Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అమల్లోకి వచ్చిన విద్యుత్ కోతలు

$
0
0

ఒంగోలు, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌కోతలు గురువారం నుండి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం పెంచిన విద్యుత్ కోతలతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చలికాలంలోనే విద్యుత్ కోతలను ప్రభుత్వం భారీగా విధిస్తే వేసవికాలంలో ఇంకెంత దారుణంగా ఉంటుందోనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తవౌతోంది. ప్రభుత్వం విధించే అధికారిక కోతలతోపాటు అనధికార కోతలు కూడా అమలులోకి రానున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు చీకట్లో మగ్గనున్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వం పెంచిన కోతల ప్రకారం గ్రామాల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఆరు గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదుగంటల వరకు, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు, మునిసిపాలిటీల పరిధిలో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు కోతలను విధించనున్నారు. కాగా వ్యవసాయ రంగానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్‌ను రెండు విడతలుగా సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలోమాత్రం మూడు నుండి నాలుగుసార్లు విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా రైతులు ఉచిత విద్యుత్‌కోసం రాత్రింబవళ్ళు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వేరుశనగ, వరి, మిర్చి, పొగాకు, కూరగాయలు, బొప్పాయి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. కోస్తా తీరప్రాంతంలోని వేలాది ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు సాగుచేశారు. దీంతో విద్యుత్ సరఫరా ఎప్పుడు చేస్తారో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుండి రాత్రి ఆరు గంటల వరకు విద్యుత్ కోతలను విధిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పగలే కాకుండా అనధికారికంగా రాత్రివేళల్లో కూడా విద్యుత్‌కోతలను అమలుచేసే అవకాశాలుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలవైపు పరుగులు తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేలాది రూపాయలు వెచ్చించి సోలార్ సిస్టంలను, ఇన్వర్టర్లను కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ కోతలతో ఒంగోలు కార్పోరేషన్, మునిసిపాలిటీల్లోని ప్రజలకు దోమల బెడద ఎక్కువ కానుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అధికారపక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చలికాలంలో విద్యుత్‌కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము కూర్చున్న కొమ్మను తామే నరుకున్న చందంగా ఉందని అధికారపక్షనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శనగలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి
ఎపి రైతు సంఘం డిమాండ్
ఒంగోలు, జనవరి 23 : రాష్ట్రంలో రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావుల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రావుల వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో గత రెండు సంవత్సరాలుగా 25 లక్షల క్వింటాళ్ళ శనగ నిల్వలు ఉన్నాయని, తిరిగి శనగ పంట మళ్లీ చేతికొస్తోందని తెలిపారు. రైతులకు సంబంధించిన శనగలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయన్నారు. ప్రభుత్వ మార్కెట్ రేటు ప్రకారం కనీసం మూడు వేల రూపాయలు ధర నిర్ణయించగా ప్రస్తుతం క్వింటాకు 2200 రూపాయలు ధర మాత్రమే వస్తోందని ఆయన తెలిపారు. ఎకరాకు 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు ఖర్చు అవుతోందన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల ప్రకారం రైతుకు గిట్టుబాటు ధరలు రావాలంటే కనీసం ఐదు వేల రూపాయలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందన్నారు. ప్రభుత్వం క్వింటా శనగలకు 5 వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర దేశాల నుండి శనగలను దిగుమతి చేసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించి కేవలం 10 కోట్లు మాత్రమే నిధులను కొనుగోళ్ళకు విడుదల చేసిందని తెలిపారు. అయితే క్వింటాకు ఎంత ధర ఇచ్చి కొనుగోలు చేసే విషయాన్ని స్పష్టంగా తెలియజేయలేదన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కేటాయించిన 75 కోట్ల రూపాయలు శనగల కొనుగోలుకు ఏమాత్రం సరి పోవని, వంద కోట్లకు పైగా నిధులు ఇస్తేనే రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను కొంతమేరకైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారంలో శనగ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఛలో హైదరాబాద్ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పండించిన ఏ పంటకు కూడా ఈ ప్రభుత్వ కాలంలో గిట్టుబాటు ధరలు రావడం లేదని ఆయన విమర్శించారు. బ్యాంకులు కూడా రైతులకు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు మాత్రం కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ అప్పులను వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కెవివి ప్రసాద్, కార్యదర్శి వి హనుమారెడ్డిలు మాట్లాడుతూ, జిల్లాలో 15 లక్షల శనగ నిల్వలు ఉన్నాయని గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. రానున్న పొగాకు ఉత్పత్తికి కూడా వేలం కేంద్రాల్లో గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

పుల్లలచెరువు హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు
ఒంగోలు, జనవరి 23: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి రాజశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా నిర్మించిన మరుగుదొడ్డి పైకప్పు కూలి 6వ తరగతి చదువుతున్న మేడికొండ నరేంద్ర (12 ) అనే విద్యార్థి బధవారం మరణించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

‘అక్కినేని జీవితం ఆదర్శప్రాయం’
అద్దంకి, జనవరి 23: కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినీ జగత్తుకు పెద్దదిక్కైన అక్కినేని నాగేశ్వరరావు మరణం కళారంగానికి తీరనిలోటని మోటుపల్లి రామదాసు అన్నారు. ఎఎన్‌ఆర్, అంజలి మృతిని పురస్కరించుకొని గురువారం అద్దంకి సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సంతాపసభ ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్‌ఎన్‌ఆర్, అంజలి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఘంటసాల గానభారతి అధ్యక్షుడు మోటుపల్లి మాట్లాడుతూ తెలుగు సినీ జగత్తులో మూడు దశాబ్దాల పాటు ఏకచక్రాధిపత్యంగా విరాజిల్లిన ఇద్దరు మహానుభావులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు జనవరి నెలలోనే అశువులు బాశారన్నారు. స్ర్తి వేషంతో నాటకాల్లో అలరించి తదుపరి హీరో పాత్రలో సినిమాల్లో నటించి ప్రజలను మెప్పించారన్నారు. ఆయన జీవితం మొదటి నుండి క్రమశిక్షణతో కూడుకున్నదని, ఆయన జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శవంతమైనదన్నారు. అన్నమనేని వెంకట్రావు మాట్లాడుతూ పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో ఏ పాత్రకైనా సిద్ధమేనంటూ ఇతర నటులతో ఆరోగ్యవంతమైన పోటీగా ఉత్తమమైన నటనను అందించిన ఘనత ఎఎన్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. మూడు తరాల నటీనటులతో కళారంగానికి ఆయన చేసిన సేవకుగాను ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించిందన్నారు. ఇలాంటి ఉత్తమమైన కళాకారుని జీవితం అజరామరమని, ఆదర్శప్రాయమని కొనియాడారు. రామాయణంలో సీతగా నటించి ప్రజాభిమానాన్ని పొందిన నటి అంజలి మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. రామాయణాన్ని మరోమారు కొత్త టెక్నాలజీతో తీసినా ఆనాటి నటి అంజలి నటన ముందు పెదవివిరుపేనన్నారు. సంస్కారవంతమైన పాత్రలతో నటించిన నాటితరం నటీనటులు నేటితరానికి అదర్శవంతమన్నారు. ఈకార్యక్రమంలో అన్నమనేని వెంకట్రావు, ప్రసాదరావు, రఘనాధశర్మ, దేవపాలన, కొల్లా రామాంజనేయులు, రావూరి రంగయ్య, గాడేపల్లి దివాకర్‌దత్తు, చందలూరి నారాయణ తదితరులు పాల్గొని దివంగతులకు ఘనంగా నివాళులు అర్పించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే
సిబ్బందిపై చర్యలు:ఎస్‌పి
ఒంగోలు, జనవరి 23: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గత డిసెంబర్ 17వ తేదీన చీరాల, వేటపాలెం ఓడరేవుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుండి డబ్బులు వసూలు చేసిన ఘటనలో చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో నివేదిక మేరకు అదే పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ ఎం బాలశంకర్‌రావు, ఎం శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. గత డిసెంబర్ 23వ తేదిన హైదరాబాద్ చర్లపల్లి జైలు నుండి పొదిలి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న రిమాండ్ ఖైదీ చప్పిడి రాజేష్ హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుండి పారిపోయిన ఘటనలో పొదిలి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నివేదిక మేరకు అదే పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న జి శ్రీనివాసులు, ఎస్‌డి హుస్సేన్ బాషాలను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
‘గ్రామాల అభివృద్ధికి సహకరించండి’
ముండ్లమూరు, జనవరి 23: గ్రామంలోని ప్రజలందరూ ఐకమత్యంతో పని చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని డిపివో శ్రీదేవి కోరారు. మండలంలోని ఈదర గ్రామంలో ఈదర, కొమ్మవరం గ్రామాలకు వేలంపాట నిర్వహించారు. ఈదర చెరువుకు మద్దతు ధర రాలేదని పాటను వాయిదా వేశారు. కొమ్మవరం చెరువుకు 11 లక్షల 50 వేల రూపాయలకు గురుస్వామిరెడ్డి పాట పాడి చెరువువేలంపాటను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎల్‌పివో సుమతీకళ, ఈవోఆర్‌డి హనుమంతరావు, సర్పంచ్ సుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
జీవిత ఆశయానికి తొలిమెట్టు పదవ తరగతి
* సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు కలెక్టర్ సూచన
మార్కాపురం, జనవరి 23: విద్యార్థుల జీవిత ఆశయానికి తొలిమెట్టు పదవ తరగతి అని, ఈ పరీక్షలకు ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లాకలెక్టర్ విజయకుమార్ సూచించారు. స్థానిక శామ్యూల్‌జార్జి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్షేమ వసతిగృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చదువుపై శ్రద్ధ చూపకపోయినప్పటికీ జీవిత ఆశయసాధనకు మరో 60రోజుల సమయం ఉన్నందున ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం రాష్ట్రప్రభుత్వం వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, విద్య చెప్పిన ఉపాధ్యాయులకు, వసతిగృహాల్లో పనిచేసే వార్డెన్లకు మీవలన ఎలాంటి ఉపయోగం లేకున్నప్పటికీ మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యను అభ్యశించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లావిద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం జిల్లాకలెక్టర్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిరక్షరాస్యత కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, 60రోజులపాటు కష్టపడి చదివితే విజయం మనలను వరిస్తుందని అన్నారు. ఏదిఏమైనా త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈకార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జిల్లా సంక్షేమాధికారి కమలా, జిల్లా వెనుకబడిన సంక్షేమాధికారి మయూరి, మార్కాపురం ఆర్డీఓ ఎం సత్యనారాయణ, తహశీల్దార్ బి సత్యనారాయణ, డివిజనల్ సంక్షేమశాఖ అధికారి దిబ్బయ్య, పలువురు వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

స్వార్థచింతన లేకుండా అక్షరాలు నేర్పడం అభినందనీయం
* అక్షర విజయం కార్యక్రమంలో కలెక్టర్ విజయకుమార్
మార్కాపురం, జనవరి 23: స్వార్థ చింతన లేకుండా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పడం అభినందనీయమని జిల్లాకలెక్టర్ విజయకుమార్ అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అక్షర విజయం 100రోజుల కార్యక్రమంలో 40రోజుల కాలం ముగిసిందని, మిగిలిన 60రోజులపాటు వలంటీర్లు, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాను చదువుకోవడం గొప్పకాదని, చదువురాని వారికి అక్షరాలు నేర్పించడం గొప్పవిషయమని అన్నారు. డబ్బులు పదిమందికి పంచితే తగిరిపోతాయని, చదువు ఇతరులకు నేర్పితే అక్షరాస్యతా శాతం పెరుగుతుందని అన్నారు. వారంపాటు ప్రణాళికబద్ధంగా వ్యవహరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు. నిరక్షరాస్యులకు కేవలం సంతకాలు నేర్పడంమే కాకుండా చదవడం, రాయడం నేర్పించాలని వలంటీర్లకు సూచించారు. చదువులేకపోవడంతో అనేకమంది నిరక్షరాస్యులు మోసాలకు గురై నష్టపోతున్నారని, ఏ కార్యాలయానికి వెళ్ళినా సంతకం చేయమని అడుగుతున్నారని, ప్రతిఒక్క నిరక్షరాస్యుడు అక్షరకేంద్రాలకు వెళ్ళి విద్య నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకునే సమయంలో కూడా ఎంత తీసుకుంటున్నారు, ఎంత కడుతున్నాము, వడ్డీ ఎంత అనే విషయాలపై అవగాహన లేకపోవడంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
* ఆ వికలాంగుడు సైనికుడిలా పని చేస్తున్నాడు..
తర్లుపాడు మండలానికి చెందిన ఏకాసి రాముడు రెండుచేతులు లేని వికలాంగుడైనప్పటికీ తనకు ఉన్న అక్షర జ్ఞానంతో ఇతరులకు అక్షరజ్ఞానం కల్పించేందుకు సైనికుడిలా పని చేస్తున్నాడని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్షర విజయం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అధికారులను, వలంటీర్లను కోరారు. చదువు నేర్చుకోవడం వయస్సుమీరిన వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ అలాంటివారికే చదవడం, రాయడం నేర్పిస్తే ఇది ఒక మహాత్తర ఉద్యమంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ అక్షర విజయం తమకు వరంగా మారిందని, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న కలెక్టర్ విజయకుమార్ అభినందనీయులని అన్నారు. ఈకార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ ఎం సత్యనారాయణ చదువురాని అల్లుడు.. అత్తగారి ఇంట్లోపడిన కష్టాలను పద్యరూపంలో వివరించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పిడి పోలప్ప, మైనార్టీ ఇడి నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ కోటేశ్వరరావు, డిఇఓ రాజేశ్వరరావు, విద్యుత్‌శాఖ డిఇ ఆల్ఫాన్స్, తహశీల్దార్లు బి సత్యనారాయణ, సావిత్రి, పద్మావతి, విద్యాసాగరుడు, ఎంపిడిఓలు హనుమంతరావు, రామయ్య, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మార్కాపురం ఎంఇఓ సిహెచ్‌పి వెంకటరెడ్డి, ఎంసిఆర్‌డిఓ వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులికి తీవ్రగాయాలు
పెద్దదోర్నాల, జనవరి 23: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం జరిగింది. ఫారెస్టు రేంజర్ శ్రీనివాస్ కధనం మేరకు పెద్దదోర్నాల ఫారెస్టురేంజ్ పరిధిలోగల చిట్టెద్దులకురవ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులికి వెనుక రెండుకాళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్ళి చిరుతపులిని ప్రభుత్వ పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్సలు చేయించారు. అనంతరం హైదరాబాద్ జ్యూ పార్కుకు ఆ చిరుతపులిని తరలించినట్లు తెలిపారు. డిఆర్‌ఓ రామచంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నూనె గింజల ఉత్పత్తిపై రైతులకు అవగాహన ఉండాలి
* వ్యవసాయ శాస్తవ్రేత్తలు
కొమరోలు, జనవరి 23: నూనె గింజల ఉత్పత్తిపై హైదరాబాద్‌కు చెందిన వ్యవసాయ శాస్తవ్రేత్తలు జిడి సతీష్‌కుమార్, అజిత్ ఖురేషీ గురువారం మండలంలోని రైతులకు అవగాహన కల్పించారు. రీడ్స్ సంస్థ అధ్యక్షులు సత్యభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థకు చెందిన శాస్తవ్రేత్తల బృందం మండలంలోని మూలపల్లి, బొడ్డువానిపల్లి, బావాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా శాస్తవ్రేత్తలు ట్రైబల్ ఉపప్రణాళిక ద్వారా ఎస్టీ రైతులకు పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ తదితర పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ రూపొందించిన డిఆర్‌ఎస్‌హెచ్-1 సంకరజాతి పొద్దుతిరుగుడు వంగడాన్ని రైతుక్షేత్రాల్లో వారు ప్రదర్శించారు. పొద్దుతిరుగుడు పంటలో ఉండాల్సిన సమగ్ర పోషక నిలువలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటసాగులో రైతులకు సరైన అవగాహన లేకపోవడం వలన మొక్కల సాంద్రత ఎక్కువగా ఉందని, మొక్కలకు పోషకాల నిల్వలు సక్రమంగా అందడం లేదనే విషయాలను తాము గ్రహించామని పరిశీలకులు తెలిపారు. అనంతరం పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించి డిఆర్‌ఎస్‌హెచ్ సంకరజాతి వంగడం ద్వారా పంట 105 నుంచి 110రోజుల్లోపు కోతకు వస్తుందని, రబీలో సదరు పంట దిగుబడి ఎకరాకు 10క్వింటాళ్ళమేర పొందవచ్చునని తెలిపారు. ఆసక్తిగల రైతులు జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా విత్తనాలను పొంది పంటసాగు చేసుకోవచ్చునని తెలిపారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ ఈశ్వరనాయుడు, రైతులు పాల్గొన్నారు.

గ్రామాల్లో 12, ఒంగోలులో గంటన్నర, మున్సిపాలిటీల్లో నాలుగు, మండల కేంద్రాల్లో ఏడు గంటలు ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>