
తెలుపు చేసే తమాషా అంతా ఇంతా కాదు. అన్నింటా తానై ఉండే ఈ తెలుపు రంగును ఇష్టపడనివారు కూడా ఉండరు. ఎందుకంటే ఎముక తెలుపు, పాలు తెలుపు, సందేశాలను పంపేందుకు ఉపయోగించే పేపరు తెలుపు, మెరిసే ముత్యం తెలుపు, ముత్యాల్లాంటి దంతాలు తెలుపు, కణం తెలుపు, శీతాకాలంలో కురిసే మంచు తెలుపు అన్నింటికంటే ముఖ్యం ప్రతి రాత్రి మనల్ని పలకరించే చందమామా తెలుపు..అబ్బ! అన్నింటిలో తానై మెరిసే తెలుపు ప్రశాంతతకు ప్రతిరూపంగా, కాంతికి చిరునామాగా, పరిశుభ్రతకు, అందానికి చిహ్నాంగా మన నిత్యజీవితంలో అలరారుతోంది. ఇంట్లో తెలుపు కనిపిస్తే చాలు ఆ ఇంటి ఇల్లాలి నడవడిక, మనస్తత్వాన్ని ఇట్టే గ్రహించవచ్చు.
తెలుపు వైభవం
ఇళ్లలో మనకుండే స్థలాన్ని బట్టి గార్డెన్‌ను పెంచటానికి ఆసక్తి చూపిస్తుంటాం. గార్డెన్‌లోనూ, పోర్టికోలోనూ, బాల్కానీలోనూ తెల్లపూల కుండీలను ఏర్పాటుచేసుకుంటే అక్కడ ప్రశాంతతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే తెల్లటి పూలు కనిపిస్తే ఆ ఇంటి ఇల్లాలిని ప్రశాంతమైన, అందమైన మనస్తత్వం గలది భావించవచ్చు. అలాగే పూల బొకేల్లో వాడే పువ్వుల్లో తెలుపుపువ్వు లేకుండా ఉండదు. ఫొటో ఫ్రేములకు వేసే పూల దండల్లో సైతం తెలుపు చోటుచేసుకుంటుంది. గోడలకి పాకించే తీగజాతిలో సైతం తరగని తన అందాలను వెదజల్లుతోంది. వేదిక అలంకరణలో తెల్ల తులిప్ పువ్వులు తప్పనిసరిగా వాడతారు. గేర్బారాస్ పువ్వులు ఎన్ని రంగులు ఉన్నా వాటిలో రెండు తెల్లపువ్వులు ఉంటే చాలు ఆ పూల సోయగాలే వేరు.
ఎన్ని రకాలో..
చిటికెను వేలంతా కూడా లేని విరజాజి పూల నుంచి వీచే సువాసన మత్తెక్కిస్తోంది. భార్యభర్తల మధ్య గుప్పెడు మల్లెలు చాలు ఎన్ని గుసగుసలు వినిపిస్తాయో! గార్డెన్జ్, పొడర్ పఫ్ఫ్, బౌహినియా, ప్లూమేరియా, డాటురా, ట్రమ్పెట్ రకాలను పూలకుండీల్లోనూ, గార్డెన్‌లోనూ పెంచుకోవచ్చు. బోగన్‌విల్లాస్, పెరివింకిల్, ప్రిస్టైని తదితర పువ్వుల మొక్కలను స్థలం ఎక్కువగా ఉంటే, లేదా అటవీ ప్రాంతంలాంటి చోట్ల పెంచుకుంటే బాగుంటుంది. లీడ్‌వర్ట్స్, పిరమిడ్, బైండింగ్ వీడ్, క్రీపింగ్ ఫాక్స్‌గ్లోవ్ లాంటివి కూడా ఈ ప్రాంతాల్లో పెంచుకోవచ్చు. భవనాల ప్రవేశ ద్వారాలకు, గోడలకు, తీగలకు, హేంగింగ్ గార్డెన్‌లలో బ్రిడాల్ బక్వెట్, జెవెల్ వైన్, వైట్‌లేడీ, వైట్ కొరాల్‌వైన్, పేపర్ పువ్వులను పెంచుకుంటే అతిథిలను ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. అలాగే ఇళ్లల్లో పెంచుకునే పండ్ల చెట్లకు అంటే బొప్పాయి, పెరట్లో పెంచుకునే కరివేపాకు చెట్లకు కూడా తెల్లపూల కాసే లతలను పాకిస్తే పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, కనువిందు చేసే అందం ఆ ఇంట్లో నెలకొంటుంది. పారిజాతం చెట్టు ఉంటే ఆ ఇంట్లో తెల్లారేసరికి తెల్ల కార్పెట్ పరిచినట్లు పూలు పడతాయి. జాస్మిన్, చాంపక్ పూలను ఇష్టపడని మగువలే ఉండరు.
పచ్చటి ఆకుల మధ్య తెల్లపూలు పూస్తే మొక్కకే కాదు ఇంటికే అందం. ఆ పూల నుంచి వెదజల్లే సువాసనలు గమ్మత్తుగా ఉన్నా ఇలాంటి మొక్కలు మనల్ని అటెన్షన్‌లో ఉంచుతాయి. రాత్రి వేళల్లో అవి వెదజల్లే సువాసనలను ఆస్వాదించే అదృష్టమే మనకు లేకుండాపోతుంది. ఎందుకంటే దొంగల భయం వల్ల కిటికీ తలుపులు సైతం మూసేసుకొని పడుకుంటాం. గార్డెన్జ్, ప్లూమేరియా, జాస్మీన్, మల్లె, మరుమల్లె లాంటివి పెంచుకుంటే శుభ్రంగా ఉండే ఆ గదులలో సువాసనలు వెదజల్లేందుకు సింథటిక్, కెమికల్స్‌లాంటివి వాడాల్సిన అవసరమే మనకు ఉండదు. తెల్లపూలు ఎక్కువశాతం రాత్రివేళల్లో వికసిస్తాయి. అందుకే వీటిని నైట్‌క్వీన్స్ అంటారు. ఇవి వికసించే సమయంలో రాత్రివేళల్లో కొన్ని కీటకాలు, పురుగులు సైతం ఈ పూల కోసం వచ్చి మకరందాన్ని జుర్రుకుంటాయి. పగలు పుష్పాల మీద వాలిన సీతాకోకచిలుకలను, తూనీగలు తదితర వాటిని పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ, చిత్రాలను చూసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తాం.
కాని రాత్రివేళల్లో కూడా ఈ సీతాకోకచిలుకల వలే ఉంటే కీటకాలు, పురుగులు కూడా అపుడే వికసిస్తున్న పువ్వులపై వాలి మకరందాన్ని తీసుకునే దృశ్యాలు ఎంతమంది చూడగలుగుతున్నారు? కాని చూస్తే ఇంతకన్నా మనోహరంగా ఈ ప్రకృతి కనిపిస్తోంది. కేవలం పూల నుంచి వచ్చే పరిమళాన్ని పసిగట్టి ఆ పూలపై ఈ కీటకాలు వాలుతున్నాయంటే ఆ దృశ్యం ఎంత బాగుంటుందో..! అలాగే పూల పరాగసంపర్కం కూడా రాత్రివేళల్లోనే జరుగుతుంది. కాబట్టి రాత్రివేళల్లో వికసించే తెల్లపూలను ఇంటిలో పెంచితే ప్రకృతిలోని పురుగులు, కీటకాలను కాపాడినవాళ్లమవుతాం.