Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైభవంగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం

$
0
0

పెనుగంచిప్రోలు, జనవరి 23: కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజల్లుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు సహదేవతలతో కలిసి రంగుల మహోత్సవానికి గురువారం జగ్గయ్యపేటకు తరలివెళ్లారు. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం లో అమ్మవారికి వేదపండితులు చిట్టి చంద్రశేఖరశర్మ, కిరణ్ శర్మ, పూజారులు మర్రెబోయిన రమణ, జయల ఆధ్వర్యంలో కార్యనిర్వహణ అధికారి ఎన్ విజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి రంగుల మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన రజకులు అమ్మవారు మరియు సహదేవతలను శిరసుపై ధరించి ఊరేగింపుగా పడమట బజారు రామాలయం సెంటర్ వద్ద ఉన్న రంగుల మండపం వద్దకు చేర్చారు. ఊరేగింపు సందర్భంగా అడుగడుగునా మహిళలు వార్లు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. అలాగే ఈ ఊరేగింపులో గ్రామానికి చెందిన మహిళల కోలాటం, బేతాళ వేషధారణలు, డప్పు వాయిద్యాలు, తీన్ వార్ వాయిద్యాలు పలువురిని ఎంతగానో ఆకర్షించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పెనుగంచిప్రోలు, చిల్లకల్లు ఎస్‌ఐలు ఉమామహేశ్వరరావు, నబీలు విగ్రహాల చుట్టూ రోప్ వే ఏర్పాటు చేసి ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ జన్నిసన్, ఎండిఒ శ్రీనివాసరెడ్డి, ఆలయ ఎఇఒ చల్లా రామకృష్ణప్రసాద్, ఇఇ వైకుంఠరావు, పంచాయతీ కార్యదర్శి దాసు పాల్గొన్నారు.
ఊరేగింపుపై మహిళల ఆక్షేపణ
రెండేళ్లకు ఒక సారి జరిగే తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో భాగంగా గురువారం జరిగిన ఊరేగింపుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆలయం వద్ద 6 గంటలకు బయలుదేరిన తిరుపతమ్మ మరియు సహ దేవతలు భక్తుల దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండానే 10గంటల సమయం కల్లా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్దకు అధికారులు హడావిడిగా తీసుకురావడంపై పలువురు మహిళలు అభ్యంతరం తెలిపారు. ఊరేగింపు సందర్భంగా అమ్మవారి కట్టవలసిన చీరల విషయంలో కూడా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంపై మహిళలు కార్యనిర్వహణ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కార్యనిర్వహణ అధికారి విజయ్‌కుమార్ రంగుల మండపం వద్దకు చేరుకోగానే అమ్మవారికి మరో చీరను కట్టిస్తామని, ఊరేగింపులో భక్తులకు దర్శనం అయ్యే విధంగా నిదానంగా వెళ్లే విధంగా సిబ్బందికి ఆదేశించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రంగుల మండపం వద్ద నుండి గోపయ్య, తిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతలు ఎద్దుల బండ్లపై జగ్గయ్యపేట పయనమయ్యాయి. లాటరీలో గెలుపొందిన ఎద్దుల బండ్ల యజమానులు తమ బండ్లకు పూలదండలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా రంగుల మండపం వద్దకువచ్చి అక్కడ నుండి విగ్రహాలను తీసుకొని జగ్గయ్యపేట పయనమైయ్యారు. జగ్గయ్యపేట పయనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బండ్లకు కలిపి ప్రత్యేక రోప్‌వే ఏర్పాటు చేయడంతో పాటు జనరేటర్‌తో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యామ్నాయంగా మూడు ఎద్దుల బండ్లను కూడా అందుబాటులో ఉంచారు. బండ్ల వెంట తరలివెళ్లిన భక్తులకు రైలుకట్ట సమీపంలో దేవాలయ సిబ్బంది భోజన వసతితో పాటు మినరల్ వాటర్ సౌకర్యం కూడా కల్పించారు.

ట్రాక్టర్ ఢీకొని రైతు మృతి

వత్సవాయి, జనవరి 23: ఇసుక అక్రమ రవాణా ఒక రైతును బలి తీసుకున్న సంఘటన మండలంలోని పోలంపల్లిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన కిలారి భాస్కరరావు (27) తనకు సంబంధించిన 8 ఎకరాల పొలంలో మిర్చి, పత్తి సాగు చేస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి నీరు పెట్టాలని వెళ్తుండగా అదే సమయంలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ భాస్కరరావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాస్కరరావును ఖమ్మం తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సాయంత్రం సమయంలో మృతుడి బంధువులు మృతదేహంతో వత్సవాయి - పోలంపల్లి రహదారిలో రెండు గంటలపాటు ధర్నా చేశారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారుల వైఖరి కారణంగా భాస్కరరావు మృతిచెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి సిఐ భాస్కరరావు, చిల్లకల్లు, వత్సవాయి ఎస్‌ఐలు అబ్దుల్ నబీ, మురళీకృష్ణ, సిబ్బంది అక్కడకు చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పెళ్లి అయిన ఐదు నెలలకే భాస్కరరావు మృతి చెందాడు. భాస్కరరావు బంధువులు, వివిధ పార్టీల నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంలో
ప్రభుత్వం విఫలం
* ప్రభుత్వ మాజీ విప్ పేర్ని నాని విమర్శ
మచిలీపట్నం టౌన్, జనవరి 23: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ మాజీ విప్, వైకాపా నాయకులు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.12500లు ఇచ్చి తీరాలన్నారు. చాలీ చాలని వేతనాలతో కార్మికులు జీవితాలు మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు ధనుంజయరావు, ఎఐటియుసి నాయకులు లింగం ఫిలిప్, సిఐటియు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, కె రాజారావు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి ఈశ్వరరావు, యర్రంశెట్టి దుర్గాప్రసాద్, ఆకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌పి కాల్వలో విద్యార్థి గల్లంతు

విస్సన్నపేట, జనవరి 23: స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు చెందిన కొర్రా పండు (13) స్థానిక ఎన్‌ఎస్‌పి కాల్వకు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండలంలోని చండ్రుబట్ల లంబాడీ తండాకు చెందిన కొర్రా పండు ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఉంటూ విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగే ఉదయం భోజనం చేసి పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం పండు, అతని ఐదుగురు మిత్రులు కలిసి విస్సన్నపేట జూనియర్ కళాశాల సమీపంలోని ఎన్‌ఎస్‌పి కాల్వలో ఈతకు దిగారు. పండు నీటిలో కొంచెం లోపలికి వెళ్లాడు. అక్కడ నీటి ఒరవడి ఎక్కువగా ఉంది. మిత్రులు చూస్తుండగానే పండు నీటిలో మునిగిపోతుండడంతో మిత్రులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పండు నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు కాల్వలో గాలిస్తున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నక్కారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కృష్ణబాబు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.

అనూహ్య హంతకుల అరెస్టులో ఎన్నాళ్లీ జాప్యం

మచిలీపట్నం టౌన్, జనవరి 23: అనూహ్య హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడంలో మహారాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అఖిలపక్ష నేతలు ఎండగట్టారు. హత్య జరిగి 18 రోజులైనప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయడంలో మహారాష్ట్ర ఖాకీలు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అనూహ్య హత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీటాకీసు సెంటరులోని అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ కోనేరుసెంటరు వరకు సాగింది. కోనేరుసెంటరులో మానవహారంగా ఏర్పడి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నోబుల్, హిందూ, పద్మావతి, బాలసాయి, ఆర్‌కె, ఇంద్రకిలాద్రి తదితర కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వేలాదిగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర పోలీసుల తీరును నిరసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనూహ్య హత్యను ముక్త కంఠంతో ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఆడ పిల్లలకు భద్రత కల్పించాలని నినదించారు. అఖిలపక్ష నాయకులు కొల్లు రవీంద్ర, మోటమర్రి బాబా ప్రసాద్, లంకిశెట్టి బాలాజీ, బత్తిన దాస్, బోలెం హరిబాబు, షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, మాదివాడ రాము, అస్ఘర్, గాడెల్లి డేవిడ్ శామ్యూల్, మోదుమూడి రామారావు, దేవభక్తుని నిర్మల, లింగం ఫిలిప్, కొడాలి శర్మ, సజ్జా మూర్తిరాజు, యద్దనపూడి సోని, పామర్తి అంజమ్మ, మారుమూడి విక్టర్ ప్రసాద్, జక్కుల ఆనంద్, విజయ్, భూపతి, తదితరులు పాల్గొన్నారు.

వేగ నియంత్రణతో ప్రమాదాల అదుపు

గుడివాడ, జనవరి 23: డ్రైవర్లు వాహనాలను నడిపే సమయంలో వేగాన్ని అదుపులో ఉంచుకుని నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని గుడివాడ ఆర్టీవో డిఎస్‌ఎన్ మూర్తి అన్నారు. 25వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయ ఆవరణలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీవో మూర్తి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత కంటే జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి డ్రైవర్ పాటించాలన్నారు. ప్రధానంగా స్కూల్ బస్సులు పూర్తి కండిషన్‌లో ఉండేలా క్రమం తప్పకుండా తనిఖీలు చేసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖాధికారి హనుమంతరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాద సమయంలో డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే చాలావరకు నష్టాన్ని నివారించవచ్చని చెప్పారు. అనంతరం అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ టి జయపాల్‌రెడ్డి, ఎఎంవిఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు, డ్రెయన్ల అభివృద్ధికి స్థాయా సంఘం ఓకె

అజిత్‌సింగ్‌నగర్, జనవరి 23: నగరంలో వివిధ ప్రాంతాల్లో అధ్వాన్నంగా రోడ్లు, డ్రైయిన్ల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తూ స్థాయి సంఘం నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అండ్ విఎంసి స్పెషలాఫీసర్ రఘునందనరావు, విఎంసి కమిషనర్ సి హరికిరణ్ పేర్కొన్నారు. గురువారం జరిగిన కౌన్సిల్, స్థాయి సంఘం సమావేశంలో నగరాభివృద్ధికి చెందిన పలు అంశాలకు ఆమోదం తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో 14 పబ్లిక్ వర్కులకు అమోదించామన్నారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు కమిషనర్ హరికిరణ్ త్వరలోనే పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. స్థలానే్వషణలో ఉన్నామని, డంపింగ్ యార్డు ఏర్పాటుకు ఉన్న నిబంధనల ప్రకారం జనావాసాలకు, నదీ కాల్వలు దూరంగా ఉన్నా కొండ ప్రాంతాలను అనే్వషిస్తున్నట్లు తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలను సక్రమంగా చెల్లించని రేణుక శక్తి అనే సంస్థ వారి కాంట్రాక్ట్‌ను రద్దుచేసామని, ఇకనుంచి వారికి సక్రమంగా సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకొంటామన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలకు ముందు నెలలకు చెందిన జీతాల మొత్తాన్ని ఉద్యోగ, సిబ్బందికి అందజేసామని, ఆ రెండు నెలలకు కూడా త్వరలోనే జీతాలను మంజూరు చేస్తామన్నారు. నగరంలో వివాదాస్పదంగా ఉన్న ప్రచార హోర్డింగ్ పన్ను వసూలు కాంట్రాక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందిస్తోందని, ఈలోపు నగర పాలక సంస్థ కూడా నగరంలో ప్రచార హోర్డింగ్‌ల వలన ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని హోర్డింగ్‌లు ఉన్నాయి, వాటి స్థాయి తదితర అంశాలపై సర్వే చేయించి తగు నిర్ణయం తీసుకొంటామని, ఈలోపు పాత కాంట్రాక్ట్ వారికే సంవత్సరానికి వారు చెల్లించిన మొత్తంలో ఇరవైశాతం రుసుము ప్రతి నెలా కార్పొరేషన్‌కు చెల్లించే విధంగా మూడు నెలలపాటు తగు అనుమతులిచ్చినట్లు వారు తెలిపారు. నగరాభివృద్ధికై తీసుకోవాల్సిన నిర్ణయాలపై తగు పరిశీలన జరిపి మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమం నగర ప్రజలకు అందిస్తామని తెలిపారు. అలాగే త్వరలోనే నగర పాలక సంస్థ బడ్జెట్‌ను రూపొందించి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వన్‌టౌన్‌లోని షేక్ రాజా నగర పాలక సంస్థ హాస్పటల్‌ను వైద్య పరిషత్‌కు అప్పగిస్తూ సమావేశం తీర్మానించిందిని, ఇకనుంచి మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు.

పేదోడి పక్కగృహాలపై అదనపు భారం
అజిత్‌సింగ్‌నగర్, జనవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జి ప్లస్ త్రీ పక్కాగృహాల కేటాయింపులో లబ్ధిదారుడు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని పెంచుతూ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. గురువారం ఉదయం జరిగిన జిల్లా కలెక్టర్, విఎంసి స్పెషలాఫీసర్ రఘునందనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విఎంసి కమిషనర్ సి హరికిరణ్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలను చర్చించి ఆమోదించారు. భవన నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో రూపొందించిన అంచనాలతో ప్రస్తుతం భవన నిర్మాణం చేయడానికి వీలుకాని పరిస్థితుల్లో లబ్ధిదారుని వాటా నలభై వేల నుంచి అరవై ఆరువేల రూపాయలకు పెంచుతూ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కార్పొరేషన్ ఉద్యోగులకు 27శాతం ఐఆర్ మంజూరు, ఈద్‌గా స్థలం కేటాయిస్తూ గత కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేస్తూ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నగరంలో నిర్మించనున్న 15వేల పక్కాగృహాల నిర్మాణ లక్ష్యంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన నగర పాలక సంస్థ హౌసింగ్ ప్రాజెక్టు ఇప్పటికే వాంబేకాలనీ, జక్కంపూడి, గుణదల గంగిరెద్దుల దిబ్బ, న్యూరాజరాజేశ్వరీపేట, పాయకాపురం తదితర ప్రాంతాల్లో జి ప్లస్ త్రీ గృహాలను నిర్మించి పేదలకు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా పెరిగిన ధరల కనుగుణంగా యూనిట్ నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పెరిగిన అదనపు వ్యయంలో లబ్ధిదారుడు తనవంతుగా భరాయించాల్సి ఉంది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ లో జరిగిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం సీమక్షా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లబ్ధిదారుని వాటా పెంచుటకు నగర పాలక సంస్థ తగు నిర్ణయం తీసుకొనుటకు అవకాశం కలిగి ఉన్నందని తెలిపింది. ఈమేరుక మొత్తం 15వేల గృహాల్లో ఇప్పటి వరకూ చేపట్టిన 13,760 గృహాలలో 12,800 పక్కాగృహాల నిర్మాణం పూర్తయినాయి. ఇంకా 960 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన 12,800 గృహాలలో ఇప్పటికే 8,721 గృహాలను నలభై వేల రూపాయలను లబ్ధిదారుని వాటాగా చెల్లించుకుని కేటాయించారు. ఇంకా 5,039 గృహాలు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. 2006-2007 లో యూనిట్ కాస్ట్ లక్షా 32వేల రూపాయలుండగా ముప్పై శాతం వాటాగా లబ్ధిదారుడు నలభై వేల రూపాయలను చెల్లించడం జరిగింది. 2013-14 లో యూనిట్ కాస్ట్‌ను 2,21 లక్షలు కాగా ఇందు నిమిత్తం లబ్ధిదారుడు అరవై ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంది. నిర్మాణ వ్యయంలో 89 వేల రూపాయలు పెరగగా లబ్ధిదారునికి మరో ఇరవై ఆరు వేల రూపాయలు పెరింగింది. ఈపెంపు కేవలం రాబోయే కాలంలో పక్కాగృహాల కేటాయింపు జరిపేవారికే వర్తిస్తుంది.

హోర్డింగ్ ప్రచారాలపై పన్ను వసూలు గడువు పెంపు?
నగర పాలక సంస్థకు విస్తృత ఆదాయం సమకూర్చే విభాగాల్లో ప్రచార హోర్డింగ్‌ల విషయంలో ప్రభుత్వం నూతన విధానం ప్రకటించనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయంలో గుత్తేదారునిగా ఉన్న ప్రకాష్ ఆర్ట్ వారికి మరో మూడు నెలల గడుపు పెంచుతూ కౌన్సిల్ తీర్మానాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం వారి గడువు ముగిసినందున ఇప్పటి వరకూ వారు సంవత్సరానికి చెల్లించిన మొత్తంలో ఇరవై శాతం పెంచుతూ తీర్మానించారు. 1-12-2010 నుంచి 30-11-2013 వరకూ మూడు సంవత్సరాల పాటు ప్రకటన పన్ను వసూలు చేసుకునే హక్కు టెండర్ కం బహిరంగ వేలం ద్వారా హెచ్చు మొత్తాన్ని ఆఫర్ చేసిన ప్రకాష్ ఆర్ట్స్, విజయవాడ వారు ఐదు కోట్ల 54 లక్షల రూపాయలకు ప్రతి సంవత్సరం 15 శాతం పెంపుదలపై కేటాయించిన అధికారులు వీరి కాలపరిమితి 30-11-2013తో ముగిసింది. దీంతో రాబోయే మార్చి నెల 31 వరకూ ఇరవై శాతం పెంపుతో ప్రకటనల పన్ను వసూలు చేసుకునే హక్కు కల్పిస్తూ తీర్మానించారు.

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవ్
విజయవాడ, జనవరి 23: ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యం రఘునందనరావు వాహన చోదకులకు సూచించారు. జాతీయ రహదారి భద్రాతావారోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బందరురోడ్డులో నిర్వహించిన నూతన వాహనాలు, ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో సరైన అవగాహన కలిగి వుండాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపినప్పుడు ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వటం జరగదని తద్వారా ప్రమాదాలు కొంత మేరకు తగ్గించేందుకు దోహదపడతాయన్నారు. సమాజంలో ప్రతి పౌరుడు సంస్కారవంతులై ఇతరులను గౌరవిస్తూ రహదారి ప్రమాదాలను నివారించాలన్నారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయ ఆవరణలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నూతన వాహనాల ర్యాలీలో సుమారు 300 వాహనాలు పాల్గొనటం జరిగిందన్నారు. ర్యాలీ కార్యక్రమంలో ఆర్టీఓ సిహెచ్‌వికె సుబ్బారావు, ఎఓ టి రామమోహనరావు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు టివిఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అభిప్రాయాలెన్ని ఉన్నా...
సమైక్య ఉద్యమమే ధ్యేయం
విజయవాడ , జనవరి 23: సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని సీమాంధ్రా న్యాయవాదుల జెఏసి తీర్మానించింది. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం కూడా చేసేందుకు వెనుకాడేదీ లేదని 13జిల్లాల బార్ అసోసియేషన్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇందుకోసం విధుల బహిష్కరణ ఫిబ్రవరి 3వరకు కొనసాగించాలని నిర్ణయించారు. సమైక్యాంధ్రా ఉద్యమం కీలక దశకు చేరుకున్న నేపధ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకుగాను సీమాంధ్రా ఐక్యకార్యాచరణ కమిటి ఆధ్వర్యాన గురువారం నగరంలోని కోర్టుల సమీపంలో ఉన్న ఎఎస్ రామారావు హాలులో సీమాంధ్రా న్యాయవాదుల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్ అధ్యక్షత వహించగా పలువురు ప్రతినిధులు ప్రసంగించారు. 177రోజుల నుంచి సమైక్య ఉద్యమం కొనసాగుతోందని, 35వేల మంది న్యాయవాదులు ఉద్యమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం నడపడం ఇదే మొదటిసారని, కాగా స్వాతంత్య్ర ఉద్యమంలో సైతం న్యాయవాదులే ప్రాతినిధ్యం వహించి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణా బిల్లుపై ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపధ్యంలో విభజనను అడ్డుకునే దిశగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే క్రమంలో లాయర్ల విధుల బహిష్కరణ ఫిబ్రవరి 3వరకు కొనసాగించాలని సదస్సులో మెజార్టీ లాయర్ల నిర్ణయం మేరకు అంగీకారం తెలిపారు. విభజనపై స్పందించాల్సిన సమయంలో రాజకీయనాయకులు స్పందించనందునే ఈగతి పట్టిందని, మొదట్లోనే ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. చర్చలో రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం కోసం కాకుండా రాష్ట్ర సమైక్యం కోసం సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించబోమని సీమాంధ్రా నేతలు ఇప్పటికీ చెప్పడం శోచనీయమని, ఇది సీమాంధ్రా ప్రజల మనోభావాలు అగౌరపరడమేనని మండిపడ్డారు. వారిని ప్రజలు ఎన్నుకున్నారన్న విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు. గతంలో మహారాష్ట్ర నుంచి విదర్భను ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో తీర్మానం చేసినా దాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్రం ఎందుకు తొందర పడుతోందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు డ్రామాలు చేస్తే వారికి రాజకీయ సమాధి కడతామని, విభజన రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. ఈ సదస్సులో 13జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు ఉద్యమ కొనసాగింపుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు న్యాయవాదులు ఉద్యమం ఆపాలని వ్యక్తపరచగా, మరికొందరు లాయర్లు ఇన్ని రోజుల పాటు చేసిన ఉద్యమం వల్ల లాయర్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రుణాలుగాని, అడ్వాన్సులుగాని అందాయని, కాని న్యాయవాదులు మాత్రం తాము నష్టపోయిందేకాక తమను నమ్ముకున్న కక్షిదారులకు సైతం న్యాయం జరగడం లేనందున ఉద్యమం ఆపివేస్తే బాగుంటుందంటూ ముద్రించిన కరపత్రాలు పంచారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఎట్టకేలకు ఫిబ్రవరి 3వరకు విధుల బహిష్కరణకు సదస్సు తీర్మానించింది. ఈసదస్సులో జెఏసి కో కన్వీనర్ ముప్పాల సుబ్బారావు, సీనియర్ న్యాయవాదులు వేలూరి శ్రీనివాసరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, కృష్ణమోహన్, బ్రహ్మారెడ్డి, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, నరహరశెట్టి శ్రీహరి, లాం చిన ఇజ్రాయేలు, ఎ సుధాకరరాజు తదితరులు పాల్గొన్నారు.

‘మణప్పురం’ బంగారం గోల్‌మాల్ కేసులో
మరొకరి అరెస్టు
విజయవాడ , జనవరి 23: మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో బంగారం తస్కరించిన కేసులో రెండో నిందితుడిని గవర్నర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 253గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు సిఐ సునీల్‌కుమార్ తెలిపారు. పోలీస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గవర్నర్‌పేట పోలీస్టేషన్ పరిథిలోని మణప్పురం గోల్డ్స్ సంస్థలో ఆడిటింగ్ జరిగినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయి. ఖాతాదారులకు సంబంధించి 260గ్రాముల బంగారం అపహరించబడి దాని స్థానంలో ఉంచిన నకిలీ బంగారాన్ని సంస్థ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన మీదట ఇక్కడ పని చేస్తున్న అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ ఈదరాడ మణికంఠ అనే వ్యక్తిని 2012 డిసెంబర్ 21న అరెస్టు చేశారు. కాగా మణికంఠ అపహరించిన బంగారాన్ని తన స్నేహితుడైన కోటకొండ ముఖేష్ (32)కు ఇచ్చినట్లు సిఐ తెలిపారు. చిత్తూరుజిల్లా సద్గురు గ్రామం, బయనారెడ్డి పల్లెకు చెందిన ముఖేష్ ప్రస్తుతం నగరంలో నివాసముంటున్నాడు. ఎంబిఏ చదివిన ఇతను మార్కెటింగ్ రంగంలో పని చేసి అప్పులపాలయ్యాడు. మణికంఠ ఇచ్చిన బంగారాన్ని బందరురోడ్డు లబ్బీపేటలోని కనకదుర్గ లీజింగ్ అండ్ ఫైనాన్స్‌లో 5లక్షల 10వేలకు తాకట్టు పెట్టాడు. దర్యాప్తులో గుర్తించిన పోలీసులు తాజాగా అతన్ని అరెస్టు చేసి నిందితుని వద్ద నుంచి 253గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు సిఐ చెప్పారు. వీటిలో నాలుగు నెక్లెస్‌లు, 11 ఉంగరాలు, రెండు గొలుసులు, 12 చెవి దిద్దులు, నాలుగు గాజులు, ఒక బ్రాస్‌లెట్, ఒక లాకెట్ ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రమాదాలు తగ్గించాం
* రవాణా శాఖ ఉప కమిషనర్ శివలింగయ్య
విజయవాడ, జనవరి 23: రహదారి భద్రతా, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించే పలు కార్యక్రమాలను రవాణా శాఖ చేపట్టడం వలన ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. 25వ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం డిటిసి పిహెచ్ శివలింగయ్య తన కార్యాలయ ఛాంబర్‌లో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 2,896 ప్రమాదాలు జరిగి వాటి ఫలితంగా 752 మంది మరణించటంతోపాటు 3,654 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1408 ప్రమాదాలు సంభవించాయని, వాటిలో 325 మంది చనిపోగా 1545 మంది గాయాలపాలైనారని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009 సంవత్సరం నుండి రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2008 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46,389 మంది ప్రమాదాలు సంభవించగా వీటిలో 14,529 మంది చనిపోయారని, 2009 సంవత్సరంలో 45,977 ప్రమాదాలకుగాను 15,203 మంది మరణించారని, 2010 సంవత్సరంలో 44,570 ప్రమాదాలకుగాను 15,695 మంది చనిపోయారని, 2011లో 42,868 ప్రమాదాలకుగాను 15,100 మంది చనిపోయారని, 2012 సంవత్సరంలో 41,712 ప్రమాదాలకుగాను 14,975 మంది చనిపోవటం జరిగిందని, గత ఏడాది 2013 నవంబర్ నాటికి 40,384 ప్రమాదాలకుగాను 13,108 మంది చనిపోయారని డిటిపి వివరించారు. ద్విచక్ర వాహనాల కారణంగా ఎక్కువ ప్రమాదాలు అవగా 21.22 శాతం మేర సంభవిస్తున్నాయని, చనిపోతున్న వారిలో పాదచారులు 10.26 శాతం అధికంగా వున్నారన్నారు. ద్విచక్ర వాహనదారుల్లో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులు వున్నందున వారికి రహదారి భద్రత అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు డిటిపి శివలింగయ్య తెలిపారు.

రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్న
రెండు తలల పాము
విజయవాడ , జనవరి 23: ఖమ్మం జిల్లా నుంచి రైలులో అమ్మకానికి ఇతర ప్రదేశానికి తరలిస్తున్న రెండు తలకాయల పామును ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జిఆర్‌పి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (32) ఖమ్మం జిల్లా మధిర మండలంకు దగ్గరలో నాగార్జున సాగర్ అడవి ప్రాంతం నుంచి రెండుతలలు, ఐదు అడుగులు పొడవు గచ్చకాయ రంగు, వానపాము తరహాలో ఉన్న పామును పట్టుకుని బెల్ట్ తరహాలో గుండ్రంగా చుట్టి అట్టపెట్టెలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లో మధిర స్టేషన్‌లో ఎక్కాడు. రైలులో ఎస్కార్ట్‌గా వచ్చే జిఆర్‌పి కానిస్టేబుల్ అనుమానాస్పదంగా ఉన్న శ్రీనివాసరావును పట్టుకుని విచారించగా తనవద్ద టికెట్ లేదని విజయవాడ వెళుతున్నానని తెలిపాడు. పక్కన ఉన్న అట్టపెట్టెలో ఏమి ఉన్నాయని తెరిచి చూడగా రెండు తలల పాము ఉంది. దీనిని ఎక్కడకు తీసుకువెళుతున్నారని విచారించగా, రెండు తలలు కలిగిన పాముకు మంచి ధర పలుకుతుందని, అలాగే ఇంట్లో ఉంటే మంచిదని అలా కొన్ని ప్రదేశాల్లో ఉన్నత స్థాయి కలిగిన వారు పెంచుతారంటూ వివరించాడు. పోలీసులకు అనుమానం రావడంతో విజయవాడకు రైలు రాగానే పాముతో పాటు శ్రీనివాసరావుని జిఆర్‌పి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి అటవి శాఖ అధికారులకు పిలిపించి రెండు తలల పాముతో పాటు శ్రీనివాసరావును అప్పగించారు. అయితే అటవీ శాఖ అధికారులు ఈ పామును కొండపల్లి అడవిలో వదులుతామని చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజల్లుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ
english title: 
mahotsavam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>