నిజామాబాద్ టౌన్, జనవరి 27: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం అధిక సంఖ్యలో కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుండి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకోగానే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను ఛేదించుకుని లోనికి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద ట్రాక్టర్‌ను అడ్డంగా పెట్టి కార్యకర్తలు లోనికి చొచ్చుకేళ్లకుండా చేశారు. దీంతో అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు వారిని చెదగొట్టేందుకు ప్రయత్నించారు. అనంతరం అధికారుల సూచన మేరకు పదిమంది సిఐటియు నాయకులను లోనికి పంపించారు. ప్రగతిభవన్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్‌కు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. సిఐటియు నాయకులు రమేశ్‌బాబు, సిద్ధిరాములు తదితరులు మాట్లాడుతూ, గతంలో సమ్మె పిలుపులో భాగంగా ప్రభుత్వం దిగివచ్చి అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేరస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వెంటనే బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని, పౌష్టికాహారాన్ని ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు బకాయి ఉన్న బిల్లులను చెల్లించకపోవడంతో అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. కార్యకర్తలను అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఎలాంటి కారణం లేకుండా సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను 20 రోజులలో పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
సిఐటియు నాయకులపై కలెక్టర్ ఆగ్రహాం
కాగా, తమ డిమాండ్ల సాధన కోసం వినతిపత్రం అందచేసేందుకు వెళ్లిన సిఐటియు నాయకులపై కలెక్టర్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఓ సంఘటనలో కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలను సస్పెండ్ చేసిన విషయాన్ని కలెక్టర్ ఎదుట సిఐటియు నాయకులు రమేశ్‌బాబు, సిద్ధిరాములు ప్రస్తావించారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు
english title:
s
Date:
Tuesday, January 28, 2014