Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మాఘమాసంలో మార్పులు.. చేర్పులు!

$
0
0

కర్నూలు, జనవరి 23 : జిల్లా రాజకీయాల్లో మాఘమాసం నుంచి మార్పులు, చేర్పులు ఉంటాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అంశంపై మరో వారం రోజుల పాటు చర్చకు గడువు పొడిగించడంతో శాసనసభ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అదే రోజున మాఘమాస ఘడియలు కూడా ప్రవేశించనున్నాయి. చర్చ అనంతరం శాసనసభ్యులు నియోజకవర్గాలకు చేరుకుని తమ నిర్ణయాలను వెల్లడిస్తారని పలువురు భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మినహా చాలామంది నేతలు గతంలో పోటీ చేసిన పార్టీ నుంచి కాకుండా ఈసారి వేరే పార్టీల నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో కూడా ఎక్కువగా కొత్తపార్టీ ఆధ్వర్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు సమాచారం. కాగా శాసనసభలో చర్చ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపార్టీ వస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే విభజనపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే వరకు ఖచ్చితమైన అభిప్రాయం చెప్పలేని పరిస్థితి నెలకొందని వెల్లడిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖుల రాక కోసం ఎదురు చూస్తున్న టిడిపి ప్రస్తుతానికి చర్చల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు సమాచారం. మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాప రెడ్డి టిడిపిలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. వీరే కాకుండా మరి కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని అయితే వారి చేరికపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు. కాగా విభజన నేపథ్యంలో భారీ ఎత్తున నాయకులను కోల్పోయే ప్రమాదంలో పడిన కాంగ్రెస్ పార్టీ కొత్తముఖాలను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తూనే, గతంలో పోటీ చేసి ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న వారితో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయాలన్న రాహుల్ గాంధీ సూచనను సైతం అమలులోకి తీసుకొచ్చేందుకు కొత్తగా మూడు, నాలుగు నియోజకవర్గాల్లో యువకులను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిదే తుది నిర్ణయం కావడంతో ఆయన భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైకాపా తరపున పోటీచేసే వారి జాబితా దాదాపు ఖరారైనా మైనార్టీలు, బిసిల నుంచి వస్తున్న ఒత్తిడితో జిల్లాలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై కూడా రానున్న ఫిబ్రవరి మాసంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదిఏమైనా రానున్న మాఘమాసం రాజకీయ మార్పులు, చేర్పులకు వేదిక కానుందని చెప్పవచ్చు.
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు
* కేంద్రమంత్రి కోట్ల
కోడుమూరు, జనవరి 23 : కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక సహకార సంఘం సోసైటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినా, సీమాంధ్ర నేతలంతా వేరుగా జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టినా తాను కాంగ్రెస్‌ని విడిచి పెట్టనన్నారు. అంతేగాక తనతో పాటు తన వర్గీయులు కూడా పార్టీని వదలరన్నారు. అలాగే రాష్ట్రాన్ని విడదీస్తే సహించేదిలేదన్నారు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదన్నారు. ఇటు కేంద్రంలో, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎప్పటికీ చెక్కు చెదరదన్నారు. అధికారం కోసం ప్రాంతీయ పార్టీలు ఎన్ని వచ్చినా కాంగ్రెస్‌ని ఎదురించ లేవన్నారు. అధికారం ఇవ్వాలన్నా, తిరస్కరించాలన్నా ప్రజల చేతిలో ఉంటుందన్నారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తామన్నారు. ప్రాంతీయ పార్టీల్లో పెత్తందారి తనం, బానిసత్వం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర ప్రతి ఉంటుందన్నారు. అధికారం కోసం కొంత మంది తరుచూ పార్టీలు మారడం అనవాయితీ అయిందని, అలాంటి వారికి ప్రజా ఆదరణలు లభించదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిబి లత, కాంగ్రెస్ నాయకులు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఈశ్వరరెడ్డి, రఫిక్, మాదులు, లింగమూర్తి, సవారి రాముడు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి
* స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
* సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 23 : ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలని సిబిఐ మాజీ డైరెక్టర్ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నగరంలోని మెడికల్ కళాశాల మైదానంలో వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు జి.పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వాలన, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు లక్ష్మీనారాయణ, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నగరంలో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. వివేకానందన ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. చికాగోలో జరిగిన సభలో వివేకానంద సోదరి సోదరమణులారా అని సంబోంచినందుకు ఆ సభ ప్రాంగణంలోని ఒక్కసారిగా 7 వేల మంది అమెరికన్లు 3 నిమిషాల పాటు చప్పట్లు కొట్టి వివేకానందునికి ప్రశంసలను జల్లులు కురిపించారని గుర్తు చేశారు. అరుణిమ సిన్హా అనే వాలీబాల్ క్రీడకారిణి వివేకానంద స్ఫూర్తితో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోంచి మన జాతీయ పతకాన్ని ఎగుర వేసిందన్నారు. నేటి యువత 24 గంటలు సినిమాల గురించి మాట్లాడటం వల్ల ఒరిగిందేమి లేదని, అరుణిమ సిన్హా, వివేకానంద, రామకృష్ణ పరమహంస, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయుల చరిత్రలు చదువాలని కోరారు. భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులు, గురువులు, జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. సరస్వతి విద్యాపీఠం క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సత్య శోధకుడు మహానీయుడే మన వివేకానందుడన్నారు. భగవంతుడిని చూశావా అని అందరి ప్రశ్నించా సాగగా రామకృష్ణ పరమహంస తన సందేహాన్ని నివృత్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పివివిఎస్ మూర్తి, డివిఇఓ సాలాబాయి, స్వామి వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి.సుబ్బారెడ్డి, ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, కార్య నిర్వాహకులు క్రిష్టన్న, కార్యదరిశ ఎస్.శ్రీనివాసరెడ్డి, కోశాధికారి శివ ప్రసాదరావు, సభ్యులు ఎండివి.జోగయ్య శర్మ, జికె.విజయ కుమార్, చెన్నయ్య, వాసుదేవయ్య, నాగఫణి శాస్ర్తి, అడ్వకేట్ లక్ష్మన్, బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగ నరసింహవర్మ, నాయకులు సందడి సుధాకర్, భజరంగ్‌దళ్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి, ఎబివిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శోభ యాత్ర
స్వామి వివేకానంద 150వ జయంతి ముగింపు ఉత్సవాలు సందర్భంగా యువజన సమ్మేళనానికి మందుగా విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి శోభాయాత్ర (ర్యాలీ) నిర్వహించారు. మొదటి ఊరేగింపుగా నంద్యాల రోడ్డులోని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు మెడికల్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ శోభయాత్రలో నగరంలోని వివిధ కళాశాలు, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల మైదానంలోని సభ ప్రాంగణంలో నగరంలోని వివిద పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శిరించిన నృత్యలు, గీతాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు
* జిల్లా ఉప రవాణాధికారి శివరామ్‌ప్రసాద్
ఆదోని, జనవరి 23: ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 10లక్షల 35వేల మంది మృతి చెందుతున్నందున రోడ్డు ప్రమాదాలపై ఐక్య రాజ్య సమితి తీవ్రంగా ఆందోళన చెందుంతుందని జిల్లా ఉప రవాణాధికారి శివరామ్‌ప్రసాద్ తెలిపారు. ఆర్‌ఆండ్‌బి అతిథి గృహంలో గురువారం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలను 50 లక్షలకు తగ్గించాలని ఐక్య రాజ్య సమితి తీర్మాణం చేసిందన్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలపైన ప్రజలకు, విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తు, నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి రోడ్లును అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్డు భద్రత సమీక్ష సలహా సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఉండే సలహా సంఘానికి కలెక్టర్ అధ్యక్షులుగా ఉంటూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అందులో సభ్యులుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంఘం సమావేశం ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రోడ్లు యొక్క పరిస్థితులను, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం రోడ్లుకు సైన్‌బోర్డులు వేయడం, ట్రాఫిక్ సమస్యల గురించి చర్చించి తీసుకోవాల్సిన చర్యలను ఆయా శాఖల అధికారులకు పంపడం జరుగుతుందని చెప్పారు. తీసుకున్న చర్యలపైన సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. రోడ్లు బాగా లేకుంటే రోడ్లు వేయడం అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు నిర్మించడం, ఫుట్‌వేర్స్ నిర్మించడం లాంటి చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. అధికారులకు రాసిన లేఖలపై తీసుకున్న చర్యలపైన కూడా సమావేశంలో సమీక్షిస్తామని ఆయన చెప్పారు. అలాగే ప్రమాదాలను నివారించటానికిగాను అవగాహన కల్పించడం, హెల్మ్‌ట్లు దరించకపోతే వారిపై చర్యలు తీసుకోవడం, చట్ట బద్దంగా రోడ్లుపై వాహనాలు నడకపోతే జరిమానాలు విధించడం, రోడ్డు యొక్క వివిధ అంశాలను పరిశీలించడం, వాహనాల గురించి అవగాహన ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను అనుచరించడం లాంటి అంశాలకు ప్రధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
హైవేలో ఇప్పటికే అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం, వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగితే వెంటనే వెళ్లి తొలగించటానికి క్రేన్లు ఏర్పాటు చేయడం లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. ఈ చర్యల వల్ల ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంని అన్నారు. అందువల్ల ఐక్య రాజ్య సమితి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిందని చెప్పారు. ముఖ్యంగాప్రమాదాల్లో 15 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాలు వయస్సు ఉన్న యువకులే మోటర్ సైకిళ్ళు నడుపుతూ మృతి చెందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ ప్రాంతాల్లో అవగాహన సదస్సులను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులుట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని అమలు చేయడమే కాకుండా ప్రజలకు వివరించాలని శివరామ్ ప్రసాద్ కోరారు.
జిల్లాలో ప్రైవేట్ బస్సులు బంద్...
జిల్లాలోని ఆదోనిలో 6, నంద్యాలలో 7 ప్రైవేట్ బస్సులు ఉండేవని వాటిని పూర్తిగా బంద్ చేయించామని శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వంద ప్రైవేట్ బస్సులను సీజ్ చేశామని, మరో 165 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు.
రాష్ట్రంలో హంగ్.. కేంద్రంలో కాంగ్రెస్..
* కేంద్రమంత్రి కోట్ల
ఆలూరు, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ వస్తుందని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి జోష్యం చెప్పారు. గురువారం ఆలూరులో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని, అయితే కాంగ్రెస్ నుంచి ఎదిగిన నాయకులు పార్టీలు పెట్టడంతో ఓట్లు చీలి రాష్ట్రం శాసన సభలో హంగ్ వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కురుకుంద తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రఘుప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుండయ్య, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీని వీడను...
ఆస్పరి : కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వెళ్లినా నేను మాత్రం పార్టీ వీడనని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వలోపం తప్పా పార్టీకి మాత్రం ఎలాంటి లోపం లేదన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. టిడిపి, వైకాపాలను ప్రజలు నమ్మో పరిస్థితిలో లేరన్నారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి (హగరీ) నదిపై ప్రాజెక్టును నిర్మిస్తే తాగు, సాగునీరు సమస్య తీరుతుందన్నారు. దీని కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కోట్ల సూజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేయాలని స్థానిక నాయకులు కోట్ల సూర్య దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఇంక సమయం ఉందని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేస్తామన్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీరు సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సీతారామిరెడ్డి, వీరభద్ర, వీరకుమార్‌రెడ్డి, వీరభద్రగౌడ్, చంద్రన్న, చిగలి రంగస్వామిలు పాల్గొన్నారు.
కూలీల వలసబాట
* గుంటూరుకు 300 మంది ఎమ్మిగనూరు వాసులు
ఎమ్మిగనూరు, జనవరి 23: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు గురువారం ఎమ్మిగనూరు, కందనాతి, కడివెళ్ళ గ్రామాలాకు చెందిన 300 మంది వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారు. ఈసందర్భంగా వ్యవసాయ కూలీలు రాజన్న, ఈశ్వరన్న, వెంకటరాముడు మాట్లాడుతూ ఇక్కడ పనులు దొరకడంలేదని, పొట్టకూటికోసం గుంటూరులో తాము మిల్లు పనికి పోతే రోజు రూ.200లు కూలీ ఇస్తున్నారని, దీంతో తాము వలసబాట పట్టక తప్పలేదని వారు స్పష్టం చేశారు. సిపిఐ నాయకులు బాలు మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మిగనూరుకు చెందిన చేనేత కార్మికులు వందలాది మంది తమ పిల్లలతో బెంగళూరుకు వలసబాట పట్టగా, ఇప్పుడు వ్యవసాయ కూలీల వంతువచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పెద్దకడబూరులో 50 కుటుంబాలు...
పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబళదినె్న, జాలవాడి, పెద్దకడబూరు గ్రామాల నుంచి గురువారం సాయంత్రం 50 కుటుంబాల కూలీలు ఒంగోలు పట్టణానికి వలసబాట పట్టారు. గ్రామాల్లో పనులు లేక ఉపాధి కరువై ఒంగోలు పట్టణంలో మిరప పంట తీయడానికి వలసలు వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. ఉపాధి పనికి వెళ్తే రూ.20ల నుంచి రూ.70ల వరకు వేతనం పడుతుందని, అధిక కూడా సక్రమంగా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కల్లూరు, జనవరి 23 : ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నందున ప్రభుత్వ పథకాలకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013-14 ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నందున స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం డిఆర్‌డిఎ, మెప్మా ద్వారా మహిళలకు రుణాలు అందించాలని కోరారు. అలాగే కౌలు రైతుల రుణాల రికవకీ జాబితా పంపి, త్వరగా బకాయిలు కట్టించుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వార భూమి కొనుగోలు పథకానికి 75 శాతం సబ్సిడీ వస్తుందని, ఈ పథకానికి బ్యాంకర్లు సహకరిస్తే లబ్ధిదారులు పంటలు పండించి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. బిసి సంక్షేమశాఖ ద్వారా రజకులు, నాయి బ్రాహ్మణులు, వడ్డెర్లకు ఈనెల 31 తేదీలోగా రుణాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం అండావర్, ఎపిజిబి జిఎం రంగన్న, ఎస్‌బిఐ ఎజిఎం ప్రకాష్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సారయ్య బ్యాంకు అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్యుని నిర్లక్ష్యంతో మహిళ మృతి
* నందికొట్కూరులో ఓ నర్సింగ్ హోమ్ ఎదుట బంధువుల ధర్నా
నందికొట్కూరు, జనవరి 23 : పట్టణంలోని కెజి రహదారిలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న మహిళ వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. జూపాడుబంగ్లా మండల పరిధిలోని కొత్త సిద్దేశ్వరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు భార్య సువర్ణ(40) ఛాతీ నొప్పితో గురువారం నందికొట్కూరులో డాక్టర్ అల్వాల గురువయ్య శెట్టి నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్‌లో చేరింది. ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వైద్యు డు, ఏమీ కాదని ఆరోగ్యంగా ఉందని ఏవో కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చారని రోగి బంధువులు తెలిపారు. అయితే సాయంకాలం 4 గంటల సమయంలో సువర్ణ ఆస్పత్రిలోనే తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందిందని తెలిపారు. డాక్టర్ సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే సువర్ణ మృతి చెందిందని కుమారులు, భర్త, బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వీరికి వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా ఆందోళన చేపట్టారు. దీంతో కెజి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రైనీ డిఎస్‌పి నర్మద, సిఐ శివనారాయణ స్వామి, ఎస్‌ఐ జీవన్ గంగానాథ్ బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి ఇందుకు బాద్యులైన వారిపై విచారణ జరిపి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినా డాక్టరును అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేయాలని పట్టుపట్టడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
బావిలో పడి వ్యక్తి మృతి
పెద్దకడబూరు, జనవరి 23: మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామ శివారులో బీమయ్య పొలం వద్ద బావిలో పడి నరసన్న (42) గురువారం మృతి చెందాడు. నరసన్న మూడు రోజుల క్రితం ఎమ్మిగనూరు జాతరకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. జాతరకు వెళ్తున్నాని చెప్పి వెళ్లిన నరసన్న ఇంటికి రాకపోగా బావిలో శవమై తేలడంపై బసులదొడ్డిలో విషాధచాఛాయలు అలుముకున్నాయి. మద్యం సేవించి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ జగన్‌మోహన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* కొత్తపార్టీపై వీడని ఉత్కంఠ * చర్చలు నిలిపివేసిన టిడిపి * ప్రముఖుల కోసం కాంగ్రెస్ యత్నం
english title: 
magha maasam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>