Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కేంద్రీయ విద్యాలయాల్లో మెరుగైన విద్య

$
0
0

వెంకటగిరి, జనవరి 23: కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని కేంద్ర మానవ వనరుల మంత్రి ఎం పళ్లంరాజు అన్నారు. గురువారం పట్టణంలోని బొప్పాపురంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యాభివృద్ధి కోసం యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎంతో కృషి చేశారన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన వారు ఎంతో ఉన్న స్థాయిలో ఉన్నారని చెప్పారు. 25 కోట్ల మంది దేశంలో విద్యనభ్యసిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువులో ప్రతిభను చాటుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, వారి కోసం అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. వెంకటగిరిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తిరుపతి ఎంపి చింతా మోహన్ మాజీ మంత్రి అర్జున్‌సింగ్‌తో పోరాడి సాధించారన్నారు. తిరుపతి ఎంపి చింతా మోహన్ మాట్లాడుతూ వెంకటగిరి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఎంతో కష్టపడి దీనిని తీసుకొచ్చానని అన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి అటు ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా ఎంతో అభివవృద్ధి చెందుతుందన్నారు. వెంకటగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చారి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంకు ప్రహరీగోడ, సిబ్బందికి క్వార్టర్స్, కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ విద్య ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. దీనికి స్పందించిన మంత్రి అంచలంచలుగా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను వెంకటగిరి కేంద్రీయ విద్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. కాగా, కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న మంత్రికి పట్టణ విద్యార్థి జేఎసి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రంతో పోరాడాలంటూ వినతిపత్రం అందజేసి సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయాల కమిషనర్ దీక్షత్, అసిస్టెంట్ కమిషనర్ సలీమ్, గూడూరు ఆర్డీవో మధుసూదన్‌రావు, డిఎస్పీ చౌడేశ్వరీ, తహశీల్దార్ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, నాయకులు ఎల్ కోటేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
దళితులపై ఖాకీల దాష్టీకం
పోలీసులఅదుపులో తూర్పుగోగుల పల్లి మహిళలు
అల్లూరు, జనవరి 23: తూర్పుగోగులపల్లి గ్రామంలోకి గురువారం వేకువఝామున పోలీసులు ప్రవేశించి దళితులను అరెస్టు చేశారు. పోలీసులు నిరంకుశత్వంగా బాలింతలను సైతం అరెస్టు చేశారని దళితులు వాపోయారు. తెల్లవారుఝామున తమ పనులకు వెళ్ళాలని వుండగా నెల్లూరు రూరల్ డిఎస్‌పి రాంబాబు, కోవూరు సిఐ రాంబాబు, కావలి ఆర్‌డిఓ వెంకటరమణారెడ్డి, తహశీల్దార్ ఉమాదేవి, అల్లూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్ సుమారు వంద మంది పోలీసులు గ్రామంలోకి వెళ్ళి కనిపించిన మహిళలు, పురుషులను బలవంతంగా ఈడ్చుకెళ్ళి లారీలలో అల్లూరు, కోవూరుకు తరలించారు.తూర్పుగోగులపల్లి తీరప్రాంతంలో సుమారు 2200 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాగా, కొంతమంది బినామీ సొసైటీదారులు ఈ భూములపై కనే్నసి వాటిని తమ ఆధీనంలో తీసుకోగా గతంలో పనిచేసిన అధికారులు ఈ బోగస్ సొసైటీలన నిర్ధారించారు. కాగా, గత మూడు సంవత్సరాల నుంచి గ్రామ దళితులు తమ పూర్వీకుల భూములను తమకు ప్రభుత్వం కేటాయించాలని పోరాడుతూ అధికారులకు పలుమార్లు అర్జీలు దాఖలు చేశారు. ఇటీవల పది సొసైటీలకు ఆ భూములు అప్పచెప్పడంతో దళితులు ఆ భూములు తమకు చెందినవని అధికారుల ముందు గోడు వెళ్ళబోసుకొన్నారు. పాలకులు, అధికారులు, పోలీసులు ఏకమై ఆగ్రామం మీదకు దండెత్తి వచ్చి ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి సొసైటీదారులకు ఆభూములను చేసుకోండని హామీలు ఇచ్చి వెళ్ళారు. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ఎక్కడ వున్నారో తెలియక బోరున విలపించారు. పలు వాహనాలలో దళితులను తరలించి పోలీసులు దళితులను నిర్బంధంలో వుంచుకున్నారు.
దళితులను నిర్బంధించడం అన్యాయం : లాయర్ మల్లి
తమ గ్రామానికి చెందిన భూములను తమకు కేటాయించాలని ఉద్యమిస్తున్న దళితులపై పోలీసులు దాడికి పాల్పడటం మంచిది కాదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు లాయర్ మల్లి అన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా వుండాలని చూస్తుంటే పాలకులతో పోలీసులు చేతులు కలిపి ఈభూములను బినామీ సొసైటీదారులకు అప్పచెప్పేందుకు దళితులపై పోలీసులు ప్రతాపం చూపి బాలింతలని కనికరం లేకుండా ఈడ్చుకెళ్ళారని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సొసైటీదారులతో కుమ్మకై ఇలా వ్యవహరించారని ఆయన అన్నారు. దీనిపై సిఐడి చేత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
3వ విడత రెవెన్యూ సదస్సులు
విజయవంతం చేయండి: మంత్రి రఘువీరా
నెల్లూరురూరల్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పేద, బలహీనవర్గాలకు అవసరమైన రెవెన్యూ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 3వ విడత రెవెన్యూ సదస్సు విజయవంతానికి ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి రఘువీరారెడ్డి కోరారు. గురువారం రెవెన్యూ సదస్సులపై జాయింట్ కలెక్టర్, ఎస్పీతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్‌మెంట్ భూములు, ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలు, ప్రభుత్వ భూముల 7వ విడత పంపిణీ, కౌలు రైతులు తదితర రెవెన్యూ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 3వ విడత రెవెన్యూ సదస్సులు ఫిబ్రవరి 10 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయన్నారు. అందులో రెవెన్యూ పరమైన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు తహశీల్దార్, గ్రామరెవెన్యూ అధికారులు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఉండే అసైన్‌మెంట్ భూములకు సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 7వ విడత భూ పంపిణీకి ప్రభుత్వ భూములు గుర్తించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భూ పంపిణీతోపాటు లబ్ధిదారులకు పొజిషన్ ధ్రువీకరణ పత్రం కూడా అందజేయాలన్నారు. ఈప్రక్రియ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములకు సంబంధించిన పట్టాదారుపాసుపుస్తకాలు, కౌలుదారులకు రుణ అర్హత కార్డులు పూర్తి స్థాయిలో అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరిలో జరగనున్న విఆర్‌ఎ, విఆర్‌ఓ పరీక్షలకు సంబంధించి సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి అభ్యర్థులు దళారులను ఆశ్రయించకుండా ప్రతిభ ద్వారా పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. దళారులపై కలెక్టర్లు, కింది స్థాయి అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందిస్తామన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ లక్ష్మికాంతం. జిల్లా ఎస్పీ రామకృష్ణ, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి, నాయుడుపేట ఆర్డీవోలు సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, మధుసూధనరావు, కోదండరామిరెడ్డి, రమణారెడ్డి, రమణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు : జెసి
కోట, జనవరి 23: రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. మండలంలోని తినె్నలపూడి, సిద్దవరం, వూనుగుంటపాళెం సహకార పరపతి సంఘాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను దళారుల మోసాల నుంచి కాపాడేందుకే ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ రబీ సీజన్‌లో రైతులు పంపించిన ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందన్నారు. 1010 రకాలకు సంబంధించిన సాధారణ రకానికి క్వింటాకు 1310 రూపాయలు, గ్రెడ్- ఎ రకానికి 1345 రూపాయలు, నెల్లూరు జిలకరకు మద్దతు ధర కల్పిస్తోందన్నారు. బిపిటి, పెద్ద జిలకర ధాన్యానికి ప్రభుత్వం ఇంకా మద్దతు ధర ప్రకటించలేదని ఓప్రశ్నకు సమాధానం చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా దళారులు ప్రభుత్వ మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆయన వెంట తహశీల్దార్ చెన్నయ్య, సర్పంచ్ కోట రాఘవయ్య, సంఘబంధం సభ్యులు, రైతులు, సొసైటీల కార్యదర్శులు, వ్యవసాయాధికారి ఉన్నారు.
సంగంలో ..
సంగం: రబీ సీజన్ ప్రారంభదశలో సంగం మండలంలో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం డివిజన్ ఆర్డీవో కోదండరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం మండలంలో 11 వందల హెక్టార్లకు సంబంధించి వ్యవసాయం సాగుబడి అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ధాన్యం గిట్టుబాటు ధరకే అమ్ముకునేందుకు ప్రభుత్వం తరఫున ఈకేంద్రాలు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా దువ్వూరు, మర్రిపాడు, సంగం పట్టణంలో రెండు కేంద్రాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విధానాల ప్రకారం 17 శాతం నెమ్ము, ఒక శాతం ధూళి దుమ్ము ఉన్నా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఫిబ్రవరి మొదటి నుండి డెల్టాప్రాంతంలోని ధాన్యాన్ని కొనుగోలు చేసుకునేందుకు ఎ గ్రేడ్ ధాన్యం రకం 1150 రూపాయల వంతున క్వింటా ఉంటుందని తెలిపారు. ఎ గ్రేడు పుట్టి ధాన్యం కొనుగోలు 11565 రూపాయలు ఉంటుందని, బి గ్రేడు రకం ధాన్యం 11100 ఉంటుందని తెలిపారు. ఇంత కన్నా బయటు గిట్టుబాటు ధర అధికంగా ఉంటే రైతులు అమ్ముకోవచ్చని అన్నారు. ధాన్యం కేంద్రాలలో రైతులకు అవసరమైన గోతాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో మండల తహశీల్దార్ కేదార్‌నాధ్ శ్రీకాంత్, దువ్వూరు సొసైటీ అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ సూరి, వ్యవసాయాధికారిణి, సంగం సింగిల్‌విండో అధ్యక్షుడు పి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:ఆర్డీఓ
నాయుడుపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్డీవో మున్నంగి వెంకటరమణ స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని లోతువాని గుంటలో గల పిఎసిఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. దళారుల మోసాలకు పాల్పడే అవకాశం ఉండడంతో, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన ధర పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు పి.జనార్ధనరావు, వ్యవసాయాధికారి నాగమోహన్, ఎన్‌డిసిసిబి డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, ఎఎస్‌వో లక్ష్మణరావు, సిఎస్‌డిటి కాంతయ్య ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

23 ఎన్‌వైపి 1: సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ఎంవి.రమణ
సోమశిల అడవుల్లో కూంబింగ్
ఆత్మకూరు, జనవరి 23: సోమశిల అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమశిల, మల్లెంకొండ అడవుల్లో, గుడిగుంట బీట్ పరిధిలోని ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణాను అదుపుచేసే నిమిత్తం ఈ కూంబింగ్ చేపడుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఒక ఆర్‌ఎస్సైతో సహా పాతిక మంది కానిస్టేబుళ్లు ఈ ప్రక్రియలో రెండురోజులకుపైగానే విధులు నిర్వహిస్తున్నారు. నక్సల్స్ అదుపుకోసం అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటం ఆనవాయితీ. ప్రస్తుతం అటవీశాఖతో నిమిత్తం లేకుండా పోలీసులే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సోమశిల జలాశయంలో చేపల వేట నిమిత్తం వెళ్లే జాలర్ల ముసుగులో కూడా ఎర్రచందనం దొంగలు పెట్రేగి పోతుండటం తెలిసిందే. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రాజకీయ ప్రమేయాన్ని నివారిస్తేనే ఇలాంటి కూంబింగ్ ప్రక్రియలకు సార్ధకత చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే
రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
గూడూరు, జనవరి 23: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణి కందుల చౌడేశ్వరీ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ప్రమాదాలపై రూపొందించిన లఘు చిత్రాన్ని గురువారం సాయంత్రం స్థానిక పాత బస్టాండ్ కూడలి ప్రాంతంలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎంతో విలువైన ప్రాణాలను కేవలం నిర్లక్ష్య డ్రైవింగ్ వలన కోల్పోతున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖ ట్రాఫిక్‌పై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించనున్నట్లు, దీంతో పాటు పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లు, లోకల్ ఛానల్స్‌లో కూడా వీటిని ప్రదర్శిస్తామన్నారు. రోడ్డు భధ్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సై ఎస్‌కె షరీఫ్, పిఎస్సై వీరనారాయణ ఉన్నారు.

నిలిపివున్న లారీలో
డ్రైవర్ అనుమానాస్పద మృతి
క్లీనర్ పైనే అనుమానం
దగదర్తి, జనవరి 23: మండలంలోని సున్నపుబట్టి టోల్‌ప్లాజా సమీపంలోగల ఒక డాబా వద్ద నిలిపివున్న లారీలో అందులో వున్న డ్రైవర్ పశ్చిమబెంగాల్‌కు చెందిన శంకర్ సింగ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది వుండగా విషయం గురువారం సాయంత్రం వెలుగుచూసింది. బుధవారం ఉదయం టైర్ల లోడుతో గల లారీ అక్కడికి రాగా అప్పటి నుంచి నిలిపే వుండగా దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించారు. పరిశీలించగా మృతదేహం వున్నట్లు గుర్తించి దగదర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన బుచ్చి సిఐ సాంబశివరావు, ఎస్‌ఐ సుబ్బారావు వివరాలు సేకరించారు. చెన్నై నుంచి 21వ తేదీన టైర్ల లోడుతో బయలుదేరగా, ఉదయం అక్కడ ఆగిందని అందులో డ్రైవర్ శంకర్‌సింగ్‌తో పాటు అతని స్నేహితుడైన మరో వ్యక్తి క్లీనర్‌గా వున్నట్లు గుర్తించారు. అయితే డ్రైవర్‌తో పాటుగా సుమారు 25వేల రూపాయలు నగదు వున్నట్లుగా సంబంధిత వాహన యాజమాని పోలీసులకు చెప్పగా, అందులో క్లీనర్‌తో పాటు నగదు లేకపోవడంతో క్లీనర్‌పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతిచెంది వున్న వ్యక్తిపై గాయాలు వుండటంతో అతన్ని చంపి ఆ నగదును తీసుకొని వెళ్ళివుంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవిషయమై ఎస్‌ఐ సుబ్బారావును సంప్రదించగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
సాగునీటి కోసం రైతుల
ఆందోళన
బిజెపి నాయకుల మద్దతు
వెంకటాచలం, జనవరి 23: సాగునీటి కోసం మండలంలోని చవటపాలెం, తానుకూరు, వెంకటకృష్ణాపురం, శ్రీరాంపురానికి చెందిన రైతులు గురువారం నందలపాడు వద్ద గల బండేపల్లి కెనాల్‌పై సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. బండేపల్లి రైతులకు సాగునీటి కోసం మనుబోలు వద్ద రోడ్డుపై బైఠాయించడంతో కలెక్టర్ శ్రీకాంత్ వారికి ఇచ్చిన హామీ మేరకు సాగునీరు విడుదల చేశారు. ఆ నీటిని తమ పొలాలకు మళ్లించుకొనేందుకు రైతులు కాలవ తూము చెక్కలను ఎత్తేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న డిఇ సమీవుల్లా, జెసి వీరస్వామి అక్కడకు చేరుకుని రైతులు చేపట్టిన నీరు తరలించే కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. బండేపల్లి ఆయకట్టు చేరాల్సిన సాగునీటిని మధ్యలో తరలిస్తే, అక్కడ ఆయకట్టు నీరు అందదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తూము చెక్కలు ఎత్తడం కుదరదని వాదించడంతో రైతులు అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెంకటాచలం ఎస్‌ఐ సోమయ్య తన సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులు, అధికారుల మధ్య సమన్వయపరిచి ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించారు. బిజెపి తిరుపతి పార్లమెంటు ఇన్‌చార్జ్ మురళి రైతులకు అండగా నిలిచి అధికారులతో మాట్లాడారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని వాపోయారు. ప్రస్తుతం పైరు వెన్ను దశలో ఉన్నందున నీరు పుష్కలంగా ఉండకపోతే అగ్గితెగులు సోకి పంట నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే సాగునీరు అందించాలని ఆయన అధికారులను కోరారు. దీంతో స్పందించిన డిఇ మూడు రోజుల తరువాత సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎస్‌సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సి ఆదినారాయణ, మండల వైసిపిఆర్ నాయకులు చెంచు కిష్టయ్య నాయుడు, రైతులు వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అన్నమేడు సొసైటీకి మీ-సేవా కేంద్రం మంజూరు..!
నాయుడుపేట, జనవరి 23: మండల పరిధిలోని అన్నమేడు ప్రాధమిక వ్యవసాయ సంఘానికి త్వరలో మీ- సేవా కేంద్రం మంజూరు కానున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి అన్నారు. గురువారం అన్నమేడు పిఎసిఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం పారంభోత్సవానికి ముఖ్య అథిదిగా వచ్చిన ఆయన మాట్లాడారు. రైతులు తమకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఇక తమ గ్రామం నుండే పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నాగమోహన్, బ్యాంకు అధికారులు పంచాయితి సర్పంచ్ వెంకటేశ్వర్లు, రైతలు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>