవరికి వారు స్వచ్ఛందంగా దుఖాణాలు మూసి ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. దీంతో మందుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెడికల్ షాపులు మూసివేసిన వారంతా శాంపీల్స్‌నే అమ్ముతున్నారేమోనని ప్రజలు చెవులు కొరుక్కున్నారు. దీనిపై డ్రగ్గిస్టు అసిస్టెంట్ డైరెక్టర్ బాలనాగేంద్రజన్, డ్రగ్గిస్టు పద్మ మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో శాంపిల్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, ఈనేపథ్యంలో మెడికల్ షాపులపై, ఏజన్సీలపై తనిఖీలు చేశామన్నారు. దాడుల్లో ఎటువంటి శాంపిల్స్ దొరకలేదని వారు తెలిపారు.
సాధ్యంకాని రుణమాఫీ హామీలను నమ్మొద్దు
* 13లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* వంటగ్యాస్‌కు ఆథార్ లింక్ విషయంపై అధిష్ఠానంతో చర్చిస్తాం
* కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి
భట్టిప్రోలు, జనవరి 23: అమలు సాధ్యంకాని రుణమాఫీ మాటలను ప్రజలు నమ్మవద్దని కేంద్ర పెట్రోలియం, ఇంధన వనరుల సహాయ మంత్రి పనబాకలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వేమవరం గ్రామంలో 5లక్షల రూపాయల ఎంపి నిధులతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రం భట్టిప్రోలులో 7లక్షల నిధులతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కూడా పనబాక శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ రైతులకు మేలుచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ప్రతిపక్ష పార్టీలు డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామంటున్నారని, కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ రుణాల మాఫీలపై మాట్లాడలేక పోతున్నారంటూ అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ రుణాల మాఫీ ఎంతవరకు సాధ్యం..?, అధికారంలో లేరుకాబట్టి ఏమైనా చెబుతారు. ఆచరణ సాధ్యంకాని మాటలు మాకు పనికిరావంటూ ... అయినా ఎన్నికల మ్యానిఫెస్టో రావల్సి ఉందని, మాఫీలు ఇబ్బందికరమే అన్నారు. గ్యాస్ కొనుగోలుకు ఆథార్ లింక్‌తో సబ్సిడీలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ కొందరు మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమని, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈవిషయంలో బ్యాంకర్ల లోపాలు కూడా ఉన్నాయని, ఆథార్ లింక్‌పై త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. రాజ్యసభ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తలపై వివరణ కోరగా ఆశ పడటంలో తప్పులేదని, అయినా ఆవిషయం గురించి అధిష్ఠానంతో చర్చించలేదన్నారు. స్థానిక పోస్టల్ కార్యాలయం నుండి పింఛన్లు తీసుకోవడానికి కార్యాలయం 3వ అంతస్తులో ఉండటంతో వృద్ధులు ఇబ్బందులు పడుతన్నారంటూ మంత్రికి తెలపగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఫోనుద్వారా సంప్రదించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీగాఉన్న పార్టీ ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆర్ భరత్, డిసిసి ఉపాధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా, సర్పంచ్‌లు మరియమ్మ, బిందు, దేవస్థానం చైర్మన్ రావూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
110 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల, జనవరి 23: అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు పట్టణ శివారులో స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ వంశీధర్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నుండే అక్రమ బియ్యం రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘాపెట్టారు. దుర్గి వైపు నుండి బియ్యం లోడుతో వస్తున్న లారీని రాయవరం జంక్షన్ సమీపంలో అధికారులు కాపు కాచి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లారీలో తరలిస్తున్నది రేషన్ బియ్యంగా గుర్తించిన అధికారులు బియ్యంతో సహా లారీని రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓరుగంటి మోహన్‌రెడ్డి, గోపిశెట్టి కృష్ణయ్యలపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని లారీని రూరల్ ఎస్‌ఐ చెన్నకేశ్వర్లుకు అప్పగించినట్లు విజిలెన్స్ సీఐ వంశీధర్ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ రాంబాబు పాల్గొన్నారు.