విశాఖపట్నం, జనవరి 23: రాష్ట్రం విడిపోతే, ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో గురువారం మళ్ళ విజయ ప్రసాద్ తన అభిప్రాయాన్ని తెలియచేశారు. దశాబ్దాల తరబడి పాలకులు ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. వౌలిక వసతుల విషయంలో తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర చాలా వెనకబడి ఉందని ఆయన అన్నారు. ముసాయిదా బిల్లు లోపభూయిష్ఠంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ప్రాతికపదికన రాష్ట్రాన్ని విభజిస్తే, ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. విభజనపై ప్రజలు తమను నిలదీస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలని మళ్ల ప్రశ్నించారు. విశాఖకు పోర్టు ఉందని, దీనివలన తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెరాసా సభ్యుడు కెటిఆర్ వ్యాఖ్యానించారని, అది పూర్తిగా సత్య దూరమని విజయప్రసాద్ అన్నారు. విశాఖ పోర్టు బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారని, స్వాతంత్య్రం వచ్చాక ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి పెద్దగా లేదని ఆయన అన్నారు. విశాఖ నగరంలోనే అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై స్పష్టమైన నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. దీనివలన ఆర్‌ఆర్‌బి పరీక్షలు రాయడానికి తమ ప్రాంత విద్యార్థులు ఒడిశాకు వెళితే, అక్కడ ఆంధ్ర ప్రాంత విద్యార్థులపై దాడులు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఇక విడిపోతే, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందని మళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, ఉత్తరాంధ్రకు కొంత వరకూ తాగు, సాగునీరు వస్తుందని ఆశించామని, కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే సందిగ్థంలో పడిందని అన్నారు. సాగునీటి విషయంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలమధ్య వివాదం ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజల నుంచి వసూలైన పన్నులతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని అన్నారు. గడచిన 50 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సీమాంధ్రులు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని మళ్ల అన్నారు. సీమాంధ్రలో తమతమ ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామికరంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. అటువంటి వారు ఇప్పుడు హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ వారు చెపుతున్నారని, దానికి గ్యారంటీ ఏంటని ఆయన ప్రశ్నించారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లిన ఆంధ్ర ప్రజలు వాటిని తమ సొంత ప్రాంతాలుగా భావించరని, హైదరాబాద్‌ను మాత్రం సొంత ప్రాంతంగా పరిగణిస్తున్నారని అన్నారు. తప్పులు తడకగా ఉన్న ముసాయిదా బిల్లును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని మళ్ల స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఐక్యత విషయంలో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికే మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఒడిశా, కర్ణాటక, మహారాష్టల్ల్రో కలసిపోయాయని ఆయన అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలన్న భావనతోనే రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నానని మళ్ల అన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావల్సిన 25 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మళ్ల విజయప్రసాద్ స్పీకర్‌కు అందచేశారు.
విపత్తుల నష్ట నివారణకు ప్రణాళిక
* ఆరు నెలల్లో కైమేట్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్
విశాఖపట్నం, జనవరి 23: విపత్తుల వలన సుందర విశాఖ నగరానికి అప్పుడప్పుడు భారీ నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన క్లైమేట్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించనున్నట్టు జివిఎంసి కమిషనర్ సత్యనారాయణ తెలియచేశారు. జివిఎంసి పాత కౌన్సిల్ సమావేశమందిరంలో రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కమిషనర్ మాట్లాడుతూ సునామి, తుపానులు, వరదలు సంభవించినప్పుడు భారీ ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా నగరవాసులను కాపాడేందుకు పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్న కన్సల్టింగ్ ఫర్మ్ ఆర్‌ఎంఎస్‌ఐకి అధికారులు సహకారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రణాళిక సిద్ధంగా ఉంటే, భవిష్యత్‌లో ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుంటుందని ఆయన తెలియచేశారు. యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి బి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ పార్థసారథి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఇటువంటి ప్రణాళికను రూపొందించడానికి ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు దేశంలోని ఎంపిక చేసిన ఎనిమిది నగరాల్లోరి మన రాష్ట్రంలో ఈ రెండు జిల్లాలు ఉన్నాయని అన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జానకి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 69 మంది ఎస్‌ఐలు బదిలీ
* ఎన్నికల ప్రక్రియలో భాగం
విశాఖపట్నం, జనవరి 23: త్వరలో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేపథ్యంలో సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు, అలాగే, మూడేళ్ళకు పైగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. జిల్లాలో 69 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ దుగ్గల్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ నగరంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌ఐలను గ్రామీణ ప్రాంతానికి బదిలీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వారిని నగరానికి బదిలీ చేశారు.
శరవేగంగా యాగశాలల నిర్మాణం
సింహాచలం, జనవరి 23: సింహగిరిపై ఫిబ్రవరి 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీ సుదర్శన నృసింహ మహాయజ్ఞం నిర్వహణపై దేవస్థానం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ ఉత్తర భాగంలోని ఖాళీ ప్రదేశంలో యాగశాలల నిర్మాణం జోరుగా జరుగుతోంది. అష్టోత్తర శతకుండాత్మకంగా నిర్వహించే ఈ యజ్ఞానికి సంబంధించి 108 హోమకుండాల కోసం ఒకటి సింహాచలేశుని ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేయడం కోసం మరొకటి కలిపి 11 శాలలను నిర్మాణం చేస్తున్నారు. ఆగమశాస్త్రానుసారం దేవాలయ వైదిక పెద్దల సూచనల మేరకు యాగశాలల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కొక్కశాలలో 12 కుండాలు ఏర్పాటు చేస్తారు. ప్రధానమైన 9 యాగశాలల్లో 108 కుండాల నిర్వణకు అవసరమైన రుత్వికుల కోసం మరోవైపు వైదికులు సన్నాహాలు చేస్తున్నారు. హోమంలోకి అవసరమైన కలప కొంత ఇప్పటికే దేవస్థానానికి రావడంతో కూడలిలో వాడుకునేందుకు వీలుగా కలప ముక్కలుగా చేయిస్తున్నారు. యాగం నిర్వహణకు దాతల నుండి కూడా సహకారం తీసుకునేందుకు అధికారులు, వైదికులు సిద్ధంగా ఉన్నారు.
చురుగ్గా దక్షిణ గాలిగోపురం పనులు
సింహాచలం, జనవరి 23: శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయ ప్రాంగణ దక్షిణ గాలిగోపురం పనులు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న గాలిగోపురం పనులు పునాదులు వరకూ వచ్చాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్, కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరాజు గురువారం పనులను పరిశీలించారు. గోపుర నిర్మాణానికి సంబంధించిన శిలల ఉ సిద్ధం చేశారు. శాస్త్ర, సాంప్రదాయాలకు అనుగుణంగా శిల్పాలు చెక్కిన రాళ్ళు తయారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో ఉన్న దక్షిణ గాలిగోపురం ప్రణాళికను అనుసరించి ప్రాంగణ గాలిగోపురం పనులు చేస్తున్నారు. మే నెల రెండవ తేదీన దేవాలయంలో జరుగనున్న ప్రధానోత్సవం చందనయాత్ర నాటికి పూర్తిస్థాయిలో గాలిగోపురం పనులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సింహాచలేశుని దర్శించుకున్న అనంతరం భక్తులు దక్షిణ గాలిగోపురం ద్వారా బయటకు పంపేందుకు దేవస్థానం నిర్ణయించిన నేపథ్యంలో పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు.
చెలరేగిన మిథాలీరాజ్
భారత్ - శ్రీలంక మహిళల వన్‌డే
విశాఖపట్నం, జనవరి 23 : శ్రీలంకతో జరిగిన చివరి వన్‌డే మ్యాచ్‌లో భారతజట్టు కెప్టెన్ మిథాలిరాజ్ బ్యాటింగ్‌లో చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో మిథాలి 8 బౌండరీలు, 2 సిక్సర్లతో 144 నిమిషాలు క్రీడలో నిలిచి 109 బంతులలో అజేయంగా 104 పరుగులు చేసింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మిథాలిరాజ్ హర్మన్‌ప్రీత్‌కారత్‌తో కలిసి 57 పరుగులు, అమిత్ శర్మతో కలిసి 42 పరుగులు, జులన్‌గోస్వామితో కలిసి 81 పరుగులు భాగస్వామ్యాలను నెలకొల్పింది. ఈ సిరీస్‌లో అధ్బుతమైన ఫామ్‌ను కొనసాగించిన ఆమె ఆడిన మూడు మ్యాచ్‌లలో కూడా చివరి వరకు అవుట్‌కాకుండా అజేయంగా నిలవడం విశేషం. శ్రీలంక కెప్టెన్ శశిదళ సిరివర్దనే పలుమార్లు బౌలర్లను మార్చి మిథాలిరాజ్‌ను అవుట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మ్యాచ్ అనంతరం జరిగిన ముగింపు ఉత్సవానికి ఎసిఎ అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు ముఖ్య అతిధిగా హాజరై భారతజట్టుకు ట్రోఫీని అందించారు.
లోపాలను అధిగమిస్తాం
వన్‌డే సిరీస్‌లో భారత జట్టు చక్కని ఆటను ప్రదర్శించిందని శ్రీలంక జట్టు కెప్టెన్ శశికళ సిరివర్దనే ప్రశంసించింది. శ్రీలంక జట్టులో నిలకడ లోపించిందని బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుగు పడాల్సి ఉందని వివరించింది. ఈనెల 28 నుండి జరిగే టి-20 మ్యాచ్‌ల్లో ఈ సిరీస్‌లో చేసిన లోపాలు అధిగమిస్తామని చెప్పింది. జట్టులో ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించలేకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగి చివరి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పేర్కొంది.
జట్టులో ఆత్మ విశ్వాసం పెరిగింది.
ఈ సిరీస్ విజయాలతో జట్టులో ఆత్మ విశ్వాసం పెరిగిందని భారత జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ వ్యాఖ్యానించింది. గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని ఈ సిరీస్ విజయం జట్టులో ఆటగాళ్ళలో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని కలిగించిందని చెప్పింది. బౌలింగ్‌లో స్పిన్నర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. రాబోయే టి-20 మ్యాచ్‌లకు మూడు మార్పులు చేస్తున్నామని పేర్కొంది. జట్టులో మలేరియాతో బాధపడుతున్న నిరంజన్ స్థానంలో వేదకృష్ణమూర్తిని, స్పిన్ బౌలర్లు గెహర్‌సుల్తానా, పూనమ్ యాదవ్‌ల స్థానంలో సోనియా తబీర్, ఏక్‌తబిస్త్‌లను తీసుకుంటున్నట్లు వివరించింది.
పూర్వ వైద్యవిద్యార్థుల గోల్డెన్ జూబ్లీ మీట్
* ఇద్దరు వైస్-చాన్సలర్లు
* వైద్య వృత్తిలోనే అత్యధికం
విశాఖపట్నం, జనవరి 23: విశాఖ నగరంలోనున్న ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసి)లో పూర్వ వైద్య విద్యార్థులు గురువారం కలిసి పాత జ్ఞాపకాలను నెమరివేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. 1963 వైద్య విద్యార్థుల బ్యాచ్‌కు చెందిన దాదాపు 70 మంది వైద్యులు ఒక్కటయ్యారు. వైద్య వృత్తిలో అధిక సంఖ్యలో ఉండగా, ఈ వృత్తితోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఉంటున్న వారు విద్యార్థి దశలోనే చేసిన ఆలోచనలను, అందించే సమాజ సేవలు, వృత్తిపరంగా ఎదగాల్సిన వ్యక్తి ఆలోచనలు, సాధించిన లక్ష్యాల గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా సొంత నిధులకో కెజిహెచ్‌లో రోగులకు వాటర్ ప్లాంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇందులో డాక్టర్ కెఎస్ మోహన్‌కుమార్ ఐఎన్‌టియుసి రాష్ట్ర చీఫ్ వైస్-ప్రెసిడెంట్‌గా వ్యవరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల్లోపనిచేస్తున్న కార్మికుల సమస్యలపై పోరాడుతున్నారు. వైద్యవృత్తిలో కొన్నాళ్ళపాటు కొనసాగిన ఆయన కేవలం వైద్య సేవలపట్ల సంతృప్తి చెందిన ఆయన కార్మికులకు పూర్తిస్థాయిలో సేవలందించే లక్ష్యంగా ఇంటక్ ప్రతినిధిగా ఎదిగారు. అలాగే మరో ఇద్దరు వైస్-చాన్సలర్లు ఇందులో ఉన్నారు. అమెరికాకు చెందిన వారు ఆరుగురు, విశాఖపట్నంనకు చెందిన మరో 20 మంది, పలుచోట్ల ఇంకో 40 మంది అరుదైన కలియికతో విద్యార్థి దశలో అనుభూతులు పంచుకున్నారు. వైద్యులు శ్రీరామ్, శేషగిరిరావు, ఉమా పుష్పవల్ల, ప్రభాకరరావు, జగనాధరావు, వివి రామలక్ష్మి, రాఘవరావు, వైస్-చాన్సలర్లు భాస్కరరావు, పార్ధసారధి, డాక్టర్ కెఎస్ మోహన్‌కుమార్‌లు పాల్గొని భవిష్యత్ కార్యచరణను రూపొందించారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఈ విదంగా కలుస్తూ సమాజానికి అవసరమైన సేవలందించాలని నిర్ణయించారు.
కెజిహెచ్ వద్ద మళ్ళీ గొడవ
* వరుస సంఘటనలతో రోగుల్లో భయాందోళన
* బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సూపరింటెండెంట్
విశాఖపట్నం, జనవరి 23: వైద్యుల నిర్లక్ష్యంతో కెజిహెచ్‌లో ఓ రోగి మృతిచెందాడంటూ బంధువులు గురువారం రాత్రి ఆసుపత్రి గేటు వద్ద నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల కిందట అనాధాశ్రయంలో జీవిస్తున్న ఓ వ్యక్తి కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందడంపట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నగరంలో మురళీనగర్‌కు చెందిన 40 ఏళ్ళ వ్యక్తికి గాయమైంది. దీంతోపాటు కొంతకాలంగా వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో గురువారం ఉదయం కెజిహెచ్‌కు చేరుకున్నాడు. కొన్ని పరీక్షలు జరుపుకున్న అతను క్యాజువాలిటీలోనే ఓ బల్లపైన కూర్చొబెట్టారు. తప్పితే ఇతన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. రోగితో వచ్చిన బంధువులు చికిత్స కోసం పదేసార్లు ప్రాదేయపడిన ఫలితం లేకపోయింది. మధ్యాహ్నాం విధులు నుంచి వెళ్ళిపోయిన, విధులకు హజరైన వైద్యులు సైతం ఏమాత్రం పట్టించుకోలేదంటూ బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. సకాలంలో స్పందించి రోగికి చికిత్స జరిపినట్టు అయితే ఖచ్చితంగా బతికి ఉండేవాడని చెబుతున్నారు. పరీక్షల కోసం కొంత జాప్యం, ఈ తరువాత రోజంతా ఎటువంటి ప్రాథమిక చికిత్స జరుపకుండానే స్ట్రక్చర్‌పై అలాగే ఉంచవడంతో తన భర్త మృతిచెందాడంటూ మృతుని భార్య సూరీడు కన్నీటి పర్యంతమైంది. తాను, పిల్లలు ఏమీ చేయలంటూ రోదిస్తున్న ఆమెను ఆసుపత్రికి వచ్చే వారంతా ఓదార్చుతూనే ఉన్నారు. పరీక్షలు జరపడం కోసం, ఆ తరువాత వాటిని తీసుకురావడంతోనే సరిపోయిందని ఈలోపు తన భర్తీ ప్రాణాలు విడిచాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది.
సౌకర్యాల కొరత
పరీక్షలు ఒకచోట, మందుల పంపిణీ ఇంకోచోట,ప్రాథమిక వైద్య మరోచోట అన్నట్టుగా కెజిహెచ్‌లో పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అత్యవసర సేవలు అందడంలేదు. దీనికి తగినట్టుగా వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది లేకపోవడం మరో శాపంగా పరిణమిస్తోంది. అత్యంత అధునాతన వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోను సాధారణ రోగాలతో కెజిహెచ్‌కు చేరుకున్న రోగులు సైతం ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆసుపత్రి వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
బాధ్యులపై చర్యలు: సూపరింటెండెంట్
పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు. కాలి ఇన్‌ఫెక్షన్‌తో వచ్చిన గొల్ల అనే వ్యక్తికి పరీక్ష జరిపేందుకు సాయంత్రం వరకు ఉంచారని, పరీక్షలు వచ్చిన తరువాత చికిత్స చేయాల్సి ఉండగా, దురదృష్టవశాత్తు ఈలోపే మృతి చెందినట్టు చెప్పారు.
వైద్య సేవలపట్ల ముఖ్య కార్యదర్శి అసంతృప్తి
రెండు రోజుల కిందట కెజిహెచ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం సైతం ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దైవభక్తి కలిగి ఉన్నా రోగులు, వేంకటేశ్వరుని దయవలన మాత్రమే బయటపడతారని, తప్పితే వైద్యుల సేవల వలన కాదంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యాలు ఆసుపత్రి వర్గాలను కదిలించలేకపోతున్నాయి. కాలినడకనే పలు వార్డులు, ముఖ్యమైన విభాగాలను సందర్శించిన ఆయన మూడు గంటలపాటు రోగులకు అందుతున్న సేవలు, సదుపాయల కొరత, పలు లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. కెజిహెచ్‌లో నిర్మాణాలకు మాస్టర్‌ప్లాన్ లేకపోగా, వైద్యులు అందిస్తున్న సేవలు ప్రణాళికబద్ధంగా లేనేలేవంటూ వైద్యులపై మండిపడ్డారు. ఇది రెండు రోజులు కాక ముందే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
* శుక్రవారం రాత్రి 7.05గంటలకు
విశాఖపట్నం, జనవరి 23: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకుని విశాఖ-సికింద్రాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ (08501) ఇక్కడ నుంచి శుక్రవారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్‌కు శనివారం ఉదయం 7.50 గంటలకు చేరుకుతదం. ఇదే ప్రత్యేక రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం (08502) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి మరుసటి రోజున ఉదయం 6.45 గంటలకు వస్తుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసి, రెండు థర్డ్ ఏసి, మరో తొమ్మిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఇంకో ఆరు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ల సదుపాయం కల్పించారు.
వై.ఎస్.ఆర్.సి.పి., కాంగ్రెస్ కార్యకర్తల బాహబాహీ
ఉద్రిక్తతకు దారితీసిన మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
పాడేరు, జనవరి 23: తెలంగాణ బిల్లుకు అనుకూలంగా శాసనసభలో మాట్లాడిన గిరిజన మంత్రి పసుపులేటి బాలరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటన కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో పాడేరులోని గిరిజన మంత్రి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని శాంతిపచేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతుండగా గిరిజన మంత్రి బాలరాజు చేసిన అనుచిత ప్రసంగంపై మంత్రి స్వంత నియోజకవర్గమైన పాడేరు ప్రాంతంలో దుమారం చేలరేగుతుంది. తెలుగుజాతిని, గిరిజన ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన మంత్రి రాష్ట్ర విజభనకు సి.డబ్ల్యు.సి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శాసనసభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సమైక్య ఉద్యమం స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ బాలరాజు ఆక్షేపించడాన్ని ఈ ప్రాంత నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇందులోభాగంగా మంత్రి బాలరాజుకు వ్యతిరేకంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు గురువారం పాడేరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి నేతృత్వంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి మంత్రి నివాసం ఎదుట ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు సమైక్యాంధ్ర ద్రోహి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేసారు. వై.ఎస్.ఆర్. కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా మంత్రి ఇంటిలోనే ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది బైటకు వచ్చి వీరికి ఎదురుగానే నిల్చొని జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల వారి మధ్య పరస్పరం దూషణల పర్వం చోటుచేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వీరిని వారించేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట సంబవించి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. కాంగ్రెస్ నాయకులు తమపై అకారణంగా దాడికి యత్నించారని ఆరోపిస్తూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి నివాసం ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో వీరికి ఏమాత్రం తగ్గన్నట్టు కాంగ్రెస్ నాయకులు కూడా నినాదాలు చేయడంతో ఈ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాడేరు ఎస్.ఐ. హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వై.ఎస్.ఆర్. నాయకులతో ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుకున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలియచేస్తుండగా తమపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు ఈశ్వరి, ఎస్.వి.వి.రమణమూర్తి, మత్స్యరాస వెంకట గంగరాజు వివరించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వంపూరి గంగులయ్య జోక్యం చేసుకుంటూ తాము దాడి చేయలేదని, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కార్యకర్తలే తమపై దాడికి ప్రయత్నించారంటూ చెప్పడంతో మళ్లీ ఇరువర్గాల వారి మధ్య వివాదం రాజుకుని దూషణలకు దిగారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు పెంపుడు కుక్కులు డౌన్ డౌన్ అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించడంతో వివాదం చల్లారింది. పాడేరు పట్టణ నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులలో చర్చానీయాంశంగా మారింది.
ఆదిమజాతి గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు
ఐ.టి.డి.ఎ. పి.ఒ. వినయ్‌చంద్
అరకులోయ, జనవరి 23: విశాఖ మన్యం ఆదిమజాతి గిరిజన గ్రామాల అభివృద్ధికి (పి.టి.జి.వి.డి.) చర్యలు తీసుకుంటున్నట్టు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. మండలంలోని సిరిగాం పంచాయతీ దిబ్బవలస మారుమూల గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రామసభ ద్వారా ఆదిమజాతి గిరిజనులు ఎందుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిరిగాం గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పి.టి.జి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. పాడేరు ఐ.టి.డి.ఎ. పరిధిలోని 64 ఆదిమజాతి గిరిజన గ్రామాలను ఎంపిక చేసి వాటిని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. తాము ఎంపిక చేసిన ఆదిమజాతి గిరిజన గ్రామాల్లో ఇందిరాఆవాస్ పథకం కింద 11వేల 600 ఇళ్ళ నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా దిబ్బవలస గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఆదిమజాతి గిరిజనులు నివసించే దిబ్బవలసలో మూడు కోట్ల 9 లక్షల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రెండు కోట్ల 70 లక్షల రూపాయలతో సిరిగాం నుంచి దిబ్బవలస వరకూ నూతన రహదారి నిర్మాణం చేపడతామన్నారు. అదే విధంగా దిబ్బవలసలో 20 లక్షలతో సి.సి.రోడ్డు, మురుగుకాలువలు, 10 లక్షలతో సామాజిక భవనం, ఆరు లక్షలతో అంగన్‌వాడీ భవనం, మూడు లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మించనున్నట్టు ఆయన వివరించారు. పి.టి.జి. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గానూ నూతనంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. దిబ్బవలస మారుమూల గ్రామం అభివృద్ధికి ప్రత్యేకంగా ఎ.పి.ఒ., సి.సి.లను నియమిస్తామని, వారి పర్యవేక్షణలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కాఫీ గింజలను ఎండబెట్టేందుకు వీలుగా కాఫీ బోర్డు, ఐ.కె.పి. సంయుక్తంగా ప్లాట్‌ఫారం నిర్మిస్తాయని ఆయన చెప్పారు. నేలపై కాఫీ గింజలను ఎండబెట్టడం వలన గింజలు దెబ్బతిని గిట్టుబాటు ధర లభించే అవకాశం లేకుండా పోతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఐ.కె.పి. అధికారులను ఆయన ఆదేశించారు. సంఘాల సభ్యులతో వారానికి ఒకసారి సమావేశమై వారికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వాలని ఆయన సూచించారు. పి.టి.జి. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని గుర్తించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరామన్నారు. అపారిశుధ్యం వలన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున డ్వాక్రా గ్రూప్, పాఠశాల విద్యాకమిటి నిర్మాహకులు, గ్రామస్తులు కలిసికట్టుగా అపారిశుధ్యాన్ని పారద్రోలాలని ఆయన సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం 70 లక్షలతో కాటేజీలు నిర్మించనున్నామని, అదే విధంగా గిరిజన సంస్కృతి మ్యూజియం అభివృద్ధికి 40 లక్షల రూపాయలు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. ట్రెక్కింగ్ కోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు విజయ్‌చంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు టి.డబ్యు.ఇ.ఇ నాయుడు, ఐ.కె.పి. ఎ.పి.ఎం. కృష్ణారావు, టి.డబ్లు.,పి.ఆర్ అసిస్టెంట్ ఇంజనీర్లు చిన్నం నాయుడు, సిమ్మన్న, శ్రీను, గ్రామరెవిన్యూ అధికారి లక్ష్మి పాల్గొన్నారు.
సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు
కీలక నేతల కోసం పోలీసులు ఆరా !
* కొనసాగుతున్న గాలింపులు చర్యలు
నర్సీపట్నం, జనవరి 23: ఆంధ్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులపై పోలీసులు నిఘా పెరిగింది. గత మూడు నెలలుగా మన్యంలో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల నెపంతో నరమేధానికి పాల్పడడంతో పోలీస్ ఉన్నతాధికారులు వీరి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ఎ. ఓ.బి.లో కీలక బాధ్యతలు వహిస్తున్న విశాఖ మన్యానికి చెందిన కీలక నేత అనారోగ్యంతో ఈప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులకు స్పష్టమైన సమాచారం అందడంతో అతను ఆచూకీ కోసం వేగుల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఒక వైపు పోలీసు అధికారులు మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. గత ఏడాది చివరి మాసంలో హత్యలకు తెగబడిన మావోయిస్టులు తాజాగా గ్రామాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వారనుకున్న వారితో మాట్లాడుతూ కార్యక్రమాలు విస్తృత పరిచారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలపై అంతగా దృష్టి పెట్టని మావోయిస్టులు గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో నామినేషన్లు వేసిన కాంగ్రెస్, వై ఎస్సార్ సి.పి.ల అభ్యర్థులను గుంజీలు తీయించి ఉప సంహరించుకోవాలని వత్తిడి తీసుకువచ్చారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తుడిని కిడ్నాప్ చేసి వదిలిపెట్టి, తరువాత మరో మహిళను కిడ్నాప్ చేసి కొన్ని రోజుల తరువాత విడిచిపెట్టారు. ఒక పక్క పోలీసు గాలింపు చర్యలు ఎక్కువ అవుతున్నప్పటికీ గ్రామాల్లో మావోయిస్టులు తిష్టవేసి తమ కార్యక్రమాలను చేసుకుపోతున్నారు. . ఈనేపధ్యంలోనే ఇటీవల జిల్లా రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ , ఓ. ఎస్.డి. దామోదర్, డి ఎస్పీ అశోక్‌కుమార్‌లు సాహసంతో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన సాగులలో పర్యటించారు. గత మూడు దశాబ్దాల్లో ఎస్పీ స్థాయి అధికారి ఈ ప్రాంతంలో మొదటి సారి పర్యటించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వలనే ఇక్కడ ఎస్పీ పర్యటించి మావోయిస్టులకు చెక్ పెట్టడంతో పాటు పోలీసులకు మరింత మనోథైర్యాన్ని కల్పించడం కోసమే ఆయన మావోయిస్టు ప్రభావిత గ్రామాన్ని ఎంచుకుని పర్యటించినట్లు తెలుస్తోంది. ఒక పక్క పోలీసులు తమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే, మరో పక్క మావోయిస్టులు చాప కింద నీరుగా తమ ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టులలో కొందరు అనారోగ్యంతో ఉన్నారనే ప్రచారంతో పోలీసు వర్గాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసాయి. ఏది ఏమైనప్పటికీ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు చర్యలు పోలీసులకు, పోలీసుల నిఘా మావోయిస్టులకు సవాల్ మారాయని చెప్పక తప్పదు.
గవరపాలెం గౌరమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి
అనకాపల్లి, జనవరి 23: ఉత్తరకోస్తా జిల్లాలకే ప్రసిద్ధిగాంచిన స్థానిక గవరపాలెం గౌరీపరమేశ్వరుల జాతర మహోత్సవాన్ని ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు. ప్రతీయేటా జనవరి నెలాఖరు శనివారం విధిగా జరిగే ఈ ఉత్సవ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేసామని తెలిపారు. గవరపాలెం పరిసర ప్రాంతాల్లో వినూత్న తరహాలో, విభిన్నరీతిలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్క్రతిక, జానపద నృత్యరూపకాల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన వాల్‌పోస్టర్స్‌ను ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు విడుదల చేసారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష అప్పారావునాయుడు, మాజీ ఎంపిపి కొణతాల అప్పారావు, ఉత్సవ కమిటీ కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు తదితరులు ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు. భారీ విద్యుద్ధీకరణ లైటింగ్‌తోపాటు గవరపాలెం పరిసర ప్రాంతాల్లోన్ని అన్ని ప్రధాన కూడళ్లలో సాంస్క్రతిక, జానపద నృత్య రూపకాల ప్రదర్శనలను ఏర్పాటు చేసామన్నారు. దాదాపుగా కోటి రూపాయల వ్యయంతో నిర్వహించే ఈ జాతర మహోత్సవానికి జిల్లా నుండే కాక రాష్ట్రం నలుమూలల నుండి పదిలక్షల మంది యాత్రికులు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. జాతరను తిలకించేందుకు వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు కొణతాల ప్రసాద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొణతాల మురళీ, ఉత్సవ కమిటీ కోశాధికారి కొణతాల నూకమహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల పెంపునకు గురువులదే బాధ్యత
ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్ ఉద్బోధ
పాడేరు, జనవరి 23: గిరిజన ప్రాంతంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు గురుతర బాధ్యత వహించాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఉద్బోధించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయ సమావేశ మందిరంలో ఏజెన్సీ పదకొండు మండలాల విద్యాశాఖ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మన్యంలో విద్యా ప్రమాణాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమ పనితీరుపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తెరగాలని ఆయన హితవు చెప్పారు. విద్యార్థుల జీవితాలను నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపై ఉందని ఆయన చెప్పారు. విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకునే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందుకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను కూడా బాధ్యులుగా చేసి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సి.ఆర్.పి.ల విధి నిర్వహణ పట్ల మండల విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రాధమిక పాఠశాలలకు మంజూరు చేసిన నిధులతో పాఠశాలలకు సున్నం, విద్యుత్ వంటి సదుపాయాలను కల్పించాలని ఆయన చెప్పారు. అభివృద్ధికి వ్యయం చేసిన నిధులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 2007-08 సంవత్సరం నుంచి ఇంతవరకు ఏజెన్సీకి రెండు వేల వంద అదనపు తరగతి గదులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. అదనపు తరగతి గదుల ప్రగతిపై ఎం.ఇ.ఒ.లు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు స్వయంగా సర్వే చేసి ఫొటోలతో సహా వచ్చే నెల 10వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఎ.) మంజూరు చేసిన పాఠశాలల భవనాలపై విధిగా ఎస్.ఎస్.ఎ. లోగో ముద్రించాలని ఆయన సూచించారు. ప్రాధమిక పాఠశాలలకు మంజూరు చేసిన నిధులు, మధ్యాహ్నా భోజన పథకం అమలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరు చేసిన నిధుల రికార్డులు, హాజరు పట్టీలు, విద్యార్థులకు మంజూరు చేసిన యూనిఫాం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని వినయ్‌చంద్ ఆదేశించారు.