Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆక్రమణల కూల్చివేత

$
0
0

ఖమ్మం, జనవఠి 23: హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎనె్నస్పీ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గురువారం ఉదయం నుంచి తొలగింపును ముమ్మరం చేశారు. తమ ఇళ్ళను కూల్చవద్దంటూ బాధితుల ఆర్తనాదాలు, ఆత్మహత్య ప్రయత్నాలు, ఆందోళనల మధ్య కూల్చివేతలు పోలీస్ పహారాతో కొనసాగాయి. వేలాది మంది పోలీసులు ఆక్రమిత స్థలాల సమీపంలోకి ఉదయమే చేరుకొని ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇందిరానగర్ బోర్డు నుంచి మమత ఆసుపత్రి చివర వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని రెవెన్యూ అధికారుల కూల్చివేతలకు సహకరించారు. ఆ ప్రాంతంలోని ప్రధాన నేతల కట్టడాలతో పాటు ప్రముఖుల ఇళ్ళను కూడా కూల్చివేశారు. బుధవారం కొద్ది మంది నేతలు ఆందోళనలు చేయటంతో వెనుకంజ వేసిన అధికారులు గురువారం తెల్లవారే సరికి ఆ నేతలను పోలీస్ స్టేషన్లకు తరలించి యథావిధిగా తమ పనిని కొనసాగించారు.
ఎనె్నస్పీ ఆక్రమణ స్థలాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించటంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా బుధవారం నుంచి ఆక్రమణ స్థలాలను సర్వే చేసే పనిలో నిమగ్నమై బుధవారం కొన్నింటిని తొలగించగా, గురువారం తొలగింపును ముమ్మరం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జిల్లా ఎస్పీ రంగనాథ్ రెవెన్యూ, పోలీస్ సంబంధిత రెవెన్యూ పరిధిలోని పాకబండబజార్, ఖానాపురం హవేలి, వెలుగుమట్ల, గొల్లగూడెం ప్రాంతాల్లోని ఆక్రమణ స్థలాల్లోని నివాసాలను కూల్చేశారు. దీంతో ఆక్రమిత స్థలాల్లోని నివాసాలన్ని నేలమట్టమయ్యాయి. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆర్డీవో సంజీవరెడ్డి, తహశీల్దార్ అశోకచక్రవర్తిలు ఆక్రమణ స్థలాలను తొలగించారు. ఈ సమయంలో ఆక్రమణదారులు ఆందోళన చేస్తారనే ఉద్దేశ్యంతో అధికారులు ఖమ్మం డిఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలో సిఐలు నరేష్‌రెడ్డిలతో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహింపచేశారు.
ఇదిలా ఉండగా ఆక్రమణదారులు మాత్రం తాము అనేక సంవత్సరాలుగా ఇక్కడే నివశిస్తుండగా అధికారులు ఒకే సారి తాము నివశిస్తున్న ఇళ్ళను కూల్చివేయటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారంగా కోర్టు ఆర్డర్లు ఉన్నాయంటూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికప్పుడు తమ నివాసాలు కూల్చివేయటంతో తాము ఎక్కడికి వెళ్ళి నివసించాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జెసిబిలను తీసుకొచ్చి తమ ఇళ్ళను కూల్చివేస్తుండటం దారుణమన్నారు. తమ ఇళ్ళల్లో ఉన్న కనీస సామాగ్రిని భద్రపర్చుకునే వెసులుబాటు సైతం ఇవ్వకపోవటం దురదృష్టకరమన్నారు. ఆక్రమణలను తొలగింపుతో తాము అనాథలయ్యామన్నారు. పేదల నివాసాలను తొలగిస్తున్న అధికార యంత్రాంగం కొంతమంది పలుకుబడి కలిగిన నాయకులను ఆక్రమణాలను తొలగించటం లేదని ఆరోపించారు. తొలుత ఆక్రమణల తొలగింపు విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజయ్‌కుమార్ ఆందోళన చేసేందుకు వెళ్ళగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌ఐలు, విఆర్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిపిఐ నాయకుల ముందస్తు అరెస్ట్
ఆక్రమణల తొలగింపును అడ్డుకుంటారనే కారణంతో సిపిఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బుధవారం అర్థరాత్రి సమయంలో నాయకుల ఇళ్ళకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం వరకు వారిని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచినప్పటికీ ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. ఆక్రమణలను అడ్డుకుంటారనే కారణంతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా తమను అర్థరాత్రి సమయంలో గోడలు దూకి తమ ఇళ్ళకు వచ్చి అదుపులోకి తీసుకున్నారని, పేదలకు అండగా ఉండటం కూడా నేరమేనని పోలీసులు భావించటం దారుణమని సిపిఐ నగర కార్యదర్శి మహ్మద్ సలాం పేర్కొన్నారు. అర్థరాత్రి సమయంలో తమను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఉంచారని తెలిపారు. పేదలకు అండగా ఉన్న తమను నేరస్థులుగా చూడటం తగదన్నారు. ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారి ఇళ్ళను కూల్చి నిరాశ్రయులను చేయటం ప్రభుత్వానికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఆక్రమణదారులంతా ఏకమై తమ ఇళ్ళను అధికారులను అక్రమంగా కూల్చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ నివాసాలను కూల్చేయటం సరికాదన్నారు. అనేక సంవత్సరాలుగా నివాసముంటున్న తాము దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై
ఆర్మీ అధికారుల సంతృప్తి
కొత్తగూడెం టౌన్, జనవరి 23: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో ఈనెల 18నుంచి నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన సింగరేణి, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కల్నర్ యోగేష్ మొదలియార్ అభినందించారు. ఈ విషయంలో పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని పదిజిల్లాల నుంచి వేలాదిగా వచ్చిన అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించి వేలాది మంది అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ అయ్యేవిధంగా సహకరించారన్నారు. 18 నుంచి కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి అమయ్‌కుమార్, డిఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ పర్సనల్ బాబుసత్యసాగర్‌తో పాటు వివిధశాఖల అధికారులు రాత్రింబవళ్ళు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కార్యక్రమాన్ని పరివేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదిక మీద నిర్వహిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు స్వచ్ఛందసంస్థలు ఉచితంగా భోజన సదుపాయాన్ని రెండుపూటల అందజేస్తూ తమ సేవాధృక్పదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలోని స్వచ్ఛందసంస్థలు, వ్యాపార, వాణిజ్య, కులసంఘాలు, విద్యాసంస్థలు తమకు చాతనైనంత సహకారాన్ని చేస్తున్నారు. భోజన వసతితో పాటు అరటిపండ్లు పంపిణీ, గ్లూకోజ్‌వాటర్, పులిహోరప్యాకెట్లు అందిస్తున్నారు. దూరప్రాంత విద్యార్థులకు అవసరమైన వసతిసదుపాయాన్ని సైతం అందించి అతిధులను ఆదరించిన తరహాలో తమ సేవలను అందించడం గమనార్హం.

ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులు
ఖమ్మం, జనవరి 23: ప్రభుత్వ ఉత్తర్వులను కేబినెట్ చేసిన తీర్మానాలను ధిక్కరించి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాన్ని ఖమ్మం జిల్లా అధికారులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. కొనే్నళ్ళ క్రితం ఖమ్మంలో పని చేస్తున్న జర్నలిస్టులు నివాస స్థలాల కోసం సొసైటీగా ఏర్పడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 147ను గుర్తించి గ్రామ పంచాయతీ తీర్మానం కూడా పొందారు. గతంలో ఈ స్థలం భూదాన్ బోర్డుది కావటంతో జర్నలిస్టు సొసైటీ వారి అనుమతి కూడా పొందింది. అప్పటి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ రఘునందన్‌రావులు సొసైటీ దరఖాస్తును పరిశీలించి దానిని కేటాయించేందుకు ఏలాంటి అభ్యంతరం లేదని తెలియచేస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, 2009 మార్చి నెలలో అప్పటి వైఎస్ కేబినెట్ 147 సర్వే నెంబర్‌లోని 10.20 ఎకరాల భూమిని జర్నలిస్టు సొసైటీకి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. సొసైటీలో ఉన్న సభ్యులంతా కలిసి గుట్టలుగా ఉన్న భూమిని చదును చేశారు. ఈ క్రమంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు జర్నలిస్టులు విన్నవించటంతో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందన్న సమయంలో అధికారుల కుట్రలు బహిర్గతమయ్యాయి. సుమారు ఆరు నెలల క్రితం అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్, అర్బన్ తహశీల్దార్ చక్రవర్తిలు ఈ స్థలాన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం కేటాయించారు. 2009లోనే ప్రభుత్వం జర్నలిస్టు సొసైటీకి ఈ భూమిని కేటాయించినప్పటికీ దానిని కాదని, ఇతర వాటికి దీనిని కేటాయించటం విశేషం. ఇదిలా ఉండగా సదరు స్థలంలో 5కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా ఈ భవన నిర్మాణాల విషయం మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోలకు గాని తెలియకపోవటం విశేషం. చిన్న పనులకే హడావుడి చేసే అధికారులు 5కోట్ల ప్రాజెక్ట్‌కు ఎలాంటి హడావుడి చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉండగా 140సర్వే నెంబర్‌లోని భూమిని ఆర్‌విఎంకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ఆ స్థలాన్ని చదును చేసేందుకు 25లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జర్నలిస్టులు చదును చేసిన స్థలాన్ని తాము చదును చేసినట్లుగా లెక్కలు చూపటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ భవన నిర్మాణానికి ఇప్పటికే 40లక్షలు ఖర్చు చేసినట్లు చూపించటం శోచనీయం. కాగా రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాన్ని ఇతరులకు కేటాయించటాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీనివ్వటంతో సమ్మతించిన వారు సోమవారం నుంచి నిరవధిక ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మధిర పంచాయతీలో 55 కోట్లతో అభివృద్ధి పనులు
* నగర కమిషనర్ మల్లప్ప
మధిర, జనవరి 23: మధిర నగర పంచాయతీలో 5.5కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ మల్లప్ప పేర్కొన్నారు. గురువారం ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మధిర నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 50లక్షల రూపాయలతో 11సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా 2కోట్లతో చేపట్టిన 61సిసి మెటల్ రోడ్లు నిర్మణ దశలోవున్నట్లు పేర్కొన్నారు. మరో 31రోడ్లకు 1.5కోట్లతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందని త్వరలోనే అనుమతులు రానున్నట్లు తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయాన్ని 5కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించగా 50లక్షల నిధులు మంజురయ్యాయని, త్వరలో కార్యాలయ నిర్మాణం చేపడతామన్నారు. అదే విధంగా మధిర పట్టణంలో చెత్తపై కొత్త సమరం పేరుతో 20వార్డులకు దాతల సహకారంతో 20తోపుడు బండ్లను ఏర్పాటు చేసి ఇళ్ళ వద్ద నుండి నేరుగా చెత్తను సేకరించి డంపింగ్ కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఖమ్మం మున్సిపాలిటి తర్వాత తొలిసారిగా మధిర నగర పంచాయతీలో సేకరించిన తర్వాత తొలిసారిగా మధిర నగర పంచాయతీ సేకరించిన పొడి చెత్తను విక్రయిస్తున్నామని, దీని ద్వారా ప్రస్తుతం రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం వస్తుందన్నారు. చికెన్, మటన్, కూరగాయల వ్యాపారులు వద్ద నుండి చెత్తను సేకరించేందకు వారికోసం వేరశనగ తోపుడు బండ్లను ఏర్పాటు చేసి అందుకు అయ్యే ఖర్చును వారే భరించే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 2వేల రూపాయలకే పంపు కనెక్షన్ ఇచ్చి పబ్లిక్ కుళాయిలను తొలగించి తాగునీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దళితవాడల్లో మహిళలు చెత్తను రోడ్లపై వేయకుండా అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను నిర్వహించి, వారికి ప్రోత్సాహాక బహుమతులను అందచేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిర్మూలించటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, ఎవరైనా ప్లాస్టిక్ సంచితో కన్పిస్తే వినియోగదారుడితో పాటు విక్రయించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్థం మధిర మెయిన్‌రోడ్డులో మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తడిచెత్త, కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్, వర్మికంపోస్టు తయారికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులను చైతన్యవంతులను చేయాలి
ఖానాపురం హవేలి, జనవరి 23: విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తూ భవిష్యత్తుపై అవగాహన కల్పించాలని గురుకుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పూర్వ విద్యార్థుల (స్వా రోస్) ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు సైతం ఇతర పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కంటే అన్ని రంగాల్లో ముందున్నారని, ఆ విషయాన్ని అందరికి తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఒక గురుకుల పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ఉన్నత స్థానానికి చేరుకున్నానని, తనతో పాటు ఈ సమావేశానికి హాజరైన అనేక మంది ఉన్నతాధికారులు సైతం ఆ పాఠశాలలో చదివిన వారేనని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సూచించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారంతా తమ పిల్లలతో పాటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండే విధంగా చూడాలని, అలాంటి సమయాల్లో అందరు ఉన్నత స్థానాల్లోకి చేరుకుంటారన్నారు. తాను గురుకుల పాఠశాలలో చదువుకొని అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నానని, ప్రస్తుత విద్యార్థులు అలాంటి సమస్యలు ఎదుర్కొకుండా ఉండేందుకు గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్య ఆవశ్యకతను విద్యార్థులకు తెలియచేయాలని, రానున్న రోజుల్లో విద్యకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో వివరిస్తూ తెలుగుతో పాటు ఇతర భాషాల పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా గురుకుల పాఠశాలల్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా పాఠశాలల్లో భవనాల నిర్మాణాలు, వసతి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తొలుత నగరంలో పూర్వ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, జడ్పీసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గురుకుల జిల్లా అధికారి మర్రిరెడ్డి, పూర్వ విద్యార్థుల చీఫ్ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్గనైజర్లు వెంకటకృష్ణ, వీరయ్య, ప్రసాద్, అర్జున్‌రావు, సూరేపల్లి కొండల్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సత్తుపల్లి బంద్ ప్రశాంతం
సత్తుపల్లి, జనవరి 23: జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్-2 బొగ్గు గని నిర్వాసితులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన సత్తుపల్లి బంద్ గురువారం విజయవంతమైంది. మధ్యాహ్నం వరకు పట్టణంలోని వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిర్వాసితులకు మద్దతు తెలిపారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ముందుగా సెలవు ప్రకటించటంతో గురువారం పాఠశాలలు తెరవలేదు. అదే విధంగా బ్యాంక్‌లు, పెట్రోల్ బంక్‌లు, సినిమాహాల్స్ మూసివేశారు. అఖిలపక్ష నాయకులు ఆర్టీసి బస్సులకు మినహాయింపునివ్వటంతో బస్సులు యథావిధిగా నడిచాయి. ఈ బంద్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లగుళ్ళ నర్సింహారావు, కంభంపాటి మల్లిఖార్జున్‌రావు, సిపిఎం నాయకులు పాండు, రాజబాబు, బిజెపి నాయకులు కూరపాటి నాగేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతనేని అప్పారావు, కూసంపుడి రవీందర్, సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ తదితరులున్నారు.
మద్దతు ప్రకటించిన సిపిఐ నేత పువ్వాడ
నిర్వాసితులకు మద్దతును ప్రకటించేందుకు సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు గురువారం సత్తుపల్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భూనిర్వాసితులను కలుసుకొని తమ పార్టీ మద్దతు నిర్వాసితులకు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. నూతన నష్టపరిహారం చట్టం అమలయ్యే వరకు రైతులకు బాసటగా సిపిఐ నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఉద్యమం మరింత ఉద్ధృతం : కపిలవాయి
సింగరేణి భూ నిర్వాసితులకు నూతన చట్టాన్ని అమలుపరిచే వరకు రైతుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తమ వంతుగా మద్దతునిస్తామని బిజెపి రాష్ట్ర మానవహాక్కుల కన్వీనర్ కపిలవాయి రవీందర్ తెలిపారు. గురువారం ఆయన సత్తుపల్లిలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ శనివారం నుంచి రైతులు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు తాను కూడా హాజరవుతానన్నారు.

లక్ష్య సాధన కోసం అన్ని అంశాలపై దృష్టి సారించాలి : కలెక్టర్
ఖానాపురం హవేలి, జనవరి 23: లక్ష్య సాధనను చేరుకునేందుకు లబ్ధిదారులను ప్రభావితపరిచే ఇతర అంశాలపై కూడా దృష్టి సారించాలని మహిళా శిశు సంక్షేమశాఖాధికారులను జిల్లాకలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. గురువారం టిటిడిసిలో ఐసిడిఎస్ అధికారులు, సిబ్బందికి జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ, విద్య, పోషకాహార లోపాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వం మన జిల్లాను ఎంపిక చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,375మంది లింక్ వర్కర్లతో పాటు జిల్లా బ్లాక్ స్థాయిల్లో మాతాశిశు సంరక్షణ, ఇమ్యూనైజేషన్, పోషకాహార కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారులను నియమిస్తామన్నారు. జిల్లాలో డివిజన్, క్షేత్రస్థాయిలో అతిపెద్ద వ్యవస్థ ఉన్న ఐసిడిఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సదస్సులో ఐసిడిఎస్ పీడి సుఖజీవన్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని
ఖమ్మం రూరల్, జనవరి 23: యువత క్రీడారంగంలో రాణించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మండలంలోని పెద్దతండా గ్రామపంచాయితీలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలేరు డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోజురోజుకూ క్రీడా స్ఫూర్తి తగ్గిపోతుందని, యువతీ, యువకులు చెడు వ్యసనాల వైపు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదన్నారు. క్రీడలు, విద్య పట్ల ఆసక్తిని పెంపొందించుకొని ఆయా రంగాలలో రాణించాలన్నారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి బత్తుల లెనిన్ మాట్లాడుతూ యువతీయువకులు దేశ భవితవ్యాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు నడుంబిగించాలన్నారు. డివైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు కొమ్మూరి నరేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా, డివిజన్ కార్యదర్శులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాసరావు, టిడిపి మండల కార్యదర్శి రాంమూర్తినాయక్, చెరుకుపల్లి సురేష్, డివైఎఫ్‌ఐ నాయకులుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సినీ పక్కీలో రైతు నుంచి నగదు చోరీ
నేలకొండపల్లి, జనవరి 23: సినీ ఫక్కీలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని ఆగంతకుడు ఓ రైతు నుంచి రూ. 25వేలను లాక్కుని ఉడాయించిన సంఘటన వెలుగుచూసింది. గురువారం నేలకొండపల్లిలో జనం అందరూ చూస్తుండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచి ముందు జరిగిన ఈ సంఘటన ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి...
ముదికొండ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రాయల రామయ్య అనే రైతు తన ఇంటి అవసరాల కోసం గురువారం నేలకొండపల్లిలోని ఎస్‌బిహెచ్ నందు గల తన ఖాతా నుంచి రూ. 25వేల డ్రా చేశాడు. ఆ నగదు తన జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళేందుకు బ్యాంక్ ముందు నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేందుకు నిలిచి ఉండగా ఇంతలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌పై తన వద్దకు వచ్చి తాను బ్యాంక్ పని చేస్తున్న అటెండర్ అని చెప్పి మీరు బ్యాంక్‌లో డ్రా చేసిన డబ్బులు దొంగనోట్లు వున్నాయని డబ్బులు కూడా తక్కువగా వచ్చాయని నిన్ను వెంటనే మేనేజర్ రమ్మన్నారని చెప్పి రామయ్యను తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. బ్యాంక్ వద్దకు రాగానే డ్రా చేసిన నగదుతోపాటు పాస్‌బుక్‌ని ఇవ్వమని అవి తీసుకున్న ఆగంతకుడు బండి స్టాట్ చేసి పరారయ్యాడు. దీంతో రామయ్య బ్యాంక్‌లోకి వెళ్లి మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసు వచ్చి సిసి కెమెరాలో రికార్డు అయిన వివరాలను నమోదు చేసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నేలకొండపల్లి ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎనె్నస్పీ భూములను
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>