శ్రీకాకుళం, జనవరి 23: జిల్లా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఎస్‌ఐల బదిలీలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో పనిచేస్తున్న సుమారు 28 మంది ఎస్‌ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా, విశాఖ రేంజ్ పరిధిలో జిల్లాకు కేటాయించిన 31 మంది ట్రైనీ ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఇస్తూ ఎస్పీ నవీన్ గులాఠీ ఉత్తర్వులు జారీచేశారు. వీరు కాకుండా జిల్లాలో రేగిడి ఆమదాలవలస, కవిటి, పాతపట్నం, నందిగాం, కోటబొమ్మాళి, కంచిలి, నౌపడ, సీతంపేట, పొందూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్‌ఐలను విశాఖ సిటీకి బదిలీచేశారు. మిగిలిన 28 మంది ఎస్‌ఐలలో సంతబొమ్మాళిలో ఇప్పటివరకు పనిచేస్తున్న బి.ప్రసాదరావు, బత్తిలి పిఎస్‌లో పనిచేస్తున్న డి.సత్యారావు, దోనుబాయి ఎస్‌ఐ కె.శాంతారాంను శ్రీకాకుళంలో వెకెన్సీ రిజర్వులో ఉంచారు. వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్న ఎస్.తాతారావు సిసిఎస్‌కు, జి.వి.రమణను జలుమూరు నుండి ఆమదాలవలస, పి.సత్యన్నారాయణ పోలాకి నుండి శ్రీకాకుళం ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. ఎస్.అప్పలరాజు శ్రీకాకుళం ట్రాఫిక్ నుండి సిసిఎస్‌కు, ఎన్.కర్రయ్య శ్రీకాకుళం ట్రాఫిక్ నుండి పిసిఆర్, యం.శ్రీను హిరమండలం నుండి శ్రీకాకుళం రూరల్, సిహెచ్ గోవిందరావు బారువ నుండి పిసిఆర్, ఎన్.కామేశ్వరరావు కొత్తూరు నుండి రేగిడి ఆమదాలవలస పోలీసు స్టేషన్లకు కేటాయించారు. బి.తులసీరావు జి.సిగడాం నుండి డిఎస్‌బి, ఐ.రామారావు లావేరు నుండి సిసిఎస్, సిహెచ్ సూర్యనారాయణ వంగర నుండి పిసిఆర్ ఎల్.చంద్రశేఖర్ మందస నుండి పాలకొండ, ఎస్.శ్రీనివాసరావు సిసిఎస్‌కు బదిలీ అయ్యారు. సారవకోటలో పనిచేస్తున్న బి.శ్రీరామమూర్తి డిసిఆర్‌బికి, బి.మంగరాజు ఆమదాలవలస నుండి శ్రీకాకుళం ట్రాపిక్‌నకు, ఎ.నాగేశ్వరరావు సంతకవిటి నుండి కాశీబుగ్గ రెండో ఎస్‌ఐగా బదిలీ అయ్యారు. యం.రత్నారావు వీరఘట్టాం నుండి సిసిఎస్, విఆర్‌లో ఉన్న బి.కృష్ణమూర్తి డిఎస్‌బి, ఇచ్ఛాపురం రూరల్‌లో పనిచేస్తున్న ఇ.చిన్నంనాయుడు గార, శ్రీకాకుళం టూ టౌన్‌లో పనిచేస్తున్న ఎస్.దుర్గారావు పిసిఆర్‌కు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం టూటౌన్‌కు ఇచ్చాపురం టౌను నుండి డి.రాము, డిపిటిసికి గారలో పనిచేస్తున్న బి.నారీమణి, శ్రీకాకుళం ఉమన్ పోలీస్ స్టేషన్‌కు పాలకొండ నుండి ఎం.వినోద్‌బాబు, మెళియాపుట్టి నుండి పొందూరుకు ఆర్.హెచ్.ఎన్.వి.కుమార్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం టూటౌన్‌లో పనిచేస్తున్న ఎం.లక్ష్మణరావును వి ఆర్‌లో ఉంచారు. వీరు కాకుండా ఇటీవల ప్రోబేషన్ పూర్తిచేసుకున్న ఎస్‌ఐలు జి.రాజేశ్, డి.విజయ్‌కుమార్, వై.క్రిష్ణ, సిహెచ్.రామారావు, కె.వెంకట సురేష్, కె.రవి కిషోర్, కె.వాసునారాయణ, కె.రామకృష్ణ, వి.రమేష్, వి.సత్యన్నారాయణ, వి.సందీప్‌కుమార్, ఇ.శ్రీనివాస్, సిహెచ్.ప్రసాద్, వి.శ్రీనివాసరావు, జి.్భస్కరరావులను నౌపడ, జలుమూరు, సంతబొమ్మాళి, బత్తిలి, కంచిలి, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, దోనుబాయి, కొత్తూరు, పోలాకి, మెళియాపుట్టి, హిరమండలం, నందిగాం, సీతంపేట, జి.సిగడాం స్టేషన్లకు కేటాయించారు. ఇచ్చాపురం రూరల్, కవిటి, లావేరు, వంగర, మందస, సరుబుజ్జిలి, సారవకోట, కోటబొమ్మాళి, పాతపట్నం, బూర్జ, సంతకవిటి, బారువ, శ్రీకాకుళం వన్‌టౌన్, టెక్కలి, ఆమదాలవలస, వీరఘట్టాం పోలీస్ స్టేషన్లకు బి.రామారావు, వై.మధుసూదనరావు, జి.అప్పారావు, జి.వీరాంజనేయులు, వి.రవివర్మ, ఎం.శ్రీనివాసరావు, బి.గణేష్, జి.నారాయణస్వామి, బి.సురేష్‌బాబు, ఎన్.లక్ష్మణ్, పి.సురేష్‌బాబు, వి.అప్పలనాయుడు, వై.రవికుమార్, పి.నర్శింహమూర్తి, ఎన్.సునీల, ఆర్.శ్రీనివాసరావులను నియమించారు. ఇందులో కొంతమంది ఒక్కో పోలీస్ స్టేషన్‌కు రెండో ఎస్‌ఐగా విధులు నిర్వహించనున్నారు.
పారదర్శకంగా ఓటరు జాబితా
శ్రీకాకుళం, జనవరి 23: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా ఉండాలని, ఆ దిశగా అధికారుల పనితీరు కనబరచాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్నికల జాబితా పరిశీలకులు బి.వెంకటేశం అధికారులను ఆదేశించారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికల గడువు సమీపిస్తుందన్నారు. ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే ఓటరుకు ఓటుహక్కు కలిగి ఉండాలని స్పష్టంచేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన దిశా నిర్ధేశం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో మాత్రమే అందరికి సమాన స్థాయి ఓటుహక్కు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఆ దిశగానే బూత్‌లెవల్ స్థాయిలో ఏజెంట్ల నియామకం ప్రక్రియ కూడా ప్రవేశపెట్టామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు ఫారం-6, 7, 8లను పూర్తిచేయాల్సిందిగా సూచించారు. సాధారణంగా ఓటుహక్కు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అదో ఆస్తిలాగా..నేటివిటిలా కొంతమంది భావిస్తున్నారన్నారు. ఇతర జిల్లాల నుంచి ఓటర్లను ఇక్కడికి తీసుకువచ్చి ఓటు వేయిస్తున్నారంటే అధికారులు తయారు చేసిన ఓటరు జాబితా సక్రమంగా లేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని గత ఎన్నికలకాలంలో నిర్లక్ష్యంగా వహించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో పరిసర ప్రాంతాలు, కేంద్రాలను నిర్ధేశించిన అధికారులు పరిశీలించాలని సూచించారు. గతంలో ఓటరు స్లిప్పులను వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లకు అందిస్తే..ఈసారి ఎన్నికలకమిషన్ స్వయంగా వాటిని పంపిణీ చేస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పరచుకుని ఏజెంట్ల నియామకం దగ్గర నుంచి ఎన్నికలు పారదర్శకంగా జరిగేవరకూ వారి సహకారం తీసుకోవాలసిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఫారం-6 నమూనాను పూర్తిచేయాలనుకుంటే కాలమ్-4ను కూడా పూర్తి చేయాలని, అప్పుడే ఓటరు నమోదు అప్లికేషన్ పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టంచేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 31వ తేదీనాటికి ఓటర్ల తుదిజాబితా ప్రకటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 18, 19 సంవత్సరాలు నిండిన సుమారు 25 వేల మందిని కొత్త ఓటర్లుగా నమోదుచేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, ఆర్డీఒలు గణేష్‌కుమార్, తేజ్‌భరత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అరబిందోలో పేలుడు
* ముగ్గురికి గాయాలు
రణస్థలం, జనవరి 23: మండలం పైడిభీమవరం పారిశ్రామిక వాడలోని అరబిందో పరిశ్రమలో గురువారం బాయిలర్ పేలిన సంఘటనలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులకు గాయాలయ్యాయి. బాయిలర్ వద్ద ఒకేసారి పెద్దశబ్ధం రావడంతో అక్కడే పనిచేస్తున్న ఎం.వంశీకృష్ణ, అప్పలశ్రీకాంత్, అశోక్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. పరిశ్రమ సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంకు తరలించారు. జరిగిన సంఘటనను తెలుసుకుని సి.ఐ.టి.యు నేతలు గోవిందరావు, తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు తదితరులు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. రసాయనిక పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
3.65 లక్షల గృహాల మంజూరు
ఎచ్చెర్ల, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు 13.65 లక్షల ఇళ్లను మంజూరుచేసిందని హౌసింగ్ ఎం.డి బి.వెంకటేశం తెలిపారు. గురువారం మండల కేంద్రంలో నిర్మిత కేంద్రాన్ని, హౌసింగ్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 23 మేరకు మంజూరైన ఇళ్లలో 2.47 లక్షల ఇళ్లు రూప్‌కాస్ట్‌లెవల్‌లో ఉన్నాయన్నారు. 1100 మండలాల్లో హౌసింగ్ కార్యాలయాలను నిర్మించామన్నారు. ఈ కార్యాలయాల్లో లబ్ధిదారుల సందేహాలను నివృత్తిచేసేందుకు పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా పొందుపరిచామని తెలిపారు. తప్పుడు ఇళ్లు చూపి బిల్లు పొందాలని లబ్ధిదారులు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు. శాటిలైట్ ద్వారా నిర్మాణాలు పూరె్తైన ఇళ్ల ఫొటోలను సేకరిస్తున్నామని చెప్పారు. కర్నూలు, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో శాటిలైట్ ప్రొగ్రామ్‌ను పూర్తిచేశామన్నారు. త్వరలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఈ తరహా ప్రొగ్రామ్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, ఇతర మెటీరియల్‌ను అందజేస్తున్నామన్నారు. సమాచార కేంద్రాలు లబ్ధిదారులకు ఏ మేరకు పనిచేస్తున్నాయన్న అంశాలపై ఆరాతీశారు. నిర్మిత కేంద్రాల ద్వారా గృహ లబ్ధిదారులకు లోకాస్ట్ మెటీరియల్‌ను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నామని, వీటిని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈయనతోపాటు హౌసింగ్ పి.డి రామనర్సింగరావు, ప్రత్యేకాధికారి శ్రీరాములు, ఇ.ఇ నారాయణ, డి.ఇ మోహనరావు, ఎ.ఇ గురునాధంలు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎం.డి
మండల కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని హౌసింగ్ ఎం.డి పరిశీలించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో రాజారావు పేర్లు ఎక్కువ ఉండటానికి గల కారణాలపై ఆరాతీశారు. దీనిపై మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావు మాట్లాడుతూ రాజమ్మ గ్రామదేవత కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉండడంవల్ల ప్రతీ ఇంటి వద్ద ఈ పేరును పెట్టడం ఆనవాయితీ అని సుస్పష్టం చేశారు. ఈయనతోపాటు తహశీల్దార్ బి.వెంకట్రావు, ఆర్.ఐ శ్రీనివాసరావు, విఆర్వో సుబ్రహ్మణ్యంలు ఉన్నారు.
జీడితొక్క లారీల్లో గంజాయి రవాణా
ఆమదాలవలస, జనవరి 23: జీడితొక్క, కర్రపొట్టు పేరుతో లారీల్లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో జీడితొక్క, కర్రపొట్టు, తవుడు తదితర వాటిలో కొందరు వ్యాపారులు గంజాయి రవాణాను సాగిస్తున్నట్లు తెలిసింది. పైపైన జీడితొక్క బస్తాలు వేసి లోపల గంజాయి బస్తాలను వాహనాల్లో ఎక్కించి అధికారులు, పోలీసుల కళ్లుగప్పి దర్జాగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సరిహద్దుల్లో ఉన్న ఒడిశా గ్రామాల్లో కొందరు వ్యాపారులు, గిరిజనుల వద్ద గంజాయిని చిన్న, చిన్న మూటలతో కొనుగోలు చేసి ఆయా గ్రామాల్లో ఓ చోట నిల్వ ఉంచి వీటిని జీడితొక్క లోడు లారీలలో వేరే ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ఒడిశా గ్రామాలైన గుమడ, జగన్నాధపురం, గుణుపూర్, కొరమ, గుసండి, బద్రా తదితర గ్రామాల్లో పండిస్తున్న గంజాయిని ఆయా వ్యాపారులు గిరిజనుల వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ నుండి కొత్తూరు, హిరమండలం, ఆమదాలవలస మీదుగా విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాలకు గంజాయి తరలివెళ్తుందని తెలుస్తోంది. ఇటీవలి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎసీబోగీలో కొందరు ఒడిశా యువకులు 150 గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఒడిశాలో గిరిజనుల వద్ద కిలో 1200 రూపాయలకు కొనుగోలు చేసి ఆయా దళారులు హోల్‌సేల్ వ్యాపారికి రెండువేల రూపాయలకు విక్రయిస్తే, ఆంధ్రాలో కిలో ఎనిమిదివేల నుండి పదివేల రూపాయల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజులకోసారి ఐదు, ఆరు వ్యాన్‌లతో ఆమదాలవలస మీదుగా, విశాఖపట్నం తదితర పట్టణాలకు జీడితొక్క పేరుతో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మధ్య మధ్యలో ఎవరైనా అధికారులు, మార్కెట్ కమిటీ చెక్‌పోస్టులవద్ద గానీ తనిఖీచేస్తే వ్యాన్‌కు మామూళ్లను సంబంధిత అధికారులు వసూలు చేసి విడిచిపెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణాలోపం, మామూళ్ల వసూళ్లతో గంజాయి అక్రమంగా రాష్ట్రాలు దాటిపోతోంది.
నిఘా వేస్తాం
గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని, దీనిపై ప్రత్యేక నిఘా వేస్తామని ఎస్సై బి.మంగరాజు తెలిపారు. అనుమానం వచ్చిన లారీలను, వ్యాన్‌లను అప్పుడప్పుడు తనిఖీ చేస్తున్నామన్నారు. ఇక నుండి జీడితొక్క, కర్రపొట్టు లారీలు, వ్యాన్‌లపై మరింత నిఘా పెడతామని ఎస్సై స్పష్టంచేశారు.
ఎన్నికల జాబితా పవిత్రమైనవి
* అధికారుల పనితీరు భేష్ : ఎన్నికల పరిశీలకులు వెంకటేశం
పాతశ్రీకాకుళం, జనవరి 23: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో పవిత్రమైనవని ఎన్నికల పరిశీలకులు బి.వెంకటేశం పేర్కొన్నారు. ఒక మతానికి మత గ్రంథం ఎలాంటిదో ఎన్నికలకు ఓటర్ల జాబితా కూడా అంత పవిత్రమైనదిగా చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులు సహకరించాలన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఓటర్ల నమోదు, పేర్లు చేర్పులు,మార్పులు తదితర అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం తనను ఎన్నికల పరిశీలకునిగా నియమించిందని తెలిపారు. జిల్లాలో కలెక్టర్ సౌరభ్‌గౌర్ నేతృత్వంలో అధికారుల పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. 18, 19 సంవత్సరాలు నిండిన వారు 25 వేల మంది వరకు కొత్త ఓటర్లుగా నమోదు కావడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ సౌరభ్‌గౌర్ పాల్గొన్నారు.
3 నుండి నిరవధిక సమ్మె
* సమ్మె నోటీసు ఇచ్చిన మున్సిపల్ కార్మికులు
శ్రీకాకుళం , జనవరి 23: తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మున్సిపల్ కార్మికులు ఫిబ్రవరి మూడవ తేదీ నుండి సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు గురువారం ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులంతా మున్సిపల్ హెల్త్ అధికారి చల్లా రవికిరణ్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవఅధ్యక్షులు పంచాది పాపారావు, సిటు సీనియర్ నాయకులు విజికె మూర్తిలు మాట్లాడుతూ గత అక్టోబర్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు కనీస వేతనం 12,500రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. కరువుభత్యం వర్తింపజేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణం అనుసరించి పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బంది పెంచాల్సి ఉన్నప్పటికీ, నేటికి అమలు కాలేదన్నారు. కార్మికులకు ఇళ్లస్థలాలు, గుర్తింపుకార్డులు, కారుణ్య నియామకం వంటి డిమాండ్లు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. తమ కోర్కెల సాధనకు సమ్మె తప్పదని తలంచి ఫిబ్రవరి మూడవ తేదీ నుండి సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్.వెంకయ్య, రత్నాల చిట్టిబాబు, ఎస్.రామకృష్ణ, కె.హేమ, ఎ.శారద, ఎ.రాజేశ్వరి, దానాల జగదీష్, ఎన్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ విద్యాదీవెన అందరి బాధ్యత
* ఐటిడిఏ పి.ఒ సునీల్‌రాజ్‌కుమార్
పాతపట్నం, జనవరి 23: రాజీవ్ విద్యాదీవెన అమలు అందరి బాధ్యత అని ఐటిడిఏ పి.ఒ సునీల్‌రాజ్‌కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కార్యక్రమం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాపౌట్ల నివారణే లక్ష్యంగా రాజీవ్ విద్యాదీవెనను అమలుచేశారన్నారు. ఈ పథకానికి తహశీల్దార్, ఎంఇఒ, ప్రధాన ఉపాధ్యాయులు, బ్యాంకర్లు కలసి సమిష్ఠి బాధ్యతతో పనిచేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఆరువేల మంది విద్యార్థులను ఈ పథకం అమలుకై గుర్తించామని, వీరికి ప్రతీ ఏటా 16.16 కోట్ల రూపాయల ఉపకార వేతనాన్ని చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకై ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డి.ఇ.ఒ డి.ఎస్.సుబ్బారావుతోపాటు ఎంపిడిఒ సలాన చిరంజీవి, ఎం.ఇ.ఒ త్రినాధరావుతోపాటు పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి తహశీల్దార్లు పాల్గొన్నారు.
సాయితత్వం సేవకు మార్గం
సారవకోట, జనవరి 23: షిరిడీసాయితత్వాన్ని అవగాహన చేసుకుంటే సేవామార్గంలో పయనించగలమని సాయి సేవాట్రస్టు ప్రతినిధి డి.వీర్రాజు తెలిపారు. జిల్లాలో ఆనందపురం గ్రామంలో నిర్మించిన వంద అడుగుల ఎత్తుగల షిరిడీసాయి కోటిస్థూపం వార్షికోత్సవం సందర్భంగా సాయిభక్తులు పాదయాత్ర నిర్వహించారు. గురువారం మండలంలో పాదయాత్రను నిర్వహించిన సందర్భంగా అలుదు గ్రామంలో విలేఖరులతో వీరు మాట్లాడారు. జిల్లాలో పలు గ్రామాల నుంచి సుమారు వంద మంది సాయిభక్తులు మండల సరిహద్దు నుండి పాదయాత్రగా మండల కేంద్రానికి చేరుకుని ఆ తదుపరి బుడితి గ్రామానికి చేరుకున్నారు.
యువత ఓటు విలువ తెలుసుకోవాలి
* అదనపు జేసీ రాజ్‌కుమార్
శ్రీకాకుళం, జనవరి 23: యువత ఓటు విలువను తప్పనిసరిగా తెలుసుకోవాలని అదనపు సంయుక్త కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ గురజాడ విద్యాసంస్థల విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం మునసబుపేటలో గల గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఓటుహక్కు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తప్పనిసరిగా ఓటర్ల నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు. ప్రతీ కళాశాలలో ఓటర్ల నమోదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోలీసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్వో నూర్‌భాషా ఖాసీం, గురజాడ విద్యాసంస్థల అధినేత స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ పులకండం శ్రీనివాసరావు, డిపిఆర్వో రమేష్, ఐక్యూ సమన్వయకర్త శ్రీనివాసబాబు, వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విధులపై సర్పంచ్‌లకు అవగాహన అవసరం
నరసన్నపేట, జనవరి 23: దేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి 73వ సవరణలలో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 11వ షెడ్యూల్‌లో 29 అంశాలతో అభివృద్ధి చేసేందుకు బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించారని, దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సి.ఇ.ఒ శీర రమేష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో పోలాకి, నరసన్నపేట, జలుమూరు మండలాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు తమ విధులు ఏ విధంగా నిర్వహించాలో, వారి బాధ్యతలను తప్పనిసరిగా గుర్తెరగాలని, ఆ నాడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. దీనిలో భాగంగా ఇటీవలి నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు మూడురోజుల పాటు శిక్షణా తరగతులను ఏర్పాటుచేశామని వివరించారు. దీనిపై ఆయా సర్పంచ్‌లకు పూర్తిగా అవగాహన కల్పించేలా ఎ.ఎం.ఆర్ అబార్డు సంస్థ ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. మూడురోజుల పాటు విచ్చేసిన సర్పంచ్‌లకు భోజన, వసతి సదుపాయాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటుచేస్తుందన్నారు. అనంతరం సామర్లకోట ఎఫ్.టి.సి, ఫ్యాకల్టీ అధికారిణి డి.ఇ నాగలక్ష్మీ, సుమంతి, డిఆర్‌పిలు సింహాచలం, శ్రీకృష్ణ, మురళీధర్ తదితరుల ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎంపిడిఒలు ఎం.పోలినాయుడు, డి.విద్యాసాగర్, పి.ప్రభావతి తదితరులతోపాటు మాజీసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు టంకాల బాబ్జీ, పంచాయితీ విస్తరణాధికారులు తదితరులు పాల్గొన్నారు.
భోజనాలు ఇలాగేనా
సర్పంచ్‌లకు శిక్షణా తరగతులకు సంబంధించి ఏర్పాటు చేసిన భోజనాలు సరిగా లేవంటూ కొందరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు అధికారులు ఇచ్చిన గౌరవం ఇదేనా అంటూ అలకబూనారు. దీనిపై ఎంపిడిఒ మాట్లాడుతూ భోజనాల విషయంలో తగు శ్రద్ధ తీసుకుంటామని, సర్పంచ్‌లు సహకరించాలని కోరారు.
నేతాజీకి ఘన నివాళి
శ్రీకాకుళం, జనవరి 23: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతిని బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పి.ఎన్.కాలనీ బి.జె.పి. కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం మాట్లాడుతూ నేతాజీ జీవితం యువతకు ఆదర్శం కావాలన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదలి గాంధీజి పిలుపుమేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు మాట్లాడుతూ బ్రిటీష్ వారి నుంచివిముక్తి కలగాలంటే సాయుధ విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమని గట్టిగా విశ్వసించిన వ్యక్తి నేతాజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూడి తిరుపతిరావు, శవ్వాన ఉమామహేశ్వరి, జాతీయ కౌన్సిల్ సభ్యులు సువ్వారి వెంకట సన్యాసిరావు, అట్టాడ రవిబాబ్జీ, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వీరభద్రయ్య, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గొద్దు భాగ్యలక్ష్మీ, జిల్లా కోశాధికారి ఎస్.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పైడి సత్యం, కిషాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు పండి యోగేశ్వరరావు, ప్రధాన మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.
* గాయత్రీ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక గాయత్రీ మహిళా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామి వివేకానంద స్పూర్తితో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ పాసైన మేథావి అని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ మహిళా స్వచ్చంధ సంస్థ అధ్యక్షురాలు శవ్వాన ఉమామహేశ్వరి, విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి, జి.వి.రమణ, భాగ్యలక్ష్మీ జగదాంబ, సాయి, భవాని, తిరుపతి, ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు
శ్రీకాకుళం , జనవరి 23: రాష్ట్ర విభజనతో దేశంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం వుందని జనతా వికాస్ మంచ్ వ్యవస్థాపకులు సాయిప్రసన్న పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే దేశంలోని మిగిలిన రాష్ట్రాల విభజన అంశం తీవ్రమయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇది ఫెడరిజానికే విఘాతం కలుగుతుందన్నారు. ఇప్పటికే 29 రాష్ట్రాలుగా ఉన్న దేశం ఇలా చిన్నచిన్న రాష్ట్రాలను విభజిస్తూ పోతే 50 రాష్ట్రాలను దాటే అవకాశం ఉందన్నారు. ఇది గతంలోవలే సంస్థానాలుగా మారుతాయన్నారు. హిందీ తరువాత తెలుగుభాష మాట్లాడే వారు రెండో స్థానంలో ఉన్నారని, సుమారు 16 కోట్ల మంది తెలుగు మాట్లాడేవారున్నారన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8.5కోట్ల మంది ఉంటే దేశం మొత్తం మీద మిగిలిన వారున్నారని తెలిపారు. ఇంతమంది ఉన్న తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తే బాంబే, జైపూర్ మాదిరి టెర్రరిజం కేంద్రంగా హైదరాబాద్ మారుతుందన్నారు. రాష్ట్రం విభజించాలన్నా, కలిసి ఉండాలన్నా అందుకు ఒక నిబంధన ఉందని, అలా కాకుండా ఏకపక్షంగా విడదీయడం తగదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్సార్సీలు వేసారని, రాష్ట్రంలో అటువంటిది పాటించలేదని విమర్శించారు. తెలంగాణా ఇస్తే రాష్ట్రం రెండు ముక్కలు కాదని, మూడు ముక్కలు అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు రెండో ఎస్సార్సీ వేస్తే పాలకులకు అర్థమవుతుందన్నారు. పాలకులు ఇప్పటికైనా ప్రజల మనోబావాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో సమైక్యవాదులు కొంక్యాణ వేణుగోపాల్, గొలివి నర్శునాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులకు ఆటంకం
*అడ్డుకున్న స్థానికులు
ఎచ్చెర్ల, జనవరి 23: మండలంలో బొంతలకోడూరు పెద్దచెరువు ఆక్రమణదారులను తొలగించాలని లోకాయుక్త ఆదేశించడంతో ఆర్డీఒ సూచనల మేరకు ఉపాధి హామీ సిబ్బంది ఇక్కడ పనులను గురువారం ప్రారంభించారు. విషయంతెలుసుకున్న ఆక్రమణదారులు అక్కడకు చేరుకుని పనులను నిలుపుదల చేయాలని అడ్డుకున్నారు. రైతుకూలీ సంఘం కార్యదర్శి తాండ్ర అరుణ నేతృత్వంలో పలువురు మహిళలు ఉపాధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సమాచారాన్ని ఎ.పి.ఒ సత్యనారాయణ పోలీసు రెవెన్యూ అధికారులకు అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌కుమార్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అందువల్లే ఉపాధి పనులు తక్షణమే నిలుపుదల చేయాలని సర్దిచెప్పడంతో జాబ్‌కార్డుదారులంతా ఇళ్లకు వెనుదిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.