జుక్కల్, జనవరి 27: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ అన్నారు. ఆయన సోమవారం జుక్కల్ మండలం పెద్దగుల్లా, బిజ్జల్‌వాడి, పెద్దఎడ్గి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. బిజ్జల్‌వాడి, పెద్దగుల్లాలో 5 లక్షల చొప్పున నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దఎడ్గిలో 18 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు పాఠశాల గదులను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన హామీ మేరకు తాను ఎమ్మెల్సీ కోటాలోని నిధులన్నింటిని జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. ఈ సెగ్మెంట్‌లో తాగునీటి నివారణ కోసం 16 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు తాను చేసిన కృషి ఫలించిందన్నారు. త్వరలో కౌలాస్‌తో పాటు నాలుగు గ్రామాలకు సాగునీరు అందించేందుకు 2 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయని అన్నారు. సరిహద్దు గ్రామాలపై దృష్టి సారించి, సాగునీటి వసతి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, సిసిరోడ్ల నిర్మాణాలకు కృషి చేస్తున్నానని అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సహాం కనిపిస్తోందన్నారు. అందువల్ల కార్యకర్తలు కలిసికట్టుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీపటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నాగ్‌నాథ్‌పటేల్, జుక్కల్ సొసైటీ అధ్యక్షుడు మనోజ్‌పటేల్, సర్పంచ్‌లు వెంకట్‌గౌడ్, రాజప్ప, కాంగ్రెస్ నాయకులు మాణిక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్
english title:
a
Date:
Tuesday, January 28, 2014